26, డిసెంబర్ 2011, సోమవారం

‘మందకొడి’ మైత్రి!.

‘మందకొడి’ మైత్రి!.December 18th, 2011
ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ రష్యాకు వెళ్లిరావడం మన దేశానికీ ఆ దేశానికీ మధ్య కల మైత్రీబంధం ‘యథాతథం’గా కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. ఉభయ దేశాలమధ్యగల వ్యూహ్మాక దౌత్య సంబంధాలను ‘మందకొడితనం’ ఆవహించి ఉండడం ఈ ‘యథాతథ’ స్థితి! ఈ మందకొడితనాన్ని తొలగించడానికి మన ప్రధాని పర్యటన దోహదం చేయకపోవడం వర్తమాన వైపరీత్యం. రష్యా అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదెవ్, ప్రధామంత్రి వ్లాదిమిర్ పుతిన్ మన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. సౌహార్దపూర్వకంగా చర్చలు జరిపారు. కానీ ఈ పర్యటన సందర్భంగా కుదిరిన చెప్పుకోదగిన కొత్త ఒప్పందాలు లేవు. 1950వ దశకంనుంచి కూడా ఉభయ దేశాలకు మధ్య పరస్పర ప్రయోజనం కలిగించిన అంశం వ్యూహాత్మక సహకారం. ద్వైపాక్షిక సంబంధాలలోను అంతర్జాతీయ వ్యవహారాలలోను 1980వ దశకం చివరివరకూ ఈ వ్యూహాత్మక సహకారం ప్రధానంగా ప్రస్ఫుటించింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఏర్పడిన ప్రధాన విపరిణామం మన కూ రష్యాకు మధ్యగల స్నేహ సంబంధాలలో మందకొడితనం ఏర్పడడం. 2000 వరకు బోరిస్ ఎల్టిసిన్ అధ్యక్షుడుగా ఉండిన కాలంలో మనతో అంటీ ముట్టినట్టు రష్యా వ్యవహరించం ఇపు డు చరిత్ర! వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఉభయ దేశాలమధ్య మైత్రీ స్ఫూర్తి చిగురులు వేయటం ఆరంభించినప్పటికీ 1970వ దశకంనాటి స్థాయికి అది ఎదగకపోవడం వాస్తవ వైచిత్రి! దిమిత్రీ మెద్వెదెవ్ 2008లో అధ్యక్షుడయినప్పటికీ రష్యా విదేశాంగ నీతిని నడిపిస్తున్నది మాత్రం ప్రధాని హోదాలో వ్లాదిమిర్ పుతిన్. వచ్చే ఏడు పుతిన్ మళ్లీరష్యా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. వ్యూహాత్మక విధానంలో పుతిన్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకి. మన దేశం అమెరికాతో ‘అతి మైత్రి’ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం కారణంగానే ఈ ‘మందకొడితనాన్ని’ వదిలించడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నది స్పష్టం. ఈసంగతి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ఈనెల 15వ, 16ల తేదీలలో రష్యాలో ఉండిన సందర్భంగా మరోసారి ధ్రువపడింది! ప్రధాని జరిపిన చర్చల సందర్భంగా ‘విక్రమాదిత్య’ యుద్ధనౌక సంగతి ప్రస్తావనకు రాకపోవడం ‘వ్యూహాత్మక’మైన మందకొడితనానికి మరో నిదర్శనం. ‘అరిహంత’ జలాంతర్గామి నౌకాదళంలో ప్రవేశించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ‘అరిహంత’ వంటి మరో అణుచోదిత అణ్వస్తవ్రాహక జలాంతర్గామి మనకు ఇప్పటికీ లభించలేదు. సరఫరా చేయడానికి రష్యా అంగీకరించి రెండేళ్లు దాటినా ఇంతరకూ వాగ్దానం నెరవేరలేదు. ఆ సంగతిని ఉభయ దేశాలు మాస్కోలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రస్తావించకపోవడం ‘మందకొడితనానికి’ మరో ప్రబల సాక్ష్యం. వచ్చే నాలుగు సంవత్సరాలలో ఉభయ దేశాల మధ్య వాణిజ్యం పరిమాణం రెట్టింపు కాగలదన్నది మాత్రమే మన్‌మోహన్‌సింగ్ పర్యటన సందర్భంగా వెల్లడయిన ప్రధాన అంశం. అయితే ఇది కూడా ఉభయ దేశాల ప్రభుత్వ అధినేతలు వ్యక్తంచేసిన ఆకాంక్ష మాత్రమే. ఇందుకోసం ఆచరణాత్మకమైన ఒప్పందం ఏదీ కుదరలేదు. కొన్ని యుద్ధవిమానాలను రష్యా నుండి కొనుగోలు చేయడానికి మనదేశం అంగీకరించడం దౌత్యపరంగా మన వైఫల్యానికి నిదర్శనం. ‘కుడంకులం’ అణు విద్యుత్ ఉత్పాదక కేంద్రానికి సంబంధించిన మూడవ, నాలుగవ దశల నిర్మాణానికి సంబంధించి రష్యా రాజధానిలో చర్చలు జరిగాయట! మొదటి రెండు దశల ఉత్పాదక వ్యవస్థలు కూలబడి ఉన్న సమయంలో తరువాతి దశల గురించి ఆలోచించడం గుర్రానికి ముందు బండినికట్టడం వంటిది. ‘కుడంకులం’ అణుకేంద్రాన్ని ఆరంభిచవద్దని కోరుతూ తమిళనాడులో పర్యావరణ పరిరక్షకులు ఉద్యమిస్తున్నారు మరి!
