31, జనవరి 2012, మంగళవారం

భాగస్వామ్య ‘భాగ్యం

భాగస్వామ్య ‘భాగ్యం’!.January 14th, 2012
భారతీయ పారిశ్రామిక సమాఖ్య - సిఐఐ- వారు హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల ‘్భగస్వామ్య’ సదస్సు విజయవంతం కావడం ఆశ్చర్యకరం కాదు. పెట్టుబడులను పెట్టి లాభాలను ఆర్జించదలచుకున్న వాణిజ్య పారిశ్రామికవేత్తలకు సంస్థలకు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాలు దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించడలేదు. అందువల్ల మన రాష్ట్రానికి పెట్టుబడులను తరలించడానికి స్వదేశీయ వాణిజ్య సంస్థలవారు, విదేశాలకు చెందిన బహుళ జాతీయ సంస్థలు ఉవ్విళ్లూరుతుండడం అత్యంత సహజం. పారిశ్రామిక కలాపాలకు ప్రభుత్వం చౌకగా విద్యుత్తును సరఫరా చేస్తోందని మన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గత ఏడాది స్వయంగా ప్రకటించారు. ఇంత చౌకగా మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక కలాపాలకు సమకూర్చడంలేదట! రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల మేర పెట్టుబడులు తరలి వస్తాయన్న ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం సదస్సుకు పూర్వం వ్యక్తం చేసింది. అయితే ఆరు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వివిధ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించినట్టు ముఖ్యమంత్రి శుక్రవారం ప్రకటించారు. అయితే లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు మాత్రమే ఖరారయ్యాయి. మిగిలిన ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఎలా ఉపయోగిస్తారన్నది ప్రధానమైన ప్రశ్న. పారిశ్రామిక ఉత్పాదక కేంద్రాలను ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడం ‘సరళీకరణ’ విధానంలోని ప్రధాన అంశం. పూర్తిగా ప్రభుత్వేతర సంస్థలే ఈ ఉత్పాదక కేంద్రాలను నిర్వహించడం ఒక పద్ధతి. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలను స్థాపించం మరో పద్ధతి! ఈ ప్రభుత్వ ప్రభుత్వేతర- పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్- ఉత్పత్తులను ఎగుమతులను పెంచడానికి దోహదం చేయగలిగినపుడు మాత్రమే సరళీకరణ విధానం సార్థకమైనట్టు! ‘సరళీకరణ’ ఆరంభమై రెండు దశాబ్దులు గడిచిపోయింది! అందువల్ల ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం ఏ మేరకు ఉత్పత్తులను, ఎగుమతులను పెంచింది? అన్నది ఈ ‘్భగస్వామ్య సదస్సు’ సందర్భంగా సహజంగా తలెత్తిన ప్రశ్న! 1990 దశకంలో వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’లో మన దేశం సభ్యత్వం పుచ్చుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం పదే పదే ఒక అంశాన్ని నొక్కి వక్కాణించింది! వౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, పారిశ్రామిక వౌలిక ఉత్పత్తులను పెంచడానికి దోహదం చేసే రంగాలలోకి మాత్రమే విదేశీయుల పెట్టుబడులను అనుమతిస్తామనేది ఆ వక్కాణింపు సారాంశం! కానీ పదిహేను ఏళ్లకు పైగా వౌలిక ఉత్పత్తులను పెంచడానికి ఎగుమతులను ఎక్కువ చేయడానికి విదేశాల పెట్టుబడులు దోహదం చేశాయా? అన్నది తలెత్తుతున్న రెండవ ప్రశ్న! ఇపుడు తరలి రాదలచుకున్న లక్షల కోట్ల నిధులలో ఎంత శాతం పెట్టుబడులు విద్యుత్, చమురు, ఉక్కు, సిమెంటు వంటి ‘వౌలిక’ ఉత్పత్తులను పెంచడానికి దోహదం చేయనున్నాయి? ఈ సంగతిని ప్రభుత్వం ప్రజలకు వివరించాలి!
గురువారంనాడు ఒప్పందాలు కుదిరిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అరవై వేల కోట్ల రూపాయలు ‘వౌలిక’-కోర్ పారిశ్రామిక రంగానికి తరలివస్తుండడం హర్షణీయం. అయితే ఇందులో సగం మన దేశానికి చెందిన సంస్థవారు పెట్టుబడుతున్నారు. మరో ముప్ఫయి వేల కోట్ల రూపాయల ‘వౌలిక’ పారిశ్రామిక పథకానికి విదేశీయ సంస్థతో అనుసంధానమైన మరో స్వదేశీయ సంస్థ నిధులను సమకూర్చుతోంది! అందువల్ల వౌలిక రంగానికి తరలివస్తున్న విదేశీయ సంస్థల పెట్టుబడులు ఎన్ని వేల లేదా లక్ష కోట్లన్నది తెలియవలసి ఉంది! ఉప్పును, సబ్బులను, శీతలపానీయాలను, మంచినీటి సీసాలను ఉత్పత్తి చేయడానికి, పప్పులను మిరపకాయలను కొని పంపిణీ చేయడానికి, వినోద పరిశ్రమను విహార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి బహుళజాతీయ సంస్థలు అత్యుత్సాహం చూపిన సంగతి ఇంతవరకూ నడిచిన చరిత్ర! ఈ కలాపాలను పారిశ్రామిక పథకాల మాటున చెలామణి చేయడం వల్ల బహుళ జాతీయ సంస్థలు భారీగా లాభపడినా వారు పెట్టుబడులు వౌలిక సదుపాయాలను ఉత్పత్తులను పెంచలేదు, ఎగుమతులను పెంచలేదు. లాభాలను విదేశాలకు తరలించడానికి మాత్రమే ఈ ‘పెట్టుబడులు’ ఇంతవరకు దోహదం చేశాయి. ఇపుడు అణువిద్యుత్, సౌర విద్యుత్ వంటి ఉత్పత్తులను పెంచడానికి ఎన్ని సంస్థలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అందజేస్తున్నాయి? వౌలిక సదుపాయాల కల్పనకోసం వ్యవసాయ భూమిని కాజేసిన ‘ఎమ్మార్’ సంస్థ ఆ తరువాత ఏమి చేసిందన్నది భవిష్యత్తుకు గుణపాఠం కావాలి!
అమెరికావారి ‘మొన్‌సాం టో’ కంపెనీ తరహాలో వ్యవసాయ రంగంలోకి చొరబడడానికి మరో విదేశీయ సంస్థ సిద్ధంగా ఉందన్నది భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెద్దగా ప్రచారం కాని మరో అంశం! ఈ మొన్‌సాంటో కంపెనీ వారి బిటి విత్తనాల ధరలు రైతుల రక్తాన్ని పీల్చుతున్నాయి. అమెరికా ఐరోపా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అలమటిస్తున్నాయి. గ్రీసు దేశంలో తిండి దొరకని ప్రజలు ఇళ్లను వదిలి వలసపోతున్నారు ఇతర ప్రాంతాలకు!! అలాంటపుడు అమెరికా ఐరోపా దేశాలు ‘బహుళ జాతీయ సంస్థలు’తమ దేశాలలో పెట్టుబడులు పెట్టి తమ దేశాలను ఉద్ధరించుకోక నిధులను మన దేశానికి తరలించడమే విచిత్రం. ఈ ‘్భగస్వామ్య సదస్సు’లో ‘్భరత-అమెరికా భాగస్వామ్యం’ ఒక అతి ప్రధాన అంశమైపోయింది! పదిహేను సంవత్సరాల వరకు ప్రభుత్వాలకు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేని ‘ప్రత్యేక ఆర్థికమండలి’- సెజ్- సదుపాయాలు ఈ సంస్థలకు ఆ దేశాలలో లేవు! అందువల్ల మన ఉత్పత్తులను ఎగుమతులను పెంచడానికి కాక తమ లాభాలను పెంచుకొనడానికి మాత్రమే ఈ సంస్థల పెట్టుబడులను ఉపయోగించడం ఖాయం. ఇపుడు వ్యవసాయ రంగంలోకి ‘పరిశోధన’ పేరుతో జొరబడనున్న విదేశీయ సంస్థ మొక్కజొన్న, వరి, పత్తి, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు పువ్వు వంటి ‘బిటి’ రకాల విత్తనాలను సృష్టించడానికి లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేయడానికి సిద్ధంగా ఉందట! ‘మొన్‌సాంటో’ పత్తి విత్తనాలు రైతుల ఆత్మహత్యలకు కారణమని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారవౌతోంది. పెట్టుబడుల ప్రహసనంలో ఇలాంటి వైపరీత్యాలే అధికంగా కనిపిస్తున్నాయి! ప్రభుత్వ రంగ చమురు, ఇంధన వాయు సంస్థ- ఒఎన్‌జిసి- వారు కాకినాడ చమురుశుద్ధి కర్మాగారం భాగస్వామ్యం వదులుకున్నారట! ముప్ఫయివేల కోట్ల రూపాయల వాటాలను కొన్న ప్రభుత్వేతర సంస్థ ఈ కర్మాగారంలో యాభై ఒక్క శాతం భాగస్వామ్యం పొందింది! ఈ ‘లావాదేవీ’ని కూడా కొత్త ‘పెట్టుబడి’గా ప్రచారం చేస్తున్నారు!! వియత్నాం సమీప సాగర జలాలలోను, ఆఫ్రికాలోను పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ ‘ఒఎన్‌జిసి’ స్వదేశంలో ‘్భగస్వామ్యం’ ఎందుకు వదులుకుంటోంది? మన ప్రజల నిధులను విదేశాలకు ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వేతర సంస్థల నిధులనే విదేశాలకు తరలించవచ్చు కదా??

1 కామెంట్‌: