31, జనవరి 2012, మంగళవారం

పాకిస్తాన్‌లో ‘పరమాధికారం’?

పాకిస్తాన్‌లో ‘పరమాధికారం’?.January 22nd, 2012
పాకిస్తాన్‌లో సైనిక దళాలకు, రాజకీయ దళాలకు మధ్య జరుగుతున్న సమరంలో ఇది కాల్పుల విరమణ ఘట్టం! ఉభయ పక్షాలు సంధికి సంసిద్ధంగా ఉన్నట్టు గురువారంనాడు సంభవించిన పరిణామాల వల్ల ధ్రువపడింది. ప్రధానమంత్రి యూసఫ్ రజాజిలానీ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో స్వయంగా హాజరయి న్యాయమూర్తులకు ఘనంగా గౌరవం ఘటించారు! మరోవైపు, పాకిస్తాన్‌కు తాను తిరిగి రావడం లేదని మాజీ సైనిక నియంత పర్‌వేజ్ ముషారఫ్ ప్రకటించాడు. జిలానీ స్వయంగా తమ ఎదుట హాజరుకావడంవల్ల ‘‘న్యాయవ్యవస్థ ఔన్నత్యం ధ్రువపడినట్టు’’ పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం కూడా సైనిక, సైనికేతర అధికార ధ్రువాల మధ్య ఘర్షణ తీవ్రత తగ్గుతోందనడానికి మరో నిదర్శనం. ‘‘జిలానీ నిజాయతీపరుడు కాదు’’ అని వారం క్రితం వ్యాఖ్యానించిన ధర్మాసనం అధ్యక్షుడు నసీర్ ఉల్‌ముల్క్, తదితర న్యాయమూర్తులు గురువారంనాడు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించడం కూడా సైనిక దళాలకు జిలానీ పట్ల ఆగ్రహం తగ్గిందనడానికి తార్కాణం! కేసును ఫిబ్రవరి ఒకటవ తేదీకి వాయిదావేసిన ఏడుగురు న్యాయమూర్తులు ఆ రోజున జిలానీ స్వయంగా న్యాయస్థానానికి రానవసరం లేదని నిర్దేశించడం కూడా ‘పౌర ప్రభుత్వంపై సైనిక సార్వభౌములకు కలిగిన అనుగ్ర హానికి చిహ్నం. సుప్రీంకోర్టులో సంభవించిన పరిణామాలకు, సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలకు సైనిక దళాలతో సంబంధమేమిటన్న సందేహం పాకిస్తాన్ ‘రాజ్యాంగ చరిత్ర’ను పాలన వ్యవస్థను అర్ధంచేసుకుంటున్న వారికెవ్వరికీ కలుగనే కలుగదు! కార్య నిర్వహణ విభాగం- మంత్రివర్గం, శాసన నిర్మాణ విభాగం జాతీయ శాసన మండలి- న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా పనిచేయడం, పరస్పర అధికార విభజన, నియంత్రణ, న్యాయవ్యవస్థ పరమాధికారం- సుప్రిమస్- వంటి ఆదర్శాలన్నీ ప్రజాస్వామ్య దేశాలలో ఆచరణ యోగ్యమైనవి! కానీ మూడు రాజ్యాంగ విభాగాలను నియంత్రించ గలిగిన సైనిక దళం పరమాధికారం చెలాయిస్తున్న పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థ పరమాధికారం ఋజువైపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం విచిత్రమైన వ్యవహారం! సైనిక దళాల నియంతలు అనుమతించిన పరిధిలో మాత్రమే పాకిస్తాన్ మంత్రివర్గం కాని, జాతీయ శాసన మండలి కాని, సుప్రీంకోర్టు కాని ‘అధికార క్రీడ’లను అభినయించగలవన్నది 1947 నుండి కొనసాగుతున్న చరిత్ర. సైనిక దొర తలచుకున్న మరుక్షణం మూడు రాజ్యాంగ విభాగాల అధికారాలు మాత్రమే కాదు ఉనికి కూడ ఉండదు! ప్రధానమంత్రి కోర్టు ఆదేశాలను శిరసావహించడంవల్ల కానీ, ధిక్కరించడంవల్ల కాని ‘న్యాయవ్యవస్థ’ పరమాధికారం ధ్రువపడుతుందా? సహజంగానే రాజ్యాంగ దత్తమైన పరమాధికారం సుప్రీంకోర్టుకు ఉండాలి కదా! లేదన్న సత్యాన్ని గ్రహించడంవల్లనే న్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకొనడానికై బహుశా న్యాయమూర్తులు అలా వ్యాఖ్యానించివుంటారు! ధ్రువపడింది న్యాయవ్యవస్థ పరమాధికారం కాదు, సైనిక దళాల పరమోన్నత అధికారం!!