ప్రస్తావిత అంశాలు అత్యంత సమంజసమైనప్పటికీ వాటిని సరిఅయిన సమయంలో చర్చించడం దౌత్యనీతిలోని ఔచిత్యం. గత ఏడాది మార్చిలో పుతిన్ మన దేశాన్ని సందర్శించాడు. డిసెంబర్‌లో మెద్విదెవ్ ఢిల్లీకి విచ్చేశాడు. ఈ రెండు సందర్భాలలోను శాంతి ప్రయోజనాలు అణుసహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. మనదేశంలో కొత్తగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణానికి రష్యా అంగీకరించినట్టు అపుడు ప్రచారమైంది. కానీ కొత్త కేంద్రాలు ఎక్కడ నిర్మిస్తారో ఇంతరకు వెల్లడి కాలేదు. ‘కుడంకులం’ అణుకేంద్రం సంగతి మాత్రం ఆ రెండు సందర్భాలలోను ప్రచారం కాలేదు. కుడంకులం గురించి గత ఏడాది ప్రజలలో వ్యతిరేకత ఏర్పడలేదు. అందువల్ల గత ఏడాది మొదటి ఉత్పాదక వ్యవస్థను ఆరంభించి ఉండి ఉంటే మిగిలిన మూడు దశల నిర్మాణం గురించి చర్చలు వేగవంతమయి ఉండేవి. ‘కుడంకులం’ గురించి ఒప్పందాలు జరిగి ఐదేళ్లు దాటింది. ‘రియాక్టర్’ వ్యవస్థను సరఫరా చేయడంలో రష్యా జాప్యం చేయంవల్లనే నిర్థారిత సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడానికి కారణం.
చైనా ప్రభుత్వం మన సముద్ర జలాలలోకి చొచ్చుకొనివస్తున్న నేపథ్యంలో మన రక్షణ వ్యూహంలో అణుచోదిత జలాంతర్గాములు, యుద్ధనౌకలు అత్యంత కీలకమైనవి. ‘అరిహంత’ను మనం స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించుకొన్నాము. అది సముద్ర ప్రవేశం చేసి పద్దెనిమిది నెలలు పైబడింది. అలాంటి మరో జలాంతర్గామి నిర్మించడానికి రెండేళ్లు పడుతుందని అపుడు నిర్థారణ జరిగిందట. అందువల్ల రష్యానుంచి వెంటనే మరో అణు జలాంతర్గామిని తెప్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. సరఫరా చేయడానికి రష్యా ఒప్పుకొంది. కానీ ఇంతవరకు ఆ జలాంతర్గామి మనకు దక్కలేదు! ఎపుడు అప్పగిస్తారని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో ప్రశ్నించలేదు! మరోవైపు, విమాన వాహన యుద్ధ నౌకను మన ప్రభుత్వం 2004లో కొనుగోలు చేసింది. పుట్టని బిడ్డకు పేరు పెట్టిన చందంగా దేశానికి తరలి రాకముందే దానికి ‘ఐఎఎన్‌ఎస్ విక్రమాదిత్య’ అని నామకరణం కూడా చేసుకున్నాము. అది కొత్త యుద్ధనౌక కాదు. రష్యావారు దాదాపు పదేళ్లపాటు ఉపయోగించిన పాతబడిన నౌక! ఈ ‘సెకెండ్ హ్యాండ్’ యుద్ధ నౌకకు అధునాతనరీతిలో మరమ్మతులు జరిపి మనకు అప్పగించడానికి 2004లో రష్యా వాగ్దానం చేసింది! కానీ రష్యా ప్రభుత్వం నౌకను అప్పగించడాన్ని పదే పదే వాయిదా వేస్తుండడం ‘మందకొడి’ మైత్రికి మరో తార్కాణం. ఈలోగా నౌక ధరను రష్యా ప్రభుత్వం రెండుసార్లు పెంచడం మాత్రమే మైత్రీపథంలో జరిగిన ప్రగతి. వచ్చే ఏడాదినాటికి తప్పనిసరిగా ‘విక్రమాదిత్య’ మనదేశానికి అరుదెంచనున్నట్టు గత ఏడాది పుతిన్, మెద్విదెవ్ పర్యటనల సందర్భంగా మన ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2014 వరకూ ‘విక్రమాదిత్య’ మనకు దక్కదని 2009లో నిర్థారణ అయిపోయిందట! ఈ విషయమై మన ప్రభుత్వం స్పష్టీకరణలు కోరడంలేదు. ఈ మందకొడితనాన్ని మన్‌మోహన్‌సింగ్ మాస్కోలో సరికొత్తగా ప్రదర్శించి స్వదేశానికి తిరిగి వచ్చారు!

అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’

అజిత్‌సింగ్ ‘ఫ్రాధాన్యం’.December 20th, 2011
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమన్న భయం ఆమె ప్రత్యర్థులందరినీ పీడిస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు అజిత్‌సింగ్‌కు మరోసారి కేంద్రమంత్రి పదవి దక్కడానికి ఈ ‘్భయం’ నేపథ్యం. కూలబడి ఉన్న పౌర విమానయాన రంగాన్ని కోలుకునేలా చేయడం ఆయనకు ఎదురౌతున్న ప్రధాన సమస్య - అన్నది ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రచారం. కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కుంటుతున్న కాంగ్రెస్‌ను పరిగెత్తించడం ఆయనకు ఎదురౌతున్న విషమ పరీక్ష అన్నది రాజకీయ మంత్రాంగం గురించి అవగాహన ఉన్న వారికి అర్థమైన వాస్తవం. నష్టాల ఊబిలో పడి నానాటికీ కూరుకొని పోతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థను బయటికి లాగి ఆకాశంలో ఎగిరించే సామర్థ్యం అజీత్‌సింగ్‌కు మాత్రమే ఉందని ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ‘కనిపెట్టడానికి’ కారణం, ఈ కొత్త మంత్రికి ఉత్తరప్రదేశ్‌లో కొంత ‘కులం బలం’ ఉండడమే! కుల బలం వోట్ల రూపంగా మారి తమకు వెన్నుదన్నుగా నిలబడితే రానున్న శాసనసభ ఎన్నికలలో తమ బలం పెరుగుతుందన్నది కాంగ్రెస్ అధినేతల విశ్వాసం! మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు కనుక ఉత్తరప్రదేశ్‌లో అజిత్‌కు గొప్ప గుర్తింపు ఉంది. అయితే ఆయన సహకరించిన వారందరూ ఆయన పార్టీకి వోట్లు వేయకపోవడం దశాబ్దుల చరిత్ర. 1970వ దశకం ముగిసేవరకూ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ప్రధా న ప్రత్యర్థి చరణ్‌సింగ్. జనతాపార్టీలో కూడా ఆయన అధికార కేంద్ర బిందువుగా అలరారడం చరిత్ర. అయితే ఈ చరిత్ర అజిత్‌సింగ్‌కు వారసత్వంగా సంక్రమించక పోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల గతిని మార్చిన విప్లవాత్మక పరిణామం! ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గరిమనాభి అగ్రకులాల నాయకులనుండి వైదొలగి వెనుకబడిన కులాల వోటర్ల మధ్య ప్రతిష్ఠ కావడం ఈ విప్లవ పరివర్తనకు ప్రాతిపదిక. వెనుకబడిన కులాల నుండి పుట్టుకొచ్చిన ములాయంసింగ్, కల్యాణ్‌సింగ్ వంటి నాయకులు అజిత్‌సింగ్ పార్టీని మరుగుజ్జుగా మార్చేశారు. అందువల్లనే అజిత్‌సింగ్ తమ పార్టీ నాయకత్వం స్వీకరించినప్పటినుంచి ఏదో ఒక ప్రధాన పార్టీకి తోకగానే కొనసాగుతున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమయినప్పటినుంచి ‘తోక’ పార్టీలు ప్రధానపార్టీలను ఆడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఐక్యప్రగతి కూటమి- యుపిఏలో రాష్ట్రీయ లోక్‌దళ్ చేరిపోవడం కాని వెనువెంటనే అజిత్‌సింగ్ మంత్రి పదవి లభించడం కాని ఈ ‘వాలక్రీడ’- తోకలాటకు కొనసాగింపు మాత్రమే!
ఐదుమంది లోక్‌సభ సభ్యుల ‘యుపిఏ’లో చేరడంకన్నా ఉత్తరప్రదేశ్‌లో తమ వోటర్ల సంఖ్య పెరగడం కాంగ్రెస్ పార్టీకిప్పుడు ప్రధానం. రాహుల్‌గాంధీ నాయకత్వ పటిమకు ఈ ఎన్నికలు గీటురాళ్లన్న ప్రచారం గత ఏడాదికి పైగా జరుగుతోంది. 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంలో 22 స్థానాలు లభించినప్పటినుంచీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేయడానికి అజిత్‌సింగ్ దోహదం చేయగలడా అన్నది సమాధానం దొరకని ప్రశ్న. అజిత్ పలుకుబడి మాత్రమే కాదు విశ్వసనీయత సైతం నానాటికీ దిగజారుతుండడం ప్రస్ఫుటిస్తున్న విపరిణామం. 1990వ దశకంలో ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా ఉండిన అజిత్‌సింగ్ ఆ తరువాత కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలన్నింటితోను జట్టుకట్టడం వోటర్లలో ఆయన విశ్వసనీయత తగ్గిపోవడానికి కారణం. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీతోను, ములాయంసింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతోను, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతోను ఆయన గతంలో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ పొత్తుల కారణంగా అజిత్‌సింగ్ పార్టీకి మాత్రమే సీట్ల ప్రయోజనం సమకూడింది. ఒంటరిగా పోటీచేస్తే ఒక్క లోక్‌సభ స్థానంలోనైనా విజయం సాధించగల బలం రాష్ట్రీయ లోక్‌దళ్‌కు లేదు. 2009నాటి ఎన్నికలలో అజిత్‌సింగ్ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకొనడానికి కారణం ‘్భజపా’తో పెట్టుకున్న పొత్తు. కానీ ఈ పొత్తు ‘్భజపా’ నాలుగవ స్థానానికి దిగజారిపోకుండా నిరోధించలేకపోయింది! అందువల్ల కాంగ్రెస్‌తో పొత్తువల్ల అజిత్‌సింగ్ పార్టీకి బలం పెరుగుతుంది! కానీ కాంగ్రెస్ పోటీచేసే స్థానాలలోని అజిత్ వోటర్లు ప్రధానంగా ‘జాట్’లు కాంగ్రెస్‌ను బలపరచడం మాత్రం సందేహాస్పదం... ఎవరికి లాభం?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధాన జాతీయ పక్షాలు మూడు నాలుగు స్థానాలకోసం పోటీ పడడం దశాబ్దిగా కొనసాగుతున్న రాజకీయ విచిత్రం. 2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాజపాకు 50, కాంగ్రెస్‌కు 22స్థానాలు దక్కాయి. 403 స్థానాలున్న శాసనసభలో మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి 205 స్థానాలు గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకి శాసనసభలో స్పష్టమైన మెజారిటీ రావడం రెండు దశాబ్దులలో అది మొదటిసారి. అంతవరకు కాంగ్రెస్ మద్దతుతోను ఇతర పార్టీల మద్దతుతోను ప్రభుత్వం నడిపిన ములాయంసింగ్ బలం తొంబయి తొమ్మిదికి దిగజారింది. కానీ 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో బలాబలాలు తారుమారు కావడం ఆశ్చర్యం గొలిపిన పరిణామం. రాష్ట్రానికి చెందిన ఎనబయి లోక్‌సభ స్థానాలలో సమాజ్‌వాదీ పార్టీ ఇరవై మూడింటిని గెలుచుకోగా అధికార ‘బహుజన సమాజ్’కు ఇరవై మాత్రమే దక్కాయి. శాసనసభ ఎన్నికలలో నాలుగవ స్థానంలో ఉండిన కాంగ్రెస్ ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకొని, రెండవ స్థానానికి ఎదిగింది. భాజపా నాలుగవ స్థానానికి దిగజారిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో కేవలం మూడున్నర శాతం వోట్లను పొందిన అజిత్‌సింగ్ పార్టీకి ఐదుస్థానాలు లభించగా ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న భాజపాకు పదిహేడున్నర శాతం మాత్రమే వోట్లు వచ్చాయి. ఏడుచోట్ల పోటీచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ ఐదుచోట్ల గెలిచింది. డెబ్బయి ఒక్క స్థానాలలో పోటీచేసిన భాజపాకు పది సీట్లు మాత్రం దక్కాయి. అజిత్‌సింగ్‌తో పొత్తుపెట్టుకున్న పార్టీలకు ప్రయోజనం పెద్దగా ఉండబోదన్న వాస్తవం ఇలా మరోసారి ధ్రువపడింది. ఇప్పుడు ఈ మూడున్నర శాతం వోట్లు ‘యుపిఏ’ కూటమికి బదిలీ అయినందువల్ల కాంగ్రెస్‌కు కొన్ని నియోజకవర్గాలు అదనంగా లభించవచ్చు. అజిత్‌సింగ్ మద్దతుదారులు, ఆయన పార్టీ అభ్యర్థులు లేనిచోట్ల, కాంగ్రెస్‌ను కాని, భాజపాను కానీ బలపరచబోరన్నది ఎన్నికల చరిత్ర ధ్రువపరచిన వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్న నేపథ్యంలో అప్రతిష్ఠ పాలవుతున్న అజిత్‌సింగ్‌ను కలుపుకొనడం అంతుపట్టని వ్యూహం! అగ్రకులాల వోటర్లను ఆకట్టుకొనడం ద్వారా 2007నాటి ఎన్నికలలో గెలిచిన మాయావతి ఇప్పుడు ‘రాష్ట్ర విభజన’ పథకంద్వారా ప్రయోజనం పొందడానికి యత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని శాసనసభ తీర్మానించింది కూడా! తద్వారా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలోను మెజారిటీ శాసనసభ స్థానాలను గెలవడం ఆమె కొత్త వ్యూహం! ఈ వ్యూహాన్ని ఎదుర్కోగల ప్రతివ్యూహం ప్రత్యర్థులవద్ద లేకపోవడం మాయావతికి అనుకూలిస్తున్న అంశం!

భగవద్గీతపై పగ!.

భగవద్గీతపై పగ!.December 21st, 2011
రష్యా రాయబారి అలెగ్జాండర్ కథాకిన్ వ్యాఖ్యానించినట్టు వారు నిజంగా పిచ్చివారు! విశ్వవిజ్ఞానకోశమైన ‘్భగవద్గీత’ను వ్యతిరేకిస్తున్న ఆ పిచ్చివారు అతి కొద్దిమంది! అందువల్ల స్వరూపాత్మకంగా వారికి ప్రాధాన్యం లేదు. భగవద్గీతను నిషేధించాలని కోరుతూ వారు న్యాయస్థానంలో దావా వేయడం వల్ల భారత రష్యా దేశాల మధ్య మైత్రికి వాటిల్లనున్న ప్రమాదం అసలే లేదు. కానీ అతికొద్దిమందిని నడిపిస్తున్న స్వభావం అంతర్జాతీయ మతోన్మాద సమష్టి చిత్తవృత్తికి సంబంధించినది. అందువల్ల స్వభావాత్మకంగా ఇది మరో మహా వికృత పరిణామం. తమ ‘మతాన్ని’ తప్ప అన్య మతాల ఉనికిని సైతం సహించలేని స్వభావం జీవన విధానమైన ఉన్మాదులు అంతర్జాతీయంగా సాగిస్తున్న కుట్రలో భగవద్గీతను వ్యతిరేకించడం ఒక భాగం మాత్రమే! రష్యాలోని మంచుగడ్డల మయమైన సైబీరియా ప్రాంతంలోని కొందరు మత మూఢాచారులు భారతీయ సాంస్కృతిక పతాకమైన భగవద్గీతను తమ ప్రాంతంలో నిషేధించాలని కోరుతున్నారు. సైబీరియా ప్రాంతంలోని ‘్థమ్ స్కు’ పట్టణంలోని ఒక న్యాయాలయంలో ఇందుకోసం వారు దావా వేశారట! ‘్భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రభోదిస్తోందట!’ ‘సామాజిక వైరుధ్యాలను అంకురింప చేస్తోందట!’ అందువల్ల భగవద్గీతను ప్రచురించకుండా నిరోధించాలన్నది సదరు న్యాయస్థానం వారికి ఆ ‘న్యాయార్థులు’ చేసుకున్న వినతి. ఈ ‘న్యాయార్థుల’లో కొందరు న్యాయవాదులు, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు సైతం ఉండటమే ఈ వైపరీత్యానికి మరింత వికృతిని సంతరించి పెడుతున్న పరిణామం. మన పార్లమెంటులో మంగళవారం ఈ విషయమై నిరసనధ్వనులు చెలరేగకమునుపే మన దేశంలోని ప్రజల్లో అలజడి చెలరేగింది. ప్రసార మాధ్యమాలలో సంచలనం సంభవించింది. భగవద్గీతకు కల ప్రాముఖ్యానికి, ప్రసిద్ధికి ఇదంతా ప్రత్యక్ష ప్రమాణం. రష్యాలో సైతం అత్యధిక రాజకీయవేత్తలు, మేధావులు తమ దేశంలోని ‘గీతా విరోధులను’ తప్పు పట్టడం, దుయ్యబట్టడం భగవద్గీత సర్వజనీనతకు మరో తార్కాణం. సైబీరియా ప్రాంతపు అంబుడ్స్‌మాన్-ప్రభుత్వ న్యాయ సహాయకుడు- వ్లాదిమిర్ లుకిన్ వ్యాఖ్యానించినట్టు ‘‘్భగవద్గీత నిషేధించాలన్న ప్రయత్నం రష్యా రాజ్యాంగం ప్రసాదిస్తున్న ‘్భవ వ్యక్తీకరణ’ హక్కునకు విఘాతకరం’’ ‘్థమ్‌స్కూ’ పట్టణంలోని న్యాయస్థానం అధికార పరిధి పరిమితమైనది. భగవద్గీతను వ్యతిరేకిస్తున్న మతమూఢవాదుల అభ్యర్థనను ఆ న్యాయాలయం అంగీకరించదు. అలా అంగీకరించడం రష్యా రాజ్యాంగ సర్వమత సమభావ స్ఫూర్తికి వ్యతిరేకం కాగలదు. ఒకవేళ ఆ న్యాయాలయం తప్పు తీర్పును ఇచ్చినప్పటికీ రష్యా అంతటాకానీ, సైబీరియా ప్రాంతమంతటా కానీ అది వర్తిచదు! అంతేకాక ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ‘అంతర్జాతీయ కృష్ణ భక్త సమాజం’-ఇస్కాన్- స్థానిక విభాగం వారు అప్పీలు చేయవచ్చు. అప్పుడైనా భగవద్గీత విరోధుల వాదం వీగిపోక తప్పదు. ఇంకా ఆలోచించినప్పుడు ఇదంతా చిన్న విషయంగా కనిపిస్తుంది. కానీ ఈ చిన్న ఘటనను సృష్టించిన వారు ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను వ్యతిరేకిస్తున్న, ధ్వంసం చేయ యత్నిస్తున్న అంతర్జాతీయ పన్నాగంలో పావులు, పాత్రధారులు! ఇది నిరంతరం వ్యాపిస్తున్న మహాప్రమాదం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య సర్వమతసమభావ వ్యవస్థను భగ్నం చేయడం లక్ష్యమైన పెనుభూతం ఇప్పుడు సైబీరియాలోచిచ్చుపెట్టింది. రేపు దక్షిణాఫ్రికాను మండించవచ్చు. ఎల్లుండి చిలీ దేశంలో జ్వాలలను రేపవచ్చు! ఇదీ ప్రధాన సమస్య!
సృష్టిగత సత్యాన్ని సమాజగత జీవనంగా సమావిష్కరించిన సనాతన విజ్ఞానం భగవద్గీత! ఇది ఒక మతానికో లేదా ప్రాంతానికో పరిమితమైన విజ్ఞానం కాదు. సమస్త మానవాళికి సమన్వయం అవుతున్న జీవన సంస్కారం, హేతుబద్ధమైన సాంస్కృతిక తత్వం. ‘్భగవద్గీత’ భారతదేశంలో గ్రంథస్థరూపమెత్తడం సమాజ చారిత్రక పరిణామం. అందువల్ల ఇది భారతదేశ జాతీయ గ్రంథం. ఐదువేల వంద ఏళ్ళనాడు జరిగిన మహాభారత యుద్ధ సమయంలో యదుకుల కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుడికి ఈ విజ్ఞానాన్ని బోధించాడు. సృష్టిగత సత్యాన్ని,సృష్టిని నడిపిస్తున్న సత్యాన్ని వివరించాడు. మహాభారతకారుడైన వేదవ్యాసుడు కృష్ణుడు చెప్పిన దాన్ని గ్రంథస్థం చేశాడు. భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం. మహాభారతం ఇతిహాస గ్రంథం! ఈ చరిత్ర భారతీయ జీవన చరిత్ర. ఒక మతానికి కాని సంప్రదాయానికి గాని పరిమితమైన చరిత్ర కాదు. అందువల్ల మతపరమైన ఉన్మాదంతో ఇతర మతాలను ద్వేషించేవారు సైతం భగవద్గీతను కాని, మహాభారత కావ్యాన్ని కాని ద్వేషించనక్కరలేదు. మతోన్మాదుల మలిన తర్కానికి సైతం విరుద్ధమైన అంశమిది! భగవద్గీతలో వివరించిన ‘్భక్తి’ ఒక మతానికే పరిమితం కాదు. కర్మ,జ్ఞాన, భక్తి యోగాల సంస్కార సమాహారం భగవద్గీత. కర్మయోగం ద్వారా కార్యాకారణ సంబంధాన్ని వివరించింది. జ్ఞానయోగం ద్వారా సత్యమైన విశ్వ వ్యవస్థను దర్శింపజేసింది! భక్తి ద్వారా సృష్టికర్త సృష్టికంటే భిన్నంగా లేడన్న వాస్తవాన్ని ధృవపరచింది. ఇదంతా అనంత విశ్వంలోను, అంతర్నిహితమైన శాస్ర్తియ విజ్ఞానం. ఇది సనాతనం. అంటే ఆద్యంతాలు లేని శాశ్వత విజ్ఞానం! పువ్వు ఒక తోటలో వికసిస్తుంది. అందువల్ల పువ్వు ఆ తోటది. కానీ పరిమళం ప్రపంచానికంతా విస్తరిస్తుంది. భగవద్గీత భారతీయ గ్రంథం. గ్రంథస్త సుగంధ సంస్కారం మాత్రం మొత్తం ప్రపంచానిది, జగత్తుది!
కానీ మతమే పరమావధిగా మనుగడ సాగిస్తున్న అనేక విదేశీయ జాతులకు ప్రతి అంశాన్ని మతదృష్టిలో చూసే సంకుచిత స్వభావులకు భారతీయమైన భగవద్గీతను మతాలకు వ్యతిరేకమన్న భ్రాంతి కలుగుతోంది! అందువల్ల ఇతర మతాలవారిని నిరంతరం తమ మతంలోకి మార్చడానికి యత్నిస్తున్న సంస్థలు, బృందాలు, ఉద్యమకారులు, ముఠా, భగవద్గీతను వ్యతిరేకిస్తున్నారు. రష్యాలో కూడా ఇదే జరుగుతోంది! అంతర్జాతీయ కృష్ణ్భక్త సమాజం వారి ప్రభావం పెరగడంవల్ల తమ మతానికి ప్రమాదకరమని రష్యా ‘అర్ధడాక్స్ చర్చి’ వారు భావిస్తున్నారట. ప్రమాదమని సామాన్య క్రైస్తవులు భావించడం లేదు!ఈ క్రైస్తవ సంస్థలు రష్యా అంతటా స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒత్తిడికి లొంగిన స్థానిక పాలకులు కృష్ణ భక్తులపై ఆంక్షలు విధించడం రష్యాలో ప్రస్తుతం నడుస్తున్న కథ! ఏడేళ్ళక్రితం ‘కృష్ణ భక్తి సమాజం’ వారు నిర్మిస్తున్న దేవాలయాన్ని మాస్కో నగరపాలక సంస్థవారు అర్థాంతరంగా ఆపుచేయించారు. అలజడి చెలరేగిన తరువాత నిర్ధారిత స్థలంలో కాక, నగర శివార్లలోని ప్రాంతంలో మందిర నిర్మాణానికి అధికార్లు అనుమతిచ్చారు. ‘్థమ్‌స్కూ’ పట్టణ శివార్లలో ‘కృష్ణ సమాజం’ ఇళ్ళ సముదాయాన్ని నిర్మించడానికి అధికార్లు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి అంశాలను రష్యా కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి మన ప్రభుత్వం ఇప్పటికీ జంకుతూనే ఉంది! మన ప్రధాని ఇటీవల రష్యాకు వెళ్ళినప్పుడు ‘్భగవద్గీత’పై కోర్టులో నడుస్తున్న వివాదం గురించి ప్రస్తావించి ఉండవలసింది! మన ప్రభుత్వపు ‘జంకుతున్న’ వైఖరికి ఇది మహా నిదర్శనం.

ఆహార సందేహం

ఆహార సందేహం!.December 22nd, 2011
మూడేళ్లుగా కొనసాగుతున్న అనేక సందేహాలకు సమాధానాలు లభించకపోవడం గురువారం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చిన ‘జాతీయ ఆహార భద్రత’ బిల్లునకు నేపథ్యం. బిల్లును లోక్‌సభకు సమర్పించిన ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి కె.వి.్థమస్ ఆ తరువాత ఇచ్చిన ‘వివరణ’ మరిన్ని సందేహాలను కలిగిస్తోంది. నిరుపేదలను నిర్థారించడానికి వీలుగా ‘ప్రణాళికా సంఘం’ వారు నిర్ణయించిన ‘కొలమానం’ ఆహార భద్రతను నిలదీస్తున్న విషయం మాత్రం మరోసారి స్పష్టమైపోయింది. బిల్లులో నిర్వచించిన ‘ప్రాధాన్య కుటుంబాల సంఖ్య’ దేశంలోని మొత్తం కుటుంబాలలో సగం కంటె తక్కువ అన్నది స్పష్టమైన మరో అంశం. అయితే గ్రామీణ ప్రాంతాలలో చౌక ఆహారం అవసరమైన డెబ్బయి ఆరు శాతం ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని ‘అవసరమైన’ యాభయి శాతం ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ‘్భద్రత’ అవసరమైన కుటుంబాలను ఎలా నిర్థారించి ఈ ‘శాతా’లను కనిపెట్టారన్నదానికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు! ‘ప్రాధాన్యం’ కల కుటుంబాల సంఖ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా నిర్థారించిన నిరుపేదల కుటుంబాల సంఖ్యతో దాదాపు సమానమట. ఈ సంగతిని ఆహార మంత్రి స్వయంగా అంగీకరించారు. ప్రణాళికా సంఘం వారు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని మాత్రమే నిరుపేదలుగా గుర్తించారు. ఇలా గుర్తించిన తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, విపక్షాలు విమర్శించాయ. కుటుంబాలు పెట్టే ఖర్చు ప్రాతిపదికగా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారిని ప్రణాళికా సంఘం గుర్తించడం విమర్శలకు దోహదం చేసింది. ఈ ఖర్చుకు అత్యంత తక్కువ ‘గరిష్ఠ స్థాయి’ని విధించడం విమర్శలకు దారితీసిన మరో వైపరీత్యం! నిరుపేదలను నిర్థారించడానికి ప్రణాళికా సంఘం వారు మొదట 2006వ సంవత్సరం నాటి ధరలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టడంతో ప్రణాళికా సంఘం ప్రస్తుత ధరల ప్రాతిపదికగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించింది. గ్రామీణ ప్రాంతంలో సగటున ప్రతిదినం ఇరవై రూపాయలకంటె తక్కువ ఖర్చుచేసేవారు, పట్టణ ప్రాంతాలలో ముప్ఫయి రెండు రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే ‘దారిద్య్రరేఖకు దిగువన ఉన్న’ నిరుపేదలని గత సెప్టెంబర్‌లో ప్రణాళికా సంఘం నిర్ధారించింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రణాళికా సంఘం మాట మార్చింది. ఆహార భద్రత పథకం ప్రయోజనం పొందేవారిని గుర్తించడానికి ‘దారిద్య్రరేఖకు దిగువన ఉండడం’-బిపిఎల్- ప్రాతిపదిక కాబోదని వివరణ ఇచ్చింది. దేశంలోని అవసరమైన కుటుంబాల వారందరికీ