31, జనవరి 2012, మంగళవారం

‘ప్రవాస’ ముద్ర

‘ప్రవాస’ ముద్ర!.January 10th, 2012
భారతీయుల ప్రపంచవ్యాప్త అస్తిత్వానికి ప్రతీక ‘ప్రవాస భారతీయ దినోత్సం’. మన జాతీయ సాంస్కృతిక తత్వానికి అంతర్జాతీయంగా లభిస్తున్న ‘పరిగణన’కు పతాక ప్రవాసభారతీయుడు. ఈ పతాకం మరోసారి ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాజధాని జయపూర్‌లో శనివారం నుంచి మూడు రోజులపాటు జరిగిన ‘్భరతీయుల’ అంతర్జాతీయ సమ్మేళనం వందకు పైగా దేశాలనుండి వచ్చిన ప్రతినిధులతో ప్రభావ పరిమళాలను వెదజల్లింది. అంతర్జాతీయ భారతీయుడు ఎదుగుతున్నాడు...పెరుగుతున్నాడు-అనడానికి ఈ పదవ ‘ప్రవాస’ ఉత్సవం ప్రబల తార్కాణం! విదేశాలలోని భారతీయుల ప్రభావం పెరుగుతుండడంతోపాటు వారిపై వివిధ రకాల దాడులు సైతం జరుగుతుండడం జయపూర్ సమ్మేళనానికి నేపథ్యం. ఈ దాడులు కేవలం భౌతికపరమైనవి మాత్రమే కాదు. ఆర్థికపరమైనవి, వాణిజ్యపరమైనవి, సాంస్కృతికపరమైనవి! ‘ప్రవాస భారతీయుల’ భద్రతను కాపాడడంకోసం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గరించి ప్రధాని మన్మోహన్ సింగ్ సమ్మేళనంలో ప్రత్యేకంగా వివరించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. మతరాజ్య నియంతృత్వ వ్యవస్థలున్న పర్షియా సింధుశాఖ-గల్ఫ్-ప్రాంత దేశాలలో మాత్రమే కాక అమెరికా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి ‘సర్వమత సమభావ’ ప్రజాస్వామ్య దేశాలలో సైతం ‘్భరతీయులపై’, ‘్భరతీయ సంతతి’పై వివిధ రకాల ‘వివక్ష’లు దాడిచేస్తూనే ఉన్నాయి. అమెరికా వంటి దేశాల సంకుచిత-ప్రొటక్షనిస్ట్- ఆర్థిక విధానాలు వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరిమివేసాయి. ఆస్ట్రేలియాలోనూ, బ్రిటన్‌లోనూ భారతీయులపై భౌతికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ‘గల్ఫ్’దేశాలలో నివసిస్తున్న ఆరవైలక్షల మంది భారతీయుల భద్రత కరవైపోయిన సంగతి స్వయంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు! ఈ దేశాలలోని భారతీయుల సామాజిక అస్తిత్వం అడుగంటి పోవడం ‘ప్రవాస’ ప్రస్థానంలోని ప్రధాన వైపరీత్యం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటిన్నర మంది ప్రవాస భారతీయులకు ‘ఓటింగ్’ హక్కును కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం హర్షణీయ పరిణామం కావచ్చు! కానీ తాము నివసిస్తున్న దేశాలలో వివిధ రకాల ‘వివక్ష’లకు గురికాకుండా ఈ ప్రవాస ప్రజలను రక్షించడానికి తీసుకోదలచిన నిర్దిష్ట చర్యలేమిటో మాత్రం మన్మోహన్ సింగ్ తెలియజేయలేదు. నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయులు మరింత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తమ మూలాలకు ఆలవాలమైన దేశంలో మరింత గట్టి బంధాన్ని పెంచుకోవాలన్నది భారతీయ సంతతికి చెందిన విదేశీయులకు ఆయనిచ్చిన సలహా! అయితే ఆయా దేశాలలోని భారతీయ సంతతి పౌరుల రాజ్యాంగ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అధికారాలకు భంగం వాటిల్లజేస్తున్న ప్రభుత్వాలతో ఈ సంగతిని చర్చించడానికి మన ప్రభుత్వం సర్వదా సంసిద్ధంగా ఉందా? లేదన్నది దశాబ్దుల చరిత్ర చాటుతున్న వాస్తవం!
ట్రినిడాడ్, టొబాగో, గయానా, మారిషస్, పిజీ వంటి చిన్న దేశాలలో భారతీయ సంతతివారు ఒకప్పుడు మెజారిటీగా ఉన్నారు. వీరంతా అప్పుడు హిందువులు. కానీ నిరంతరం జరిగిన మతం మార్పిడుల కారణంగా తాము ఒకప్పుడు భారత దేశానికి చెందినవారమన్న ధ్యాస ‘్భరతీయ సంతతి’లో తగ్గిపోయింది. అందువల్ల ఆయా దేశాల్లో ‘్భరతీయసంతతి’ ‘మైనారిటీ’గా మారిపోయింది. ఈ దేశాలకు భారతీయులు స్వయంగా వెళ్ళలేదు. బ్రిటిష్‌వారు మనదేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో ఈ భారతీయులను ఆయా దేశాలకు తరలించుకొని పోయారు! ఇప్పటికీ ఈ దేశాల్లో ‘్భరతీయ సంతతి’వారు ప్రధాన రాజకీయ పదవుల్లో ఉన్నారు. జయపూర్ ఉత్సవానికి ప్రధాన అతిథిగా హాజరైన కమలా ప్రసాద్ విశే్వశ్వర్ వంటివారు ఇందుకు నిదర్శనం. కానీ ఇలాంటి చిన్న దేశాలలో భారతీయతా ప్రభావాన్ని తగ్గించడానికి దశాబ్దులుగా తీవ్రస్థాయిలో ‘కృషి’ జరుగుతోంది. ఈ ‘కృషి’ నిజానికి కుట్ర. భారతీయ సంతతి వారు ప్రధానమంత్రి పదవిని అధిష్టించకుండా నిరోధించడానికై ఫిజీలో పాతికేళ్ళుగా సైనికపరమైన తిరుగుబాట్లు, రాజకీయ నియంతృత్వాలు కొనసాగుతున్నాయి. గయానాలో భారతీయులపై 1980 దశకంలో మొదలైన దాడుల తీవ్రత తగ్గినప్పటికీ వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. ఫ్రాన్స్‌లోను, కెనడాలోను భారతీయమైన వేషధారణపై ముఖ్యంగా సిక్కుల ఆహార్యంపై ఆంక్షలు విధించే ప్రయత్నాలను ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. బర్మా ఒకప్పుడు మనదేశంలో భాగం. అక్కడే పుట్టిపెరిగిన ముప్పయి లక్షలమంది ఇప్పుడు భారతీయ సంతతిగా చెలామణి అవుతున్నారు! వీరంతా ఉద్యోగాలను ఆస్తులను ఉపాధిని క్రమంగా కోల్పోతున్నారు. దాదాపు నాలుగున్నర లక్షలమంది ఇలాంటి భారతీయ సంతతి ప్రజలు ‘పౌరసత్వంలేని’-స్టేట్‌లెస్- శాశ్వత శరణార్ధులుగా అలమటిస్తున్నారట! మలేసియాలోని భారతీయ సంతతి బతుకులు మరింత దుర్భరంగా ఉండ టం మన ప్రభుత్వాలకు ధ్యాసలేని మరో వైపరీత్యం. అక్కడ ప్రభుత్వమే హిందూ ఆలయాలను నిర్మూలించిన తీరు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. మలేసియా హిందువులు తమ దుస్థితిని గురించి 2007లో ఐక్యరాజ్య సమితికి సైతం ఫిర్యాదు చేసారు!
ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన సంపన్న ప్రతినిధులను మనదేశంలో ఇతోధికంగా పెట్టుబడులను పెట్టమని కోరడంలో తప్పులేదు. కానీ సమ్మేళనానికి రాలేని లక్షలాదిమంది భారతీయ సంతతి వారు తమ దేశాల్లో వౌనంగా రోదిస్తున్నారు. వారి ‘వాణి’ ప్రవాస ఉత్సవాల సందర్భంగా వినబడడం లేదు. అలాంటి లక్షలాది భారతీయుల సమస్యలు పరిష్కారానికి ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖవారు ఇకముందైనా శ్రద్ధ వహించినట్టయితే ఈ ఉత్సవాలకు నిజమైన సార్థకత సమకూడుతుంది. విదేశాలలో ఉన్న భారతీయులు తాత్కాలిక ‘ప్రవాసం’లో ఉన్న పౌరులు. వీరి దేశభక్తి భారత్‌పట్ల మాత్రమే ఉండాలి. విదేశాల పౌరసత్వం స్వీకరించి ఆయా దేశాల జాతీయ జీవన స్రవంతిలో భాగమైన వారు శాశ్వత ప్రవాసులైన భారతీయ సంతతివారు. ఇలాంటివారు తమతమ దేశాలపట్ల భక్తిని కలిగిఉండాలి. కానీ భారతీయ సంతతిపై దాడులు జరిగిన సమయంలో మన ప్రభుత్వాలు అ సమస్యలను ఆయాదేశాల ‘ఆంతరంగిక అంశాలు’గా భావిస్తున్న సందర్భాలే ఎక్కువ! దేశ విభజన తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోను మిగిలిపోయిన హిందువులు సైతం ఇలాంటి భారతీయ సంతతివారే! అఫ్గానిస్థాన్‌లో ధ్వంసమైన బుద్ధుని విగ్రహాలు, మలేసియాలో కూలిన ఆలయాలు ప్రవాస భారతీయ సమస్యలేనన్న ధ్యాసకూడా మన ప్రభుత్వాలకు కలగాలి! వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన ప్రవాస భారతీయులకు అవార్డులను ఇవ్వడం హర్షణీయం. విదేశాలలో స్థిరపడి శాస్త్ర సాంకేతిక వాణిజ్య రంగాలలో తమ ప్రభావం చూపగలుగుతున్న వారు చాలామందే ఉన్నారు. కానీ ఆయాదేశాలలో భారతీయ సాంస్కృతిక ప్రభావ ముద్రలను వేయగలుగుతున్న వారు ఎంతమంది? ప్రతి దేశానికి జాతీయ సంస్కృతి ప్రత్యేకం! విదేశాలలో ఉంటున్న భారతీయులు ఈ ప్రత్యేకతను నిలుపుకున్నప్పుడే ‘ఉత్సవానికి’ నిజమైన సార్థకత!

భాగస్వామ్య ‘భాగ్యం

భాగస్వామ్య ‘భాగ్యం’!.January 14th, 2012
భారతీయ పారిశ్రామిక సమాఖ్య - సిఐఐ- వారు హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల ‘్భగస్వామ్య’ సదస్సు విజయవంతం కావడం ఆశ్చర్యకరం కాదు. పెట్టుబడులను పెట్టి లాభాలను ఆర్జించదలచుకున్న వాణిజ్య పారిశ్రామికవేత్తలకు సంస్థలకు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాలు దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించడలేదు. అందువల్ల మన రాష్ట్రానికి పెట్టుబడులను తరలించడానికి స్వదేశీయ వాణిజ్య సంస్థలవారు, విదేశాలకు చెందిన బహుళ జాతీయ సంస్థలు ఉవ్విళ్లూరుతుండడం అత్యంత సహజం. పారిశ్రామిక కలాపాలకు ప్రభుత్వం చౌకగా విద్యుత్తును సరఫరా చేస్తోందని మన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గత ఏడాది స్వయంగా ప్రకటించారు. ఇంత చౌకగా మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక కలాపాలకు సమకూర్చడంలేదట! రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల మేర పెట్టుబడులు తరలి వస్తాయన్న ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం సదస్సుకు పూర్వం వ్యక్తం చేసింది. అయితే ఆరు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వివిధ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించినట్టు ముఖ్యమంత్రి శుక్రవారం ప్రకటించారు. అయితే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే ఖరారయ్యాయి. మిగిలిన ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎలా ఉపయోగిస్తారన్నది ప్రధానమైన ప్రశ్న. పారిశ్రామిక ఉత్పాదక కేంద్రాలను ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడం ‘సరళీకరణ’ విధానంలోని ప్రధాన అంశం. పూర్తిగా ప్రభుత్వేతర సంస్థలే ఈ ఉత్పాదక కేంద్రాలను నిర్వహించడం ఒక పద్ధతి. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలను స్థాపించం మరో పద్ధతి! ఈ ప్రభుత్వ ప్రభుత్వేతర- పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్- ఉత్పత్తులను ఎగుమతులను పెంచడానికి దోహదం చేయగలిగినపుడు మాత్రమే సరళీకరణ విధానం సార్థకమైనట్టు! ‘సరళీకరణ’ ఆరంభమై రెండు దశాబ్దులు గడిచిపోయింది! అందువల్ల ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం ఏ మేరకు ఉత్పత్తులను, ఎగుమతులను పెంచింది? అన్నది ఈ ‘్భగస్వామ్య సదస్సు’ సందర్భంగా సహజంగా తలెత్తిన ప్రశ్న! 1990 దశకంలో వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’లో మన దేశం సభ్యత్వం పుచ్చుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం పదే పదే ఒక అంశాన్ని నొక్కి వక్కాణించింది! వౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, పారిశ్రామిక వౌలిక ఉత్పత్తులను పెంచడానికి దోహదం చేసే రంగాలలోకి మాత్రమే విదేశీయుల పెట్టుబడులను అనుమతిస్తామనేది ఆ వక్కాణింపు సారాంశం! కానీ పదిహేను ఏళ్లకు పైగా వౌలిక ఉత్పత్తులను పెంచడానికి ఎగుమతులను ఎక్కువ చేయడానికి విదేశాల పెట్టుబడులు దోహదం చేశాయా? అన్నది తలెత్తుతున్న రెండవ ప్రశ్న! ఇపుడు తరలి రాదలచుకున్న లక్షల కోట్ల నిధులలో ఎంత శాతం పెట్టుబడులు విద్యుత్, చమురు, ఉక్కు, సిమెంటు వంటి ‘వౌలిక’ ఉత్పత్తులను పెంచడానికి దోహదం చేయనున్నాయి? ఈ సంగతిని ప్రభుత్వం ప్రజలకు వివరించాలి!
గురువారంనాడు ఒప్పందాలు కుదిరిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అరవై వేల కోట్ల రూపాయలు ‘వౌలిక’-కోర్ పారిశ్రామిక రంగానికి తరలివస్తుండడం హర్షణీయం. అయితే ఇందులో సగం మన దేశానికి చెందిన సంస్థవారు పెట్టుబడుతున్నారు. మరో ముప్ఫయి వేల కోట్ల రూపాయల ‘వౌలిక’ పారిశ్రామిక పథకానికి విదేశీయ సంస్థతో అనుసంధానమైన మరో స్వదేశీయ సంస్థ నిధులను సమకూర్చుతోంది! అందువల్ల వౌలిక రంగానికి తరలివస్తున్న విదేశీయ సంస్థల పెట్టుబడులు ఎన్ని వేల లేదా లక్ష కోట్లన్నది తెలియవలసి ఉంది! ఉప్పును, సబ్బులను, శీతలపానీయాలను, మంచినీటి సీసాలను ఉత్పత్తి చేయడానికి, పప్పులను మిరపకాయలను కొని పంపిణీ చేయడానికి, వినోద పరిశ్రమను విహార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి బహుళజాతీయ సంస్థలు అత్యుత్సాహం చూపిన సంగతి ఇంతవరకూ నడిచిన చరిత్ర! ఈ కలాపాలను పారిశ్రామిక పథకాల మాటున చెలామణి చేయడం వల్ల బహుళ జాతీయ సంస్థలు భారీగా లాభపడినా వారు పెట్టుబడులు వౌలిక సదుపాయాలను ఉత్పత్తులను పెంచలేదు, ఎగుమతులను పెంచలేదు. లాభాలను విదేశాలకు తరలించడానికి మాత్రమే ఈ ‘పెట్టుబడులు’ ఇంతవరకు దోహదం చేశాయి. ఇపుడు అణువిద్యుత్, సౌర విద్యుత్ వంటి ఉత్పత్తులను పెంచడానికి ఎన్ని సంస్థలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అందజేస్తున్నాయి? వౌలిక సదుపాయాల కల్పనకోసం వ్యవసాయ భూమిని కాజేసిన ‘ఎమ్మార్’ సంస్థ ఆ తరువాత ఏమి చేసిందన్నది భవిష్యత్తుకు గుణపాఠం కావాలి!
అమెరికావారి ‘మొన్‌సాం టో’ కంపెనీ తరహాలో వ్యవసాయ రంగంలోకి చొరబడడానికి మరో విదేశీయ సంస్థ సిద్ధంగా ఉందన్నది భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెద్దగా ప్రచారం కాని మరో అంశం! ఈ మొన్‌సాంటో కంపెనీ వారి బిటి విత్తనాల ధరలు రైతుల రక్తాన్ని పీల్చుతున్నాయి. అమెరికా ఐరోపా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అలమటిస్తున్నాయి. గ్రీసు దేశంలో తిండి దొరకని ప్రజలు ఇళ్లను వదిలి వలసపోతున్నారు ఇతర ప్రాంతాలకు!! అలాంటపుడు అమెరికా ఐరోపా దేశాలు ‘బహుళ జాతీయ సంస్థలు’తమ దేశాలలో పెట్టుబడులు పెట్టి తమ దేశాలను ఉద్ధరించుకోక నిధులను మన దేశానికి తరలించడమే విచిత్రం. ఈ ‘్భగస్వామ్య సదస్సు’లో ‘్భరత-అమెరికా భాగస్వామ్యం’ ఒక అతి ప్రధాన అంశమైపోయింది! పదిహేను సంవత్సరాల వరకు ప్రభుత్వాలకు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేని ‘ప్రత్యేక ఆర్థికమండలి’- సెజ్- సదుపాయాలు ఈ సంస్థలకు ఆ దేశాలలో లేవు! అందువల్ల మన ఉత్పత్తులను ఎగుమతులను పెంచడానికి కాక తమ లాభాలను పెంచుకొనడానికి మాత్రమే ఈ సంస్థల పెట్టుబడులను ఉపయోగించడం ఖాయం. ఇపుడు వ్యవసాయ రంగంలోకి ‘పరిశోధన’ పేరుతో జొరబడనున్న విదేశీయ సంస్థ మొక్కజొన్న, వరి, పత్తి, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు పువ్వు వంటి ‘బిటి’ రకాల విత్తనాలను సృష్టించడానికి లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేయడానికి సిద్ధంగా ఉందట! ‘మొన్‌సాంటో’ పత్తి విత్తనాలు రైతుల ఆత్మహత్యలకు కారణమని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారవౌతోంది. పెట్టుబడుల ప్రహసనంలో ఇలాంటి వైపరీత్యాలే అధికంగా కనిపిస్తున్నాయి! ప్రభుత్వ రంగ చమురు, ఇంధన వాయు సంస్థ- ఒఎన్‌జిసి- వారు కాకినాడ చమురుశుద్ధి కర్మాగారం భాగస్వామ్యం వదులుకున్నారట! ముప్ఫయివేల కోట్ల రూపాయల వాటాలను కొన్న ప్రభుత్వేతర సంస్థ ఈ కర్మాగారంలో యాభై ఒక్క శాతం భాగస్వామ్యం పొందింది! ఈ ‘లావాదేవీ’ని కూడా కొత్త ‘పెట్టుబడి’గా ప్రచారం చేస్తున్నారు!! వియత్నాం సమీప సాగర జలాలలోను, ఆఫ్రికాలోను పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ ‘ఒఎన్‌జిసి’ స్వదేశంలో ‘్భగస్వామ్యం’ ఎందుకు వదులుకుంటోంది? మన ప్రజల నిధులను విదేశాలకు ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వేతర సంస్థల నిధులనే విదేశాలకు తరలించవచ్చు కదా??

పాకిస్తాన్‌లో ‘పరమాధికారం’?

పాకిస్తాన్‌లో ‘పరమాధికారం’?.January 22nd, 2012
పాకిస్తాన్‌లో సైనిక దళాలకు, రాజకీయ దళాలకు మధ్య జరుగుతున్న సమరంలో ఇది కాల్పుల విరమణ ఘట్టం! ఉభయ పక్షాలు సంధికి సంసిద్ధంగా ఉన్నట్టు గురువారంనాడు సంభవించిన పరిణామాల వల్ల ధ్రువపడింది. ప్రధానమంత్రి యూసఫ్ రజాజిలానీ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో స్వయంగా హాజరయి న్యాయమూర్తులకు ఘనంగా గౌరవం ఘటించారు! మరోవైపు, పాకిస్తాన్‌కు తాను తిరిగి రావడం లేదని మాజీ సైనిక నియంత పర్‌వేజ్ ముషారఫ్ ప్రకటించాడు. జిలానీ స్వయంగా తమ ఎదుట హాజరుకావడంవల్ల ‘‘న్యాయవ్యవస్థ ఔన్నత్యం ధ్రువపడినట్టు’’ పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం కూడా సైనిక, సైనికేతర అధికార ధ్రువాల మధ్య ఘర్షణ తీవ్రత తగ్గుతోందనడానికి మరో నిదర్శనం. ‘‘జిలానీ నిజాయతీపరుడు కాదు’’ అని వారం క్రితం వ్యాఖ్యానించిన ధర్మాసనం అధ్యక్షుడు నసీర్ ఉల్‌ముల్క్, తదితర న్యాయమూర్తులు గురువారంనాడు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించడం కూడా సైనిక దళాలకు జిలానీ పట్ల ఆగ్రహం తగ్గిందనడానికి తార్కాణం! కేసును ఫిబ్రవరి ఒకటవ తేదీకి వాయిదావేసిన ఏడుగురు న్యాయమూర్తులు ఆ రోజున జిలానీ స్వయంగా న్యాయస్థానానికి రానవసరం లేదని నిర్దేశించడం కూడా ‘పౌర ప్రభుత్వంపై సైనిక సార్వభౌములకు కలిగిన అనుగ్ర హానికి చిహ్నం. సుప్రీంకోర్టులో సంభవించిన పరిణామాలకు, సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలకు సైనిక దళాలతో సంబంధమేమిటన్న సందేహం పాకిస్తాన్ ‘రాజ్యాంగ చరిత్ర’ను పాలన వ్యవస్థను అర్ధంచేసుకుంటున్న వారికెవ్వరికీ కలుగనే కలుగదు! కార్య నిర్వహణ విభాగం- మంత్రివర్గం, శాసన నిర్మాణ విభాగం జాతీయ శాసన మండలి- న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయడం, పరస్పర అధికార విభజన, నియంత్రణ, న్యాయవ్యవస్థ పరమాధికారం- సుప్రిమస్- వంటి ఆదర్శాలన్నీ ప్రజాస్వామ్య దేశాలలో ఆచరణ యోగ్యమైనవి! కానీ మూడు రాజ్యాంగ విభాగాలను నియంత్రించ గలిగిన సైనిక దళం పరమాధికారం చెలాయిస్తున్న పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థ పరమాధికారం ఋజువైపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం విచిత్రమైన వ్యవహారం! సైనిక దళాల నియంతలు అనుమతించిన పరిధిలో మాత్రమే పాకిస్తాన్ మంత్రివర్గం కాని, జాతీయ శాసన మండలి కాని, సుప్రీంకోర్టు కాని ‘అధికార క్రీడ’లను అభినయించగలవన్నది 1947 నుండి కొనసాగుతున్న చరిత్ర. సైనిక దొర తలచుకున్న మరుక్షణం మూడు రాజ్యాంగ విభాగాల అధికారాలు మాత్రమే కాదు ఉనికి కూడ ఉండదు! ప్రధానమంత్రి కోర్టు ఆదేశాలను శిరసావహించడంవల్ల కానీ, ధిక్కరించడంవల్ల కాని ‘న్యాయవ్యవస్థ’ పరమాధికారం ధ్రువపడుతుందా? సహజంగానే రాజ్యాంగ దత్తమైన పరమాధికారం సుప్రీంకోర్టుకు ఉండాలి కదా! లేదన్న సత్యాన్ని గ్రహించడంవల్లనే న్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకొనడానికై బహుశా న్యాయమూర్తులు అలా వ్యాఖ్యానించివుంటారు! ధ్రువపడింది న్యాయవ్యవస్థ పరమాధికారం కాదు, సైనిక దళాల పరమోన్నత అధికారం!!
సైనిక దళాలు ప్రభుత్వం అదుపాజ్ఞలలో ప్రవర్తించవలసిన ఒక పాలన విభాగం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలలో సహజం! కానీ పాకిస్తాన్ ‘ప్రజాస్వామ్యం’లో ఇప్పుడు సైనిక దళం ప్రభుత్వానే్న అదిలించగలదు, బెదిరించగలదు, హెచ్చరించగలదు, తొలగించగలదు! 2008వ సంవత్సరానికి పూర్వం సైనిక అధికారులు నాలుగుసార్లు తిరుగుబాట్లు చేశారు. 1958లో జనరల్ అయూబ్‌ఖాన్, 1968 జనరల్ యాహ్యాఖాన్, 1977లో జనరల్ జియాఉల్‌హక్ 1999లో జనరల్ పరవేజ్ ముషారఫ్ ఉన్న ప్రభుత్వాలను ఊడగొట్టారు! యాహ్యాఖాన్ తప్ప మిగిలిన ముగ్గురూ పౌర ప్రభుత్వాలనే పడగొట్టారు. కానీ పౌర ప్రభుత్వాన్ని తొలగించే వరకు సైనిక దళాల అధిపతులు ఆయా ప్రభుత్వాలపట్ల ఇతర దేశాలలోవలె విధేయులుగానే ఉండేవారు. కానీ 2008 తరువాత జరుగుతున్నదేమిటి? పౌర ప్రభుత్వంతో పాటు సైనిక దళాలవారు సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. పౌర ప్రభుత్వం ఉన్నట్టు కాదు, ఊడినట్టు కాదు! అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ కంటె సైనిక అధ్యక్షుడు అస్‌ఫాక్ పర్‌వేజ్ కయానీ ప్రముఖుడుగా, ప్రబలుడుగా చెలామణి అవుతున్నాడు. ‘త్రిశంకు’ నరకంలో పాకిస్తాన్ అధ్యక్ష ప్రధానులు అలమటిస్తున్నారు! ఇస్లాం మతం పాకిస్తాన్ రాజ్యాంగ వ్యవస్థలో అవిభాజ్యమైన అంశమన్న విధాన ప్రకటనలను కయానీ పదే పదే గుప్పిస్తున్నాడు! పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం అధిపతి హుజాపాషా మరో అడుగు ముందుకేసి ‘విధానాలను’ తామే నిర్థారిస్తున్నామని బహిరంగంగానే దేశ విదేశాలలో చాటిస్తున్నాడు. ఇదంతా పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలియదా? సైనిక అధికారులు వెళ్లి సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం- అఫిడవిట్ దాఖలు చేయడాన్ని మొదట దుయ్యబట్టిన జిలానీ ఆ తరువాత తోకముడిచాడు! సుప్రీంకోర్టువారు తనపై ‘్ధక్కార నేరాభియోగాన్ని’ నిర్థారించిన వెంటనే జిలానీ చేసిన మొదటిపని కయానీతో రాజీపడిపోవడం! సైనిక దళాలు దేశ భద్రతకు స్తంభాలవంటివని ప్రశంసించడం ద్వారా జిలానీ ‘గండం’ గట్టెక్కాడు! తోక కుక్కను ఆడిస్తున్న దృశ్యం పాకిస్తాన్‌లో వర్తమాన వైపరీత్యం!
పాకిస్తాన్‌లో మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నది ప్రస్తుతం సైన్యం! తాలిబన్లతోను అల్‌ఖాయిదాతోను అమెరికా అప్గానిస్తాన్‌లో తలపడిన నాటినుంచి పాకిస్తాన్ సైనిక దళాలలో అమెరికా వ్యతిరేకత పెరిగిపోయింది! నడుస్తున్న కథకు ఇదీ ఇతివృత్తం! ఫర్‌వేజ్ ముషారఫ్, జర్దారీ, భుట్టో కుటుంబం వారి సమర్థకులు అమెరికా తొత్తులన్నది పాకిస్తాన్ సైనిక దొరతనం ప్రచారం చేస్తున్న వాదం! కయానీ, జిలానీ, ముస్లిం లీగ్- పిఎమ్‌ఎల్- అధినేత నవాజ్ షరీఫ్ వంటివారు అమెరికాను నిరోధిస్తున్న కూటమిలోని పెద్దలు! అయితే తాను జర్దారీ అధ్యక్షతనకల ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’- పిపిపి- చెందినవాడు కావడంవల్ల జిలానీ పరిస్థితి అడకత్తెరలో పోకవలె తయారయింది! జర్దారీపై కేసులను తిరగదోడడం ద్వారా అమెరికా వ్యతిరేకతను బాహాటంగా చాటడం కయానీ విస్తృత వ్యూహంలోని భాగం! కానీ కేసులను తిరగదోడడానికి అధ్యక్షునికి రాజ్యాంగం కల్పిస్తున్న ‘రక్షణ’అడ్డు వస్తోందన్నది జిలానీ చెప్పిన మాట! జర్దారీ అవినీతిపరుడు కావచ్చు! కానీ అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకూ అతగాడిపై న్యాయస్థానాలలో నేరాలను ఆరోపించరాదన్నది రాజ్యాంగ రక్షణ! ఈ సూత్రన్ని వల్లెవేసిన జిలానీ సుప్రీంకోర్టును ధిక్కరించినట్టు కాదు! సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గతంలో ముషారఫ్ తొలగించాడు! నవాజ్ షరీఫ్ ఒత్తిడి కారణంగా జర్దారీ వారందరినీ మళ్లీ న్యాయమూర్తులుగా నియమించవలసి వచ్చింది! ఈ న్యాయమూర్తులు ముషారఫ్‌ను, జర్దారీని తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇదే నేపథ్యం! ‘ప్రజాస్వామ్యం’ ‘పరమాధికారం’ వంటి పదాల వెనుకనుంచి నిక్కి చూస్తున్న వికృత వాస్తవం ఇదీ!

వైవిధ్య విరోధం!

వైవిధ్య విరోధం!.January 25th, 2012
రాజస్థాన్ రాజధాని జయపూర్‌లో జరుగుతున్న సాహిత్య సమ్మేళనం- లిటరరీ ఫెస్టివల్- ఇంతగా రచ్చకెక్కుతుందని నిర్వాహకులు ఊహించి ఉండరు. సల్మాన్ రష్దీని సమావేశాలకు రాకుండా నిరోధించడం ద్వారా మన ప్రభుత్వాలు ‘జయపూర్ రచనల పండుగ’కు మరింత ప్రసిద్ధిని కలిగించాయి! ‘పండుగ’ గురించి అనేక రోజులు ముందుగా నిర్వాహకులు ప్రచారం చేసినప్పటికీ కేవలం సాహిత్యవేత్తలకు మాత్రమే ‘్ధ్యస’ పరిమితమైపోయింది. కానీ సల్మాన్ రష్దీ వంటి ప్రముఖ రచయిత మన దేశానికి రాకుండా నిరోధించడానికి పథకం రచించిన రాజస్థాన్ ప్రభుత్వం సామాన్యులకు సైతం ఈ అంతర్జాతీయ ఉత్సవం గురించి తెలియజెప్పింది. అంతకుమించి, మతోన్మాదం ముందు మోకరిల్లే మనఃప్రవృత్తిని, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమైన స్వభావాన్ని రాజస్థాన్ ప్రభుత్వ నిర్వాహకులు బట్టబయలు చేసుకున్నారు! సల్మాన్ రష్దీ జయపూర్ సమావేశాలకు హాజరయి ఉంటే ఆయన సాహిత్య విశేషాలను ప్రతినిధులు విని ఉండేవారు. ఆయన రాకుండా చేయడం ద్వారా ప్రపంచమంతా మరోసారి రష్దీ రచనల గురించి వినే అవకాశాన్ని రాజస్థాన్ ప్రభుత్వం కల్పించింది! ఒకరు కాదు, నలుగురు ప్రసిద్ధ సాహితీవేత్తలు రష్దీ రచించిన ‘సాతానిక్ వర్సెస్’నుంచి అనేక పంక్తులను జయపూర్ సభా వేదిక నుంచి ప్రపంచానికి వినిపించారు! సాహిత్య సమావేశాన్ని రాజకీయాలకు దూరంగా వుంచి వైవిధ్యాలను, రక్షించాల్సిన ప్రజాస్వామ్య ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంది! ఇంత జరిగిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నోరు విప్పకపోవడం అంతర్జాతీయ సమాజంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత అవమానం కల్గించిన విపరిణామం! అతిగా ప్రతిస్పందించడం - ఎర్రర్ ఆఫ్ కమిషన్- ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం, అసలు స్పందించకపోవడం- ఎర్రర్ ఆఫ్ ఒమిషన్- ద్వారా కేంద్ర ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం పరువు తీశాయి. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని భారతీయ సామాజిక స్వభావం పట్ల వివిధ దేశాల రచయితలకున్న విశాసాన్ని వమ్ముచేశాయి! జయపూర్ సాహిత్య మహోత్సవ ఇతివృత్తం ‘వైవిధ్యం’!బ్రిటన్‌లోని ‘ఎడిన్‌బరో’ వంటి చోట్ల జరిగే సాహితీ సమ్మేళనాలలో ఒకే సంకుచిత ఇతివృత్తం ప్రాతిపదికగా చర్చలు, గోష్ఠులు, ప్రసంగాలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, జయపూర్ వేదికపై అనేకానేక సాహితీ వైవిధ్యాలు సభలో తీరనున్నాయని నిర్వాహకులు ప్రకటించారు! ఇలా ‘వైవిధ్యం’ ఇతివృత్తం కావడం మన జాతీయ స్వభావానికి అనురూపమైన అంశం! అందరి భావాలకు సమానమైన ప్రతిపత్తిని, అందరి ఆకాంక్షలకు సమానమైన అవకాశాన్ని ప్రసాదిస్తున్న సువ్యవస్థిత ప్రజాస్వామ్య రాజ్యాంగ సమాజం మనది! సల్మాన్ రష్దీ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఆయన జయపూర్‌కు రాకూడదన్న వాదాన్ని వినిపించిన రాజస్థాన్ ప్రభుత్వం మన భద్రతా పటిమను పరువును అంతర్జాతీయంగా అపహాస్యంపాలు చేసింది! ఒక రచయితను మతోన్మాదులు హత్య చేయకుండా నిరోధించలేని స్థితిలో చతికిలపడి వున్నదా మన భద్రతా దళాల పాటవం?
రష్దీ ఇరాన్‌లోని ఇస్లాం వ్ఢ్యల ఆగ్రహానికి గురికావడానికీ అతడు మన దేశాన్ని సందర్శించడానికి మధ్య లంకె పెట్టడం బోడిగుండుకు రుబ్బురోలుకు ముడిపెట్టడం వంటిది. కానీ రష్దీని మన దేశంలోని ముస్లింలు సైతం వ్యతిరేకిస్తున్నారన్న భ్రమకు గురైన రాజకీయవేత్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుండడం ఈ వైపరీత్యానికి కారణం! రష్దీని రానిచ్చినట్టయితే తమ రాజకీయ పార్టీలకు ముస్లింలు దూరమైపోతారన్న భయ విభ్రాంతికి లోనైనవారు మన దేశంలో ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. అందువల్ల ‘పాము చావని కర్ర విరగని’ నీతిని రాజస్థాన్ ప్రభుత్వం కూడ అవలంబించింది. అందువల్ల ముంబయికి చెందిన ముగ్గురు కిరాయి హంతకులు రష్దీని చంపడానికి కుట్ర పన్నినట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రచారం చేసింది. మరి హంతకుల పేర్లు చిరునామాలు స్పష్టంగా తెలిసినప్పుడు వారిని పట్టుకొనడానికి రాజస్థాన్ ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వ నేర నిరోధక బృందాలు కాని ఎందుకని రంగంలోకి దిగలేదు? కథాకథిత హంతకులలో ఇద్దరు ఎవరో ముంబయి పోలీసులకు తెలియదట! ‘అత్లాఫ్ బాట్లీ’, ‘అస్లాం కాంగో’అనీ విచిత్రమైన పేర్లున్న ఇద్దరు కిరాయి హంతకులు కల్పిత పాత్రలు అన్న అనుమానాలను సైతం ముంబాయి పోలీసులు వ్యక్తం చేశారట! మూడవ ‘హంతకుడు’ సాకిబ్ హమీద్ నాచన్ అనే తీవ్రవాది అని పోలీసులు నిర్ధారించారు. 2003నాటి ముంబయి బాంబు పేలుళ్ల ఘటనలో ఈ తీవ్రవాది నిందితుడు. ‘బెయిల్’పొంది బయటపడిన ఈ తీవ్రవాది ముంబయికి సమీపంలోని పద్‌గాంవ్ అన్నచోట నివసిస్తున్నాడట! ఆచూకీ తెలియని వారి సంగతి సరే! పోలీసుల నిఘా వీక్షణాల పరిధిలోనే ఉన్నా ఈ మూడవ బీభత్సకారుడిని పోలీసులు కాని ఇతర భద్రతా దళాలవారు కాని ఎందుకని నిర్బంధించి ప్రశ్నించలేదు? ఈకట్టుకథ గుట్టు రట్టయన తర్వాత కూడా రాజస్థాన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోక పోవడం దురదృష్టకరం. రష్దీ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ ప్రసారం కాకుండా ఆటం కాలు కల్పించడం ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం మరో సారి అప్రజాస్వామిక చర్యకు ఒడిగట్టింది.
రష్దీ 1980వ దశకంలో రచించిన సాతానిక్ వర్సస్- దెయ్యాల పాటలు- అన్న ఆంగ్ల గ్రంథం ఇరాన్‌లోని మతాధికారి అయెతుల్లా ఖొమైనీ ఆగ్రహానికి గురి అయింది. ఈ పుస్తకం ఇస్లాం మతానికి విరుద్ధంగా ఉండటమే అందుకు కారణం. రష్దీని హత్య చేయాలని అప్పుడు ఖొమైనీ ‘్ఫత్వా’ జారీచేశారట. ఈ ‘్ఫత్వా’ జారీకావడానికి ముందుగానే మన దేశంలో కేంద్ర ప్రభుత్వంవారు ఆ గ్రంథాన్ని నిషేధించారు! ఇప్పుడు దాదాపు పాతికేళ్ల తరువాత, ఆ నిషేధం సంగతి కూడా ఎవరికీ గుర్తులేదు. ఇలా గుర్తులేకపోవడం వల్లనే నిషిద్ధ గ్రంథంలోని విపంక్తులను తాము ఉటంకించినట్టు నలుగురు రచయితలూ చెబుతున్నారు! రాజస్థాన్ ప్రభుత్వం వారిపై కేసులు పెడుతుందట! మన దేశం ఒకే మతం తప్ప, మిగిలిన మతాలు పరిఢవిల్లడానికి వీలులేని మత రాజ్యం కాదు. ఇస్లాం మత ప్రభుత్వాలున్న దేశాలన్నింటిలోను ఈ గ్రంథాన్ని నిషేధించవచ్చుగాక! కానీ కొన్ని టర్కీ, ఇండోనేసియా వంటి ముస్లిం జన బాహుళ్యం కల దేశాలలో ఈ పుస్తకాన్ని నిషేధించలేదు! కానీ వివిధ మతాల గురించి వ్యతిరేకంగా రచయితలు కవులు వ్యక్తంచేసే అభిప్రాయాలను నిరోధించడం నిషేధించడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగకరం. ఈ రాజ్యాంగపు హక్కు లేని దేశాలలోవలె మన దేశంలోను గ్రంథాలను నిషేధించడం సిగ్గుచేటు! జమ్మూకాశ్మీర్ మన దేశంలో భాగంకాదని బహిరంగ నివేదికల్ని ఆర్భాటిస్తున్న విద్రోహకులను అరెస్ట్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని సాహసించడం లేదు. ఛత్రపతి శివాజీని నీచంగా కించపరుస్తూ రూపొందిన పుస్తకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పుడు పెద్ద దుమారం చెలరేగింది! తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్దీ వంటి వారిని మన ప్రభుత్వాలు వెళ్ళగొడుతున్నాయి. కానీ భరతమాతను సైతం నగ్నంగా చిత్రీకరించిన ఎమ్‌ఎఫ్ హుస్సేన్ వంటి బౌద్ధిక బీభత్సకారులను మాత్రం అధికార రాజకీయ వేత్తలు ప్రశంసించారు!! వైవిధ్య సమాజానికి రక్షణ ఏదీ?

‘వస్త్ర’ వైపరీత్యం!

‘వస్త్ర’ వైపరీత్యం!
25/01/2012
TAGS:బట్టల వర్తకులు,‘పన్నులను కలిపి విలువ’,రాష్ట్రప్రభుత్వం ఆరంభించిన ‘పన్నుల దాడి’పై వస్త్ర వ్యాపారులు నిరసన అస్త్రాలను సంధించడం శుభపరిణామం. దేశంలో మరే రాష్ట్రంలోను లేని విధంగా వస్త్ర విక్రయాలపై అదనంగా ఐదుశాతం పన్ను విధించడం పట్ల ఆగ్రహంతో దుకాణాలను మూసిన బట్టల వర్తకులు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకోసం కూడా ఉద్యమించినట్టయింది. ఎందుకంటే ‘తాగే వాడే కడతాడు తాడిపన్ను’ అన్న చందంగా చివరికి అన్ని పన్నులూ కలిసిన ధర వినియోగదారుడి నెత్తికెక్కి తొక్కడం సహజ పరిణామం! ఈ పరిణామాన్ని నిరోధించడానికి నడుం బిగించి దుకాణాల తలుపులను బిగించిన వ్యాపారులు అభినందనీయులు. ‘పన్నులను కలిపి విలువ’-వాల్యు యాడెడ్ టాక్స్-ను నిర్ధారించి, బట్టల ధరలను పెంచే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అనేక రీతులుగా వ్యాపారులు వ్యతిరేకిస్తున్నప్పటికీ నిరసన నినాదాలు ప్రభుత్వానికి వినబడకపోవడం నిత్యావసరాల ధరల నియంత్రణ పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. వస్త్రాలపై ఐదుశాతం ‘వాట్’ను విధిస్తూ గత జూలైలో జారీ చేసిన ఉత్వర్వులను ఉపసంహరించకపోవడం వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది చిల్లర వ్యాపారులపట్ల, కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపు కొనసాగుతున్న దనేందుకు సాక్ష్యం!
రాష్ట్రంలో మాత్రమే కాదు దేశం మొత్తం మీద వస్త్ర పరిశ్రమ సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. వేలాదిమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండ డం ‘సామాజిక న్యాయసాధన లక్ష్యాన్ని’ కళంకితం చేస్తున్న పాపం. ఈ పాపానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాల విధానాలు. మన రాష్ట్రంలోనే 2010లో దాదాపు రెండువేల మంది నేతన్నలు ప్రాణాలను తీసుకున్నారుట! ఖాదీ పరిశ్రమ, చేనేత పరిశ్రమ, మరమగ్గాల రంగం, భారీ వస్త్ర పరిశ్రమల రంగం- ఇవన్నీ వివిధ సమస్యలకు లోనై ఉన్నాయి. పత్తి విత్తనాలను కొనుగోలు చేయడంతో మొదలై వస్త్రంగా వినియోగదారుడిని చేరడంతో ముగుస్తున్న మొత్తం ప్రక్రియ క్రమంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల నియంత్రణలోకి వెళ్ళిపోతోంది. ‘బిటి’ పత్తి విత్తనాలను విపరీతమైన ధరలకు అమ్మి దోచి పారేస్తున్న అమెరికా తదితర విదేశీయ సంస్థలకు రాయితీలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపై ‘వాట్’ వేటు వేయడం ప్రజావ్యతిరేక చర్య! చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఎలాంటి రాయితీలు లేకపోవడమే! ప్రభుత్వాలు ప్రకటిస్తున్నట్టు ప్రచారవౌతున్న రాయితీలు ‘బహుళ జాతీయ వాణిజ్యం’ దోపిడీని ఎదుర్కొని రైతన్నలను, నేతన్నలను బతికించడానికి తగినంత స్థాయిలో లేవన్నది ధ్రువపడిన సత్యం. రాయితీలు, సబ్సిడీలు ఆదుకున్నట్లయితే చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? దేశం మొత్తం మీద మన రాష్టల్రోనే ఈ పన్నుల బెడద ఎక్కువగా ఉన్నదని పదమూడవ ‘ఆర్థిక సంఘం’ వారు నిర్ధారించారట! ఇలా నిర్ధారణ జరిగిన తరువాత పన్నులను తగ్గించాలి! రాష్ట్రప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను పెట్టేవారికి కారుచౌకగా -దేశంలోనే అతి తక్కువ ధరకు-విద్యుచ్ఛక్తిని సరఫరా చేస్తుందట! ఇలా చేయకపోతే కార్పొరేటు సంస్థలు ఇక్కడ కేంద్రాలను నెలకొల్పవన్న భయం పీడిస్తున్నది మరి! కానీ తిండిగింజలు, బట్టలు వంటి నిత్యావసరాలపై ఎంతగా పన్నులు పెంచినప్పటికీ చచ్చినట్టు కొంటారన్న ధీమా ప్రభుత్వానికుంది!
ఈ ‘్ధమా’తోనే గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదుశాతం పన్ను విధించింది. వ్యాపారులు ఇంత తీవ్రంగా ప్రతిస్పందిచరని బహుశా ప్రభుత్వం భావించి ఉంటుంది. ఈ పన్ను మొత్తం చివరికి చెల్లించవలసింది వినియోగదారులు కాబట్టి, వారు సంఘటితంగా ఉద్యమించడం అసంభవం కాబట్టి! ‘వాట్’ను మోదడం వల్ల మూలిగేది వినియోగదారులే కాని వ్యాపారులు కారని ప్రభుత్వం ఇన్నాళ్ళూ భావించింది. వ్యాపారులు నిరసనలే కాదు ‘నిరశనలు’ కూడా సంధించడం, రాష్టవ్య్రాప్తంగా దాదాపు లక్ష దుకాణాలు మూతపడడం ప్రభుత్వం ఊహించని పరిణామం! ‘వాట్’ను తక్షణం రద్దు చేయడం తప్పని సరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది! గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా వస్త్రోత్పాదక పరిశ్రమలవారు సమ్మె చేసారు. దేశంలోని దాదాపు 3500 వస్తప్రరిశ్రమలు మూతపడినాయి. పత్తి ఎగుమతులపై విధించిన ‘పరిమితిని’ ఎత్తివేయాలని కోరుతూ అప్పుట్లో సమ్మె జరిగింది. ఏటా యాభై ఐదు లక్షల గట్టా- బేల్-ల పత్తికి మించి ఎగుమతి చేయరాదని 2010 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం విధించిన ‘పరిమితి’ కారణంగా పత్తి నిల్వలు, నూలు నిల్వలు పేరుకొని పోయాయట! ఇలా పేరుకొనిపోయిన నిల్వలను ప్రభుత్వం కొని ఖాదీ, చేనేత పరిశ్రమలకు చౌకధరలకు సరఫరా చేయవచ్చు. కానీ ‘ఖాదీ’కి కేంద్రం కాని, ‘చేనేత’కు రాష్ట్రాలు కాని కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువ! గత మేనెలలో జరిగిన సమ్మె తరువాత మరో ఇరవై ఐదు లక్షల బేళ్ళ పత్తిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది! ఈ ఎగుమతి కారణంగా దేశీయ విపణిలో గిరాకీ పెరిగింది! పెరిగిన ‘గిరాకీ’ని సొమ్ము చేసుకోవాలన్న అత్యాశ రాష్ట్రప్రభుత్వ చర్యకు కారణం! ‘సంక్షేమం’ కాదు ‘వ్యాపార లాభం’ ప్రభుత్వ విధానం!
వ్యాపారులకు మద్దతుగా దర్జీ వృత్తివారు కూడా ఆందోళనలో భాగస్వాములు కావడం ప్రపంచీకరణ ప్రభావం సృష్టించిన వైపరీత్యతకు నిదర్శనం. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలకు, ఋణభారానికి ప్రపంచీకరణ కారణమని బ్రిటన్ యువరాజు దేశాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాడు. కానీ వస్త్ర పరిశ్రమలో ప్రపంచీకరణ తెచ్చిన మార్పుల కారణంగా దర్జీ వృత్తి నిశ్శబ్దంగా నిర్మూలనకు గురి అయిపోతోంది. ధారణయోగ్యమైన-రెడీమెడ్- వస్త్రాల ఉత్పత్తుల కారణంగా బట్టలను కుట్టించుకునేవారు తగ్గిపోతున్నారు. అందువల్ల పనిలేని దర్జీలు ‘యజమాని’ హోదాను స్వతంత్ర జీవనాన్ని వదలిపెట్టి పెద్దపెద్ద ‘గార్మెంట్స్’ ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరిపోతున్నారు. దీనికితోడు చైనా అమెరికాలలోని ‘రెడీమేడ్’ సరకు దిగుమతి అవుతోంది! ‘్ఫ్యషన్’ల ప్రచారం కారణంగా ‘చేనేత’, ‘ఖాదీ’ వంటి స్వదేశీయ ఉత్పత్తులు ఉన్నాయన్న ధ్యాసను కూడా వినియోగదార్లు కోల్పోతున్నారు. ఐరోపా దేశాలకు, అమెరికాకు మధ్య, చైనాకు ఐరోపా దేశాలకూ మధ్య ‘వస్తయ్రుద్ధం’ దశాబ్దులుగా కొనసాగుతోంది. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిబంధనలు లెక్కపెట్టని ఈ దేశాలు సంకుచిత ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నాయి. తయారైన బట్టల దిగుమతులను నిషేధిస్తున్నాయి! కానీ మనదేశంలో మాత్రం విదేశాల బట్టల మోజు పెరుగుతోంది! మన కేంద్రప్రభుత్వం మాత్రం దిగుమతులపై ఆంక్షలను విధించదు! ఇది మొదటి సమస్య! ‘ఎయిడ్స్’ వంటి తక్షణ సమస్యల పరిష్కారానికి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, ‘చేనేత’, ‘ఖాదీ’ వస్త్రాలను విరివిగా ధరించాలని అవగాహన పెంచడానికి దీర్ఘకాల పథకాలను రూపొందించడంలేదు! ఇది రెండవ సమస్య! ఈ రెండు సమస్యలు పరిష్కారం అయ్యేవరకు చేనేత చిక్కుముడి వీడదు! ‘వాట్’ రద్దుకాక తప్పదు! కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాగలదు!

‘హద్దు’ లేని మైత్రి!

‘హద్దు’ లేని మైత్రి!
01/01/1970
TAGS:పునరావృత్తం’ అన్న దానికి సజీవ సాక్ష్యం భారత చైనా సరిహద్దు సంభాషణల ప్రహసనం. సోమవారం మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన పదిహేనవ విడత చర్చల సందర్భంగా ఈ వాస్తవం మరోసారి ధ్రువపడింది! సరిహద్దు వివాదం పరిష్కారంకోసం జరిగిన ఈ చర్చలలో ఎంతో ప్రగతి కనిపించినట్టు చైనా ప్రభుత్వ ప్రతినిధి దారుూబింగువో చేసిన ప్రకటన 2009 ఆగస్టులో ఆయన ఢిల్లీలో చెప్పిన మాటలకు ప్రతిధ్వని మాత్రమే! అప్పటి పదమూడవ విడత చర్చల సందర్భంగా భారత చైనా మధ్య ఎట్టి పరిస్థితిలోను యుద్ధం జరగబోదని బింగువో వాక్రుచ్చిపోయాడు! ఇప్పుడు మళ్లీ అదే మాటలను ఆయన పునరుద్ఘాటించారు! సరిహద్దు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా దశాబ్దులుగా పడి ఉంది! 2010లో చైనాలో జరిగిన పదునాలుగవ విడత చర్చలు కూడ ఇదే విధమైన ‘అద్భుతాల’ను సృష్టించింది! ‘ఉభయ దేశాల మధ్య గతంలో యుద్ధం జరగలేదు. ఇకపై జరగదు’ అన్న ద్వైపాక్షిక స్ఫూర్తి 1950వ దశకం నాటిది. అది అబద్ధమని 1962లో దురాక్రమణ జరపడం ద్వారా చైనా ఋజువుచేసింది. అందువల్ల, 1988 చివరిలో ఉభయ దేశాల మధ్య ‘పథభగ్న’ -పాత్ బ్రేకింగ్- మైత్రీ విధానం మొదలైనప్పటినుంచి భవిష్యత్తులో ఇక ఉభయ దేశాల మధ్య యుద్ధం జరగదని మాత్రమే చైనా ప్రతినిధులు పదే పదే ప్రకటిస్తున్నారు. మన ప్రభుత్వ ప్రతినిధులు కూడ వారితో గొంతులు కలిపి బృందగానాలు ఆలపించడమే అసలైన అద్భుతం! సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి చర్చలు 1990 దశకంనుంచి ఇప్పటివరకు చర్చలు కొనసాగుతుండడమే అద్భుతం! సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత 1990వ దశకంలోనే చైనా రష్యా తదితర పూర్వ సోవియట్ దేశాలలో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొంది. దశాబ్దుల తరబడి వివాదాన్ని పొడిగించలేదు. ఎందుకంటే వివాదం పరిష్కారం కావడంవల్ల చైనాకు కొత్త భూభాగాలు లభించాయి. కానీ మన దేశంలో సరిహద్దు వివాదం పరిష్కారం అయినట్టయితే చైనా తాను ఆక్రమించిన మన భూభాగాలను వదలిపెట్టవలసి వస్తుంది. ఈ సంగతి మనకూ తెలుసు. చైనా ప్రభుత్వానికీ తెలుసు! అందువల్ల నిరంతరాయంగా నిరవధికంగా సరిహద్దు చర్చలను కొనసాగించడమే చైనా వ్యూహంలోని భాగం! వివాదం పరిష్కరించుకోవడంలో చిత్తశుద్ధి ఉన్నవారు ఏదో విధంగా పరిష్కారం సాధించడానికి కృషిచేయాలి. కానీ మొక్కుబడిగా సంవత్సరానికి రెండురోజులపాటు జరిపే ఇలాంటి విందు సమావేశాలకు ‘చర్చలు’అని పేరు పెట్టుకోవడం దారుూబింగువో నుడివినట్టు ఉభయదేశాలు కలిసి సాధిస్తున్న అద్భుతం! పదమూడవ విడత తరువాత జరిగిన ప్రగతి ఏమిటి? నిరంతరం చైనా దళాలు సరిహద్దు రేఖలను అతిక్రమించి మన సీమలలోకి చొరబడడం!!
ఈ చైనా చొరబాట్లను నిరోధించడానికి ఇప్పుడు ఉమ్మడి ‘కార్యాచరణ యంత్రాంగాన్ని’ రూపొందిస్తారట! ఇలాంటి యంత్రాంగాన్ని రూపొందించాలన్నది 2005లో కుదిరిన విస్తృత అంగీకారంలో భాగం! ఆ యంత్రాంగం పనిచేసిన జాడలేదు. ఆ తరువాతనే చైనా దళాలు దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ మన భూభాగంలోకి చొరబడడం ఊపందుకొంది! మన భూభాగంలోకి చొరబడడం, రాళ్లపైన చెట్లపైన నినాదాలు వ్రాయడం, గుడారాలు వేసి అనేక రోజులపాటు తిష్ఠవేయడం వంటి పనులను చైనా దళాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇలాంటి చొరబాట్లకు ఏకైక కారణం చైనా దురాక్రమణ బుద్ధి! కానీ ఉభయదేశాల మధ్య సరిహద్దు రేఖ వాస్తవ ‘్భగోళిక స్థితి’ గురించి అవగాహనలో ఏర్పడి ఉన్న అంతరం వల్ల మాత్రమే చైనా దళాలు మన భూభాగంలోకి చొరబడుతున్నాయని గతంలో మన ప్రభుత్వం తేల్చివేసింది! అంటే మన భూమిని తమ భూమిగా భావించి చైనా దళాలు చొచ్చుకొని వస్తున్నాయన్నమాట! మన ప్రభుత్వమే ఇలా చైనా తరపున ప్రాతినిథ్యం వహించి వాదించడం మరో అద్భుతం! అలాంటప్పుడు ఉభయ దేశాల ప్రతినిధులు కలసినపుడు ఈ సంగతి ప్రస్తావనకు రానేరాదు! కానీ ‘అవగాహన’లో ఉన్న ‘అంతరం’ కారణంగా మన దళాలు చైనా భూభాగంలోకి ఎప్పుడూ కూడా ఎందుకని చొచ్చుకొని పోలేదు? చైనా దళాలు మాత్రమే ఎందుకని ప్రతిసారీ చొరబడుతున్నాయి? అన్న అనుమానం మన ప్రభుత్వానికి కలగకపోవడం అన్నింటికంటే గొప్ప అద్భుతం! అసలీ చర్చలు ఇప్పుడు జరపడమే మరో పరమాద్భుతం! ఎందుకంటే ఈ చర్చలు గత ఏడాది నవంబర్‌లో జరిగిపోయి ఉండాలి! కానీ పదిహేనవ విడత చర్చలు జరగడానికి రెండు రోజుల ముందు టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ఢిల్లీకి వస్తున్నట్టు వెల్లడి కావడంతో చైనా నిరసన తెలిపింది. చర్చలను వాయిదా వేసింది! ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మన ప్రభుత్వం నిరసించకపోవడం మరో అద్భుత వైపరీత్యం!
చైనాతో మనకున్న అతి ప్రధానమైన సమస్య సరిహద్దు సమస్య! కానీ ఇది మూలపడిపోవడం బింగువో చెప్పినట్టు ‘ఉభయ దేశాలు కలిసి సృష్టించిన’ మహాద్భుతం. 1989 ఆరంభంలో మన ప్రభుత్వం ఈ అద్భుతానికి అంకురార్పణ చేసింది. సరిహద్దు సమస్యతో నిమిత్తం లేకుండా చైనాతో మైత్రిని, వాణిజ్య సంబంధాలను, సాంస్కృతిక, దౌత్య సహవాసాన్ని పెంపొందించుకోవాలన్నది ఈ కొత్త విధానం. 1962లో చైనా మన సరిహద్దులను వెన్నుపోటు పొడిచిననాటినుంచి మనకు అతి ప్రధాన లక్ష్యం దురాక్రమణలు గురయిన మన భూమిని విముక్తం చేయడం! కానీ ఈ లక్ష్య సాధన పథాన్ని మన ప్రభుత్వం 1988లో వదలిపెట్టింది! సరిహద్దుతో నిమిత్తం లేని కొత్త విధానాన్ని రూపొందించింది. అందువల్లనే నిజంగా ఇది ‘పాత్ బ్రేకింగ్’ విధానం. ఈ కొత్త బాటన సాగుతున్న భారత చైనా మైత్రి వాణిజ్య శిఖరంపైకి దూసుకొని పోతోంది. బింగువో సోమవారం అన్నట్టు ఇంకా ‘శిఖరంపైకి చేరలేదు’ కానీ గొప్ప ప్రగతి జరిగిపోయింది. ఏమిటా ప్రగతి? చైనా మనకు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఇంతవరకు ఈ స్థానాన్ని పొందిన అమెరికా రెండవ స్థానానికి పడిపోయింది. కానీ దీనివల్ల మన విదేశీయ వినిమయ ద్రవ్యం భారీగా చైనాకు తరలిపోతోంది. మన ఎగుమతులకంటే దిగుమతుల విలువ రెండురెట్లు పెరిగిన కారణంగా గత ఏడాది దాదాపు లక్షా ఇరవైవేల కోట్ల రూపాయల వినిమయ ద్రవ్యాన్ని మనం చైనాకు అదనంగా చెల్లించాము! సరిహద్దు సమస్యను ఇలా మనం మాత్రమే మరచిపోయాము! చైనా మాత్రం సరిహద్దు ప్రాంతమతంటా సైనిక స్థావరాలను ఆయుధ స్థావరాలను పెంపొందించింది. సరిహద్దు చర్చలు మొదలైన తర్వాత దాదాపు పదిహేను ఏళ్ళలో చైనా టిబెట్ అంతటా రైలు రోడ్డు మార్గాలను అత్యాధునికంగా తీర్చి దిద్దింది! చైనాకు మనకు గతంలో యుద్ధం జరగలేదన్న 1950 దశకం నాటి మైత్రి మాటలకు ప్రాతిపదిక. 1959 వరకూ మనకూ చైనాకూ మధ్య టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండటం, టిబెట్‌ను చైనా ఆక్రమించడంతో ‘్భరత టిబెట్’ సరిహద్దు ‘్భరత చైనా’ సరిహద్దుగా మారింది. ఈ చారిత్రక ‘మహాద్భుతం’ మన సరిహద్దు గోడకు కన్నం!

‘అంతరిక్ష’ అవినీతి

‘అంతరిక్ష’ అవినీతి
27/01/2012
TAGS:గత ఏడాది ఫిబ్రవరిలో గుప్పుమన్న ‘అంతరిక్ష’ అవినీతి దుర్గంధాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలు కావడం శుభపరిణామం! అయితే ప్రభుత్వం ప్రకటించిన దిద్దుబాటు చర్యలు అవినీతి తీవ్రతకు తగిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న వైపరీత్యం! భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస థ-ఇస్రో- ప్రతిష్ఠకు విఘాతకరంగా పరిణమించిన ఈ కుంభకోణం గత ఫిబ్రవరిలో బయటపడినప్పుడు దాదాపు రెండు లక్షలకోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు ప్రచారమైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ‘దేవాస్’కు 2005లో కారు చౌకగా అంతరిక్ష ధార్మిక తరంగ వలయాన్ని -వైర్‌లెస్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పేస్ సెగ్మెంట్- కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ. అపురూపమైన ఈ ‘ఎస్ బ్యాండ్’ ధార్మిక తరంగాల -స్పెక్ట్రమ్-ను ‘దేవాస్’కు అక్రమంగా కేటాయించిన సమయంలో ‘ఇస్రో’ అధ్యక్షుడిగా ఉండిన ‘పద్మభూషణ్’ జి. మాధవన్ నాయర్‌ను మరో ముగ్గురు శాస్తవ్రేత్తలను ప్రభుత్వం ఇప్పుడు శిక్షించింది! కానీ ఈ ‘శిక్షల’ తీరును పరిశీలించినట్లయితే మొత్తం విచారణ ప్రక్రియను నీరుకార్చడంలో ఇది భాగమేమోనన్న అనుమా నం కలుగుతోంది! మాధవన్ నాయర్ తదితర ‘ఇస్రో’ శాస్తవ్రేత్తలు దోషులా లేక నిర్దోషులా అన్న విషయమై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి దర్యాప్తు బృందంవారు ఏమి నిర్థారించారన్నది స్పష్టంగా వెల్లడికాకపోవడం ఆ అనుమానానికి ప్రాతిపదిక! ఈ నలుగురు శాస్తవ్రేత్తలను భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిరోధించాలని ఈనెల 13వ తేదీన ప్రభుత్వం నిర్ధారించిందట! ఈ శాస్తవ్రేత్తలు దోషులు అయినట్టయితే ఇది శిక్ష కాజాలదు! ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా వారిపై ‘్ఫర్యాదు పత్రాలను’ దాఖలు చేసి న్యాయస్థానాలలో విచారించాలి. వారు నిర్దోషులైనట్టయితే ఇలా వారిని పదవులనుంచి దూరం చేయడం అన్యాయం అవుతుంది! అందువల్ల ప్రభుత్వం తీసుకున్న చర్య ‘కుంభకోణం’ వాస్తవాలకు అనుగుణంగా లేదన్నది సుస్పష్టం. ఈ శాస్తవ్రేత్తలు నేరస్థులని ధృవపరచడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయా లేదా అన్న విషయం ప్రభుత్వం వెల్లడించి ఉండాలి. అధికారులు మాత్రమే అవినీతి కుంభకోణాలను అమలు జరపడం అసంభవమైన విషయం. దేశంలోని అన్ని రకాల అవినీతి పనులకు అసలు సూత్రధారులు రాజకీయవేత్తలు. వారిని నడిపిస్తున్న ఘరానా వాణిజ్య పారిశ్రామిక వేత్తలు! మరి ఈ ‘అంతరిక్ష’ కుంభకోణంలో రాజకీయ భామికను నిర్వహించిన ప్రముఖులెవరు? మంత్రులెవరు? పదకొండు నెలల దర్యాప్తు తర్వాత కూడా ఈ సంగతి ఎందుకని నిర్ధారణ కాలేదు? ‘ఇస్రో’ ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలోని ‘అంతరిక్ష పరిశోధనా మంత్రిత్వ విభాగా’నికి చెందినది.
‘ఇస్రో’వారి వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తున్న సంస్థ పేరు ‘అంట్రిక్స్’ కార్పొరేషన్ లిమిటెడ్. ‘అంట్రిక్స్’ నిర్వాహకులకు, ‘దేవాస్’కు మధ్యనే ప్రధానంగా చర్చలు, అవగాహనలు, అంగీకారాలు, ముడుపులు చేతులు మారడాలు వంటివి జరిగిపోయి ఉండవచ్చు. ‘ఆంట్రిక్స్’ ఇస్రో శాస్తవ్రేత్తలను తప్పుదారి పట్టించిన ప్రహసనంలో ప్రధానమంత్రి కార్యాలయం నిర్వాహకుల పాత్ర ఎంతన్నది ఇప్పటికీ బహిర్గతం కాని రహస్యం. ఫిబ్రవరిలో ‘కుంభకోణం’ పుటపుటలుగా బయటపడిన సమయంలోను, ఆతరువాత చిటపటలుగా రగిలిన సమయంలోను కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన స్పష్టీకరణ ఒక్కటే! ‘‘ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు..’’ అన్నది ఆ అధికారిక వివరణ!! మరి నష్టం వాటిల్లినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వారు ఇప్పుడైనా నిగ్గు తేల్చారా? తేల్చివుంటే ఎందుకని వెల్లడించడం లేదు? నష్టం వాటిల్లలేదని ప్రధాని కార్యాలయం వారు ఇప్పటికీ భావిస్తున్న పక్షంలో గత పదకొండు నెలలుగా జరిపిన అనేక చర్చలు అర్థంలేనివైపోతాయి. మాథవన్ నాయర్ ప్రభుత్వంపై మండిపడటానికి ఈ ‘తీరని సందేహం’ ప్రధాన ప్రాతిపదిక కావచ్చు. నష్టం జరుగలేదని ప్రధాని కార్యాలయం ప్రకటిస్తుండిన తరుణంలోనే, గత ఫిబ్రవరిలోనే ‘అంట్రిక్స్’ను ప్రక్షాళనం చేస్తున్నట్టు, పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు ప్రభుత్వం వారు ప్రకటించారు. ‘ఆంట్రిక్స్’వారు ‘దేవాస్’ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి అధ్యక్షతనగల ‘్భద్రతావ్యవహారాల ఉపసంఘం’-సిసిఎస్- నిర్ధారణ ప్రాతిపదికగా ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే ‘ఒప్పందాన్ని’ రద్దు చేసింది. ఈ రెండు చర్యలవల్ల, అక్రమాలు భారీ ఎత్తున జరిగిపోయినట్టు,ధ్రువపడినట్టేకదా! మరి అక్రమాల వల్ల ప్రజా సొమ్మును ఎవరెవరు ఎంత బొక్కారో ఎందుకని తేల్చలేదు? ‘దేవాస్’ నిర్వాహకులను ప్రభుత్వం ఏవిధంగా శిక్షించింది? 2005నుంచి ఐదున్నర ఏళ్ళపాటు ఆ సంస్థ కాజేసిన ప్రజా ధనాన్ని రాబట్టడానికి మార్గం ఏమిటి? ఇవన్నీ తేల్చకుండా నలుగురు శాస్తవ్రేత్తలకు శాశ్వత పదవీ వియోగం కల్పించడం వల్ల ‘దిద్దుబాటు’ జరిగిపోయినట్టేనా??
‘రాజకీయ వాణిజ్య అక్రమ బంధం’ గురించి ప్రజలకు స్పష్టమైన సమాచారం వెల్లడి కాకుండా ఆటంకాలు ఏర్పడడం సమాచార సాంకేతిక రంగంలో ‘విప్లవాత్మక’మైన మార్పులు వచ్చినందువల్ల సంభవించిన విపరిణామం! ‘స్పేస్ స్పెక్ట్రమ్ సెగ్‌మెంట్’పై ‘దేవాస్’ సంస్థకు ఇరవై ఏళ్ళపాటు గుత్త్ధాపత్యం లభించడం 2005లో కుదిరిన ఒప్పందానికి చెందిన ప్రధానమైన అక్రమం. సంస్థల మధ్య పోటీని నిర్వహించకుండా, కనీసం టెండర్లను కూడా పిలవకుండా ‘దేవాస్’ను ఎంపిక చేయడం ప్రక్రియకు చెందిన వైపరీత్యం. ఫలితంగా ‘ఇస్రో’వారి రెండు ఉపగ్రహాలను ‘దేవాస్’ కంపెనీవారు ‘గంపగుత్తగా’ 2011 వరకు వాడుకోగలిగారు. ఇలా అక్రమంగా వాణిజ్య కలాపాలకోసం ‘దేవాస్’ వారు రెండు ఉపగ్రహాలను ఆరేళ్ళు ఉపయోగించినందువల్ల ఎంత లాభం పొందారు? ‘దేవాస్’ వారు గత ఫిబ్రవరిలో చెప్పిన కథ ప్రకారం ప్రభుత్వం కాని, ‘ఇస్రో’ కాని ఆ సంస్థకు ఎలాంటి ‘స్పెక్ట్రమ్’ను కేటాయించలేదట! మరి ‘దేవాస్’ సంస్థ సమాచార వ్యవస్థ ఎలా నడిచింది? ‘ఆంట్రిక్స్’ నుండి అద్దెకు తీసుకున్న ఉపగ్రహాలద్వారా తాము సేవలు అందించినట్టు దేవాస్ వారు గత ఫిబ్రవరిలో చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి ‘అద్దె’ అంగీకారం కుదిరినట్టు ప్రధాని కార్యాలయం వారికి గత ఫిబ్రవరి వరకు తెలియదట! తెలియ జెప్పని వారు ఎవరు? తెలియనట్టు అభినయించిన వారెవ్వరు? ‘ఇస్రో’ వారు దేవాస్ అప్పచెప్పిన రెండు ఉపగ్రహాలు ఏవన్న సంగతి కూడా ఇప్పటికీ స్పష్టంగా వెల్లడించలేదు! ‘జిసాట్-6’ ఉపగ్రహాన్ని తాము ఉపయోగించుకునే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కూడా ‘దేవాస్’ ప్రచారం చేసింది. ‘ఆంట్రిక్స్’ నుండి అద్దెకు తీసుకున్న రెండు ఉపగ్రహాలలో ‘జిసాట్-6’ ఒకటా? కాదా? అన్న విషయమై ప్రభుత్వం కాని, ‘ఇస్రో’ కాని నోరు మెదపలేదు! మొత్తం కుంభకోణానికి నలుగురు శాస్తవ్రేత్తలు మాత్రమే బాధ్యులన్న బ్రాంతిని కల్పించడం ద్వారా అసలు ‘సూత్రధారుల’ను రక్షించడానికి ఇలా అనేక ప్రాతిపదికలు ఏర్పడి ఉన్నాయి! ‘అంతరిక్షం’ వలె అవినీతి స్థాయి కూడా అంతుపట్టడంలేదు!!

అర్థంకాని ఆర్థిక నీతి!

అర్థంకాని ఆర్థిక నీతి!
30/01/2012
TAGS:దీపం పెట్టుకొని ‘దిగనేసే’ పనికి రిజర్వ్‌బ్యాంకు వారు పూనుకొనడం విచిత్రమైన పరిణామం. ఆర్థిక అయోమయత్వం స్పష్టించిన మరో గందరగోళం! వాణిజ్య బ్యాంకులు తమవద్ద విధిగా ఉంచవలసిన ‘నగదునిలువ’-క్యాష్ రిజర్వ్- శాతాన్ని తగ్గించడం ద్వారా రిజర్వ్‌బ్యాంకు నిర్వాహకులు ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి మార్గాన్ని సుగమం చేశారు. ద్రవ్యోల్బణం పెరగడానికి పూర్వరంగంగా నిత్యావసరాల ధరలు విశేషించి ఆహారం ధరలు పెరిగిపోవడం అనివార్యం! ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం గత ఏడాది మొత్తం జరిగిన ప్రహసనం. ఈ ఏడాది ఆరంభం నాటికి విచిత్రంగా ఆహార ద్రవ్యోల్బణం సున్నశాతానికి పడిపోయినట్టు అధికారికంగా నమోదయిపోయింది. ఆ తరువాత అధోముఖంగా-నెగెటివ్- సాగుతున్న ‘ద్రవ్యోల్బణం’ నిజానికి ‘ద్రవ్యమాంద్యం’గా పరిణమించినట్టు ప్రచారం జరుగుతోంది! అందువల్ల ద్రవ్యోల్బణాన్ని మళ్ళీ పెంచడానికి వీలుగా సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన ‘క్యాష్ రిజర్వ్’ను ఆరుశాతం నుంచి ఐదున్నరశాతానికి తగ్గించివేసింది. వడ్డీరేట్లను మాత్రం తగ్గించలేదు. ఇలా నగదు నిల్వను తగ్గించడంవల్ల అదనంగా ముప్పయిరెండు వేలకోట్ల రూపాయలు నగదు రూపం లో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తడం ఖాయమట! ఈ ‘ముంపు’ కారణంగా వినియోగదారుల కొనుగోలుశక్తి పెరిగిపోతుంది. పెట్టుబడులు పెరిగిపోతాయి. ఫలితంగా ‘జాతీయ స్థూల ఉత్పత్తి’-జిడిపి- పెరుగుతుందట. కానీ సమాంతరంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందన్న కఠోర వాస్తవాన్ని మాత్రం రిజర్వ్‌బ్యాంకువారు మూసిపెడుతున్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరింత ముందుకెళ్ళి ఈ ‘తగ్గింపు’ వల్ల ద్రవ్యోల్బణం పెరుగని రీతిలో పెట్టుబడులు, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ ప్రగతి సాధిస్తాయని ‘్ఢంకా’ బజాయించారు. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్‌బ్యాంకు వద్ద నిలువ ఉంచే నగదుశాతం పెరగడం వల్ల, వడ్డీశాతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నది గత ఏడాది మొత్తం జరిగిన ప్రచారం. అందువల్ల గత ఏడాది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంకోసం అనేకసార్లు ‘రిజర్వ్‌బ్యాంక్’ క్యాష్‌రిజర్వ్ రేషియోను పెంచింది. వడ్డీరేట్లను పెంచింది. ‘క్యాష్ రిజర్వ్’ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థనుంచి ఆమేరకు నగదును బ్యాంకులు ఉపసంహరించుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గించడం వల్ల వస్తువులకు గిరాకీ తగ్గి ధరలు తగ్గుతాయట. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. వడ్డీరేట్లు పెరగడం వల్ల వినియోగదారులు బ్యాంకుల్లో ఎక్కువ ‘డిపాజిట్లు’ చేస్తారట! దీనివల్ల కూడా ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గిపోయి ద్రవ్యోల్బణం తగ్గిపోతుందట! అందువల్ల గత ఏడాది మొత్తం ద్రవ్యోల్బణాన్ని, ధరలను తగ్గించడానికి ‘రిజర్వ్ బ్యాంకు’ వారు చేసిన ఏకైక ప్రయోగం వడ్డీరేట్లను, ‘క్యాష్ రిజర్వ్ రేషియో’ను పెంచుకుంటూ పోవడం!! ‘‘మరి ఇప్పుడు ‘క్యాష్ రిజర్వ్’ను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మళ్ళీ పెరుగుతుంది కదా..’’అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానం లేదు.
ద్రవ్యోల్బణం అగ్నికి ఆజ్యం వలె లేదా బొగ్గువలె పనిచేయని రీతిలో పెట్టుబడులు పరిమాణాన్ని, ‘జిడిపి’ అభివృద్ధిశాతాన్ని పెంచడానికి ‘క్యాష్ రిజర్వ్’ను తగ్గిస్తున్న చర్య దోహదం చేస్తుందన్న ఆర్థికమంత్రి అభిభాషణ ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆర్థికవేత్తలకు సైతం అర్థంకాని విషయమిది. సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. వచ్చే మార్చినాటికి సాధారణ ద్రవ్యోల్బణం ఆరు, ఏడుశాతాలకు మధ్యలో ఊగులాడుతూ ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్‌లో బెంగళూరులో జరిగిన దక్షిణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో నుడివి ఉన్నారు. డిసెంబర్ చివరి నాటికి ద్రవ్యోల్బణం తొమ్మిదిశాతానికంటే తగ్గలేదు! అలాంటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి వీలైన చర్యలను చేపట్టడం ద్వారా మార్చినాటికి ఆరుశాతానికి దాన్ని ఎలా తగ్గించనున్నారు? ఆహార ద్రవ్యోల్బణం సున్నశాతానికి చేరిందన్న అధికారిక గణాంకాలు వాస్తవ సామాజిక జన జీవనంలో ప్రతిబింబించకపోవడం మరో వైపరీత్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు తగ్గినందువల్ల ఆహార ద్రవ్యోల్బణం తగ్గిపోయిందట! టమోటో, ఉల్లిపాయల ఉత్పత్తి పెరిగిపోయి గిట్టుబాటు ధరలు లేక వీధులలోను, దిబ్బలలోను పారపోయడం గురించి వార్తలు ప్రసారమయ్యాయి. మరికొన్ని చోట్ల టమోటాలను తెంపకుండా పొలాలలో వదలివేశారట! ఈ కారణంగా రెండు మూడు కూరగాయల ధరలు తగ్గాయి. కానీ మిగిలిన కూరగాయల ధరలన్నీ ఆకాశమంత ఎత్తులోనే అలరారుతుండడం జనానికి తెలిసిన వాస్తవం! అంటే ఆహార ద్రవ్యోల్బణాన్ని విడిగా లెక్కించడం మొదలైన రెండేళ్ళలోనే ఈ పద్ధతి కూడ పనికిరాకుండా పోతున్నదన్నమాట! గతంలో అనేక ఏళ్ళపాటు ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించే పద్ధతి తప్పులతడకగా మారినట్టు 2009లో వెల్లడయింది. ద్రవ్యోల్బణం ‘సున్న శాతం’ నమోదయిన రోజులలోనే కందిపప్పు్ధర కిలో వందరూపాయలు దాటింది! ఆతరువాత నాలుకలను కరచుకున్న అధికార ఆర్థిక నిపుణులు ఆహార ద్రవ్యోల్బణాన్ని, సాధారణ ద్రవ్యోల్బణాన్ని విడివిడిగా లెక్కగట్టడం మొదలుపెట్టారు. ఇలా విడి లెక్కలు మొదలైన వెంటనే ఆహా ర ద్రవ్యోల్బణం, 2009 అక్టోబర్‌లో, పదునాలుగు శాతానికి చేరినట్టు వెల్లడయింది. ఇప్పుడు సున్నశాతం, అంతకంటె ఎక్కువశాతం స్థాయికి ఆహారద్రవ్యోల్బణం తగ్గిందన్న ‘నిర్ధారణ’ నిజం కాదేమోనన్న అనుమానం కలుగడానికి ఈ చరిత్ర నేపథ్యం!
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలు ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ అభివృద్ధిశాతాన్ని తగ్గించడానికి దోహదం చేశాయట! గత ఏడాది మొత్తం ఇదే ప్రచారం జరిగింది! అప్పుడేమో బ్యాంకులు వడ్డీ రేట్లను, ‘సిఆర్‌ఆర్’ను పెంచుకుంటూ పోయారు. మరి అలా జరుగుతుందని ముందే తెలుసుకదా! తెలిసి తెలిసి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే నెపంతో ‘జిడిపి’ పెరుగుదల తగ్గించడానికి, ఎగుమతులు తగ్గడానికి, పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గడానికి వీలైన చర్యలను చేపట్టారు! ‘సున్నకుసున్న’ ‘హళ్ళికి హళ్ళి’ అన్నట్టు అటు ద్రవ్యోల్బణం తగ్గలేదు, ఇటు అభివృద్ధి మాత్రం కుంటుపడిందట! అందువల్ల పూర్తి వ్యతిరేక దిశలో ఆర్థిక చర్యలు మొదలైనాయి! బహుశా ఈ వ్యతిరేకదిశా ప్రస్థానం ఈ సంవత్సరమంతా కొనసాగవచ్చు. గత ఏడాది నాలుగుసార్లు వడ్డీని, ‘రిజర్వ్’ను పెంచుకున్నారు. ఈ ఏడాది నాలుగుసార్లు ‘రిజర్వ్’ను తగ్గిస్తారు కాబోలు! అప్పటికీ ‘జిడిపి’ పెరుగుతుందన్న నమ్మకం కుదరకపోతే ‘వడ్డీరేట్ల’ను కూడా తగ్గిస్తారు! ఇలా తగ్గించడం, పెంచడం మినహా మన ఆర్థిక సౌష్టవాన్ని పరిరక్షించే మరో ప్రత్యామ్నాయం లేదా? ఇది మొదటి సమస్య! ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్థిక ప్రగతి కూడా తగ్గిపోతుంది! ఇది రెండవ వైపరీత్యం! అమెరికా ఆర్థిక వ్యవస్థ 2008లో దివాలా తీసిననాటినుంచి ఏర్పడివున్న అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ప్రభావం మనదేశంపై లేదని ప్రభుత్వ నిర్వహణతో సంబంధం ఉన్న ప్రతి ఆర్థికవేత్త చెబుతున్న నేపథ్యంలో ఈ రెండు వైపరీత్యాలను నిరోధించడానికి, ఆర్థిక రుగ్మతలను నయం చేయడానికి ప్రత్యామ్నాయం ఏమిటి? రిజర్వ్ బ్యాంకు నిర్వాహకులు చెప్పగలగాలి!

‘ఇంధనం’ దోపిడీ!

‘ఇంధనం’ దోపిడీ!
28/01/2012
TAGS:ప్రభుత్వ విధానాలను బృహత్ వాణిజ్య-కార్పొరేట్- సంస్థలు ప్రభావితం చేస్తున్న తీరుకు ఇది మరో ఉదాహరణ. తాము ఉత్పత్తి చేస్తున్న ఇంధనం వాయువు-నాచురల్ గ్యాస్- ధరలను పెంచాలని ముఖేశ్ అంబానీ నాయకత్వలోని ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’-రిల్- వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు! ధరలను పెంచుకోవాలని కోరడంలో తప్పులేదు. కానీ మరో రెండేళ్ళ వరకు ‘గ్యాస్’ ధరలను పెంచరాదన్న అంగీకారానికి విరుద్ధంగా రిలయన్స్ వారు ఇప్పుడీ కోర్కెను వెళ్ళబెడుతున్నారట. ఒకవైపు ధరలను పెంచడానికి అనుమతి ఇవ్వాలని పెట్రోలియం, ఇంధనవాయు మంత్రిత్వశాఖను ‘అభ్యర్థిస్తున్న’రిలయన్స్ గ్యాస్ సంస్థ మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగంలోని థర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ‘గ్యాస్’ సరఫరాలను ఆపి ఉంచింది. ఇప్పుడీ వివాదం బొంబాయి హైకోర్టులో అపరిష్కృతంగా ఉంది! ధరలను పెంచడానికి వీలుగా ‘రిల్’ కృష్ణ గోదావరి ఉత్పాదక క్షేత్రం-డి బ్లాక్-లో ఉత్పత్తులను తగ్గించినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒత్తడి’ చర్యల ఆరోపణ ఎలా ఉన్నప్పటికీ ‘కృష్ణగోదావరి’ క్షేత్రంలో ఉత్పత్తి తగ్గినమాట మాత్రం ధ్రువపడిపోయింది. ‘గ్యాస్’ ఉత్పత్తి తగ్గిన కారణంగానే గత ఏడాది ‘రిల్’ వాటాల విభజనతోపాటు సంస్థ లాభాలు సైతం గణనీయంగా తగ్గిపోయినట్టు ప్రచారమవుతోంది. అలాంటప్పుడు ఉత్పత్తిని పెంచడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఒత్తడి తెచ్చి ‘గ్యాస్’ ధరలను పెంచి లాభాలను మూటకట్టడానికి ఈ సంస్థ పూనుకొంటోంది! ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘గ్యాస్’ ధరలను నిర్ణయించడంలో తన అంగీకారం కూడా తీసుకోవాలన్న వాదాన్ని వినిపిస్తున్నారట! ప్రభుత్వం నిర్ధారించిన ధరలను ‘రిల్’ వారు అంగీకరించకపోవడం ఇది మొదటిసారి కాదు. 2009లో కూడ ఇలాంటి పేచీ పెట్టింది. అంతకు పూర్వం ఒక ‘్థర్మల్ యూనిట్’ గ్యాస్‌ను 2.34 డాలర్ల-దాదాపు వంద ముప్పయి రూపాయల- చొప్పున విక్రయించడానికి అంగీకరించిన ‘రిల్’ ఆ తరువాత మాట తప్పింది. మొదట తక్కువ ధరకు సరఫరా చేయనున్నట్టు నమ్మించి ఒప్పందం కుదుర్చుకోవడం, ఆతరువాత నిర్ణీత కాలం కంటే ముందుగానే ధరలు పెంచడం ‘రిల్’ వాణిజ్య వ్యూహంలో భాగమైపోయింది! ఒప్పందాన్ని ఉల్లంఘించిన ‘కార్పొరేట్’ సంస్థలపై చర్యలు తీసుకోవలసిన కేంద్ర ప్రభుత్వం లొంగిపోతుండటం నడుస్తున్న చరిత్ర. ఈ లొంగుబాటు కారణంగానే 2007లో ప్రభుత్వం ‘రిల్’ గ్యాస్ ధరను దాదాపు రెట్టింపు చేసింది. ‘్థర్మల్ యూనిట్’ ధరను 4.20 డాలర్ల-దాదాపు రెండువందల పదిహేను రూపాయలు-కు పెంచింది. ఈ పెరిగిన ధరకు సైతం ‘ఎన్‌టిపిసి’కి ‘గ్యాస్’ సరఫరాలను చేడానికి ‘రిల్’ నిరాకరిస్తుండటం వర్తమాన వైపరీత్యం!
ప్రభుత్వరంగ యాజమాన్యాలు, పెట్రోలియం మంత్రిత్వశాఖవారు పరోక్షంగా ‘కార్పొరేట్’ సంస్థలు ‘గ్యాస్’ ధరలు పెంచడానికి సహకరిస్తుండటం కూడ ‘రాజకీయ వాణిజ్య’ భాగస్వామ్యంలోని మరో వైపరీత్యం. నిర్థారణ జరుగుతున్న ధరలకు ‘కృష్ణగోదావరి’ గ్యాస్‌ను విక్రయించడం సాధ్యంకాదని, ప్రభుత్వరంగ ‘ఒఎన్‌జిసి’ వారు 2010లోనే ప్రకటించారు. 2009 ‘గ్యాస్’ ధరను దాదాపు రెట్టింపు చేసిన తరువాత కూడ ‘చమురు’ ఇంధన వాయు సంస్థ’- ఒఎన్‌జిసి- వారు ఇలా ప్రకటించడం విడ్డూరం. అంటే ‘గ్యాస్’ ధరలను మరింత పెంచాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వమే ప్రచారం చేసినట్టయింది. 2010 ఏప్రిల్‌లో ‘ఒఎన్‌జిసి’ ఈ ప్రకటన చేసిన తరువాత, జూన్‌లో ప్రభుత్వం ధరలను పెంచుకోవడానికి అనుమతి ప్రదానం చేసింది. కృష్ణగోదావరి క్షేత్రంలో ‘గ్యాస్’ను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ సంస్థలు ధరలను పెంచడానికి వీలున్నప్పుడు ప్రభుత్వేతర సంస్థలు మాత్రం ఎందుకు పెంచరాదన్న వాదం ‘రిల్’కు ఉపకరిస్తోంది. ఇలా ధరలను పెంచాలన్న ప్రతిపాదన చేసిన ‘ఒఎన్‌జిసి’ క్రమంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. ఇటీవల మన రాష్ట్రంలో భాగస్వామ్య సదస్సు జరిగిన సందర్భంగా, రాష్ట్రానికి చెందిన ఓ చమురు శుద్ధి కర్మాగారానికి చెందిన ముప్పయివేల కోట్ల రూపాయల వాటాలను ‘ఒఎన్‌జిసి’, ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించినట్టు వెల్లడైంది. స్వదేశీయ చమురు క్షేత్రాలను, చమురు, ఇంధనవాయు ఉత్పాదక కేంద్రాలను క్రమంగా ప్రభుత్వేతర సంస్థలకు విక్రయిస్తున్న ‘ఒఎన్‌జిసి’ విదేశాలకు ఈ పెట్టుబడులను తరలించి ఆయాదేశాలలో ‘చమురు, ఇంధన వాయువుల’ తవ్వకాలను జరిపిస్తోంది! అంటే ప్రభుత్వ నియంత్రణ నుంచి ‘గ్యాస్’ ఉత్పత్తిని, పంపిణీని పూర్తిగా తప్పించడానికి, తద్వారా ప్రభుత్వేతర సంస్థలు స్వయంగా ధరలను నిర్థారించడానికి ఇలా రంగం సిద్ధమైపోతోంది!
‘రిల్’ గ్యాస్ సరఫరాలను ఆరంభించని కారణంగా ‘ఎన్‌టిపిసి’వారు గుజరాత్‌లో నిర్మించిన రెండు విద్యుత్ ఉత్పాదక కర్మాగారాల్లో ఉత్పత్తి ఇంకా మొదలు కాలేదట! అందువల్లనే ‘రిల్’ను ఒప్పించి సరఫరాలను ప్రారంభింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ విభాగం వారు పెట్రోలియం మంత్రిత్వశాఖను కోరుతున్నారట! అయితే వివాదం బొంబాయి హైకోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు సరఫరాలను ప్రారంభించరాదనేది ‘రిల్’ విధానం. ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో ఉత్పత్తి అవుతునద్న ‘గ్యాస్’ ధరలను ‘్థర్మల్ యూనిట్’కు ఏడు డాలర్లు- మూడు వందల యాబయి రూపాయలు- చొప్పున నిర్ధారించాలని ‘ఒఎన్‌జిసి’ వారే 2010లో ప్రతిపాదించారు. అందువల్ల కనీసం ఆమేరకు కానీ, మరింత ఎక్కువ స్థాయికి కానీ ధరలను పెంచుకోవాలన్నది ‘రిల్’ లక్ష్యం కావచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం -పిపిపి- ఇలా ధరలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ‘ఒఎన్‌జిసి’విధానం నిర్ధారించింది! ఇదంతా దేనికి సంకేతం? వర్థమాన దేశాలలో ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తున్న అన్ని రకాల రాయితీలను సబ్సిడీలను రద్దుచేసేయాలన్న ‘ప్రపంచబ్యాంకు’ ఆదేశాలకు, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంకాంక్షలకు అనుగుణమైన రీతిలోనే మన పెట్రోలియం, ఇంధనవాయు’ విధానం నడిచిపోతోందని స్పష్టం కావడంలేదా? ‘రిల్’ వారు, తదితర ప్రభుత్వేతర సంస్థలు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు సరఫరా చేసే ‘గ్యాస్’ ధరలు పెరగడం వల్ల దేశమంతటా విద్యుత్ ధరలు పెరిగిపోతాయి. కీర్తి ఎన్ ఫారిఖ్ అధ్యక్షతన ప్రధానమంత్రి నియమించిన సంఘం 2010లో నివేదిక సమర్పించిన నాటినుంచి, ‘ప్రభుత్వేతర’ సంస్థల ఇంధన సామర్థ్యం విస్తరించిపోతున్నాయి. పెట్రోలు, గ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి అంతర్జాతీయ విపణితో అనుసంధానం చేయాలన్నది ఫారిఖ్ సంఘం ప్రతిపాదన. ఇప్పటికే పెట్రోలు పంపిణీని ప్రభుత్వం ఇలా ‘అంతర్జాతీయ అనుసంధానం’ చేసింది! ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పారిశ్రామిక ప్రయోజనాల కోసం పనికివచ్చే ‘గ్యాస్’ను ‘రిల్’ నియంత్రిస్తోంది! ‘వంట’గ్యాస్‌ను సైతం అంతర్జాతీయ విపణితో అనుసంధానించేయడమే మిగిలివున్న కార్యక్రమం...