సైనిక దళాలు ప్రభుత్వం అదుపాజ్ఞలలో ప్రవర్తించవలసిన ఒక పాలన విభాగం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలలో సహజం! కానీ పాకిస్తాన్ ‘ప్రజాస్వామ్యం’లో ఇప్పుడు సైనిక దళం ప్రభుత్వానే్న అదిలించగలదు, బెదిరించగలదు, హెచ్చరించగలదు, తొలగించగలదు! 2008వ సంవత్సరానికి పూర్వం సైనిక అధికారులు నాలుగుసార్లు తిరుగుబాట్లు చేశారు. 1958లో జనరల్ అయూబ్‌ఖాన్, 1968 జనరల్ యాహ్యాఖాన్, 1977లో జనరల్ జియాఉల్‌హక్ 1999లో జనరల్ పరవేజ్ ముషారఫ్ ఉన్న ప్రభుత్వాలను ఊడగొట్టారు! యాహ్యాఖాన్ తప్ప మిగిలిన ముగ్గురూ పౌర ప్రభుత్వాలనే పడగొట్టారు. కానీ పౌర ప్రభుత్వాన్ని తొలగించే వరకు సైనిక దళాల అధిపతులు ఆయా ప్రభుత్వాలపట్ల ఇతర దేశాలలోవలె విధేయులుగానే ఉండేవారు. కానీ 2008 తరువాత జరుగుతున్నదేమిటి? పౌర ప్రభుత్వంతో పాటు సైనిక దళాలవారు సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. పౌర ప్రభుత్వం ఉన్నట్టు కాదు, ఊడినట్టు కాదు! అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ కంటె సైనిక అధ్యక్షుడు అస్‌ఫాక్ పర్‌వేజ్ కయానీ ప్రముఖుడుగా, ప్రబలుడుగా చెలామణి అవుతున్నాడు. ‘త్రిశంకు’ నరకంలో పాకిస్తాన్ అధ్యక్ష ప్రధానులు అలమటిస్తున్నారు! ఇస్లాం మతం పాకిస్తాన్ రాజ్యాంగ వ్యవస్థలో అవిభాజ్యమైన అంశమన్న విధాన ప్రకటనలను కయానీ పదే పదే గుప్పిస్తున్నాడు! పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం అధిపతి హుజాపాషా మరో అడుగు ముందుకేసి ‘విధానాలను’ తామే నిర్థారిస్తున్నామని బహిరంగంగానే దేశ విదేశాలలో చాటిస్తున్నాడు. ఇదంతా పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలియదా? సైనిక అధికారులు వెళ్లి సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం- అఫిడవిట్ దాఖలు చేయడాన్ని మొదట దుయ్యబట్టిన జిలానీ ఆ తరువాత తోకముడిచాడు! సుప్రీంకోర్టువారు తనపై ‘్ధక్కార నేరాభియోగాన్ని’ నిర్థారించిన వెంటనే జిలానీ చేసిన మొదటిపని కయానీతో రాజీపడిపోవడం! సైనిక దళాలు దేశ భద్రతకు స్తంభాలవంటివని ప్రశంసించడం ద్వారా జిలానీ ‘గండం’ గట్టెక్కాడు! తోక కుక్కను ఆడిస్తున్న దృశ్యం పాకిస్తాన్‌లో వర్తమాన వైపరీత్యం!
పాకిస్తాన్‌లో మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నది ప్రస్తుతం సైన్యం! తాలిబన్లతోను అల్‌ఖాయిదాతోను అమెరికా అప్గానిస్తాన్‌లో తలపడిన నాటినుంచి పాకిస్తాన్ సైనిక దళాలలో అమెరికా వ్యతిరేకత పెరిగిపోయింది! నడుస్తున్న కథకు ఇదీ ఇతివృత్తం! ఫర్‌వేజ్ ముషారఫ్, జర్దారీ, భుట్టో కుటుంబం వారి సమర్థకులు అమెరికా తొత్తులన్నది పాకిస్తాన్ సైనిక దొరతనం ప్రచారం చేస్తున్న వాదం! కయానీ, జిలానీ, ముస్లిం లీగ్- పిఎమ్‌ఎల్- అధినేత నవాజ్ షరీఫ్ వంటివారు అమెరికాను నిరోధిస్తున్న కూటమిలోని పెద్దలు! అయితే తాను జర్దారీ అధ్యక్షతనకల ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’- పిపిపి- చెందినవాడు కావడంవల్ల జిలానీ పరిస్థితి అడకత్తెరలో పోకవలె తయారయింది! జర్దారీపై కేసులను తిరగదోడడం ద్వారా అమెరికా వ్యతిరేకతను బాహాటంగా చాటడం కయానీ విస్తృత వ్యూహంలోని భాగం! కానీ కేసులను తిరగదోడడానికి అధ్యక్షునికి రాజ్యాంగం కల్పిస్తున్న ‘రక్షణ’అడ్డు వస్తోందన్నది జిలానీ చెప్పిన మాట! జర్దారీ అవినీతిపరుడు కావచ్చు! కానీ అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకూ అతగాడిపై న్యాయస్థానాలలో నేరాలను ఆరోపించరాదన్నది రాజ్యాంగ రక్షణ! ఈ సూత్రన్ని వల్లెవేసిన జిలానీ సుప్రీంకోర్టును ధిక్కరించినట్టు కాదు! సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గతంలో ముషారఫ్ తొలగించాడు! నవాజ్ షరీఫ్ ఒత్తిడి కారణంగా జర్దారీ వారందరినీ మళ్లీ న్యాయమూర్తులుగా నియమించవలసి వచ్చింది! ఈ న్యాయమూర్తులు ముషారఫ్‌ను, జర్దారీని తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇదే నేపథ్యం! ‘ప్రజాస్వామ్యం’ ‘పరమాధికారం’ వంటి పదాల వెనుకనుంచి నిక్కి చూస్తున్న వికృత వాస్తవం ఇదీ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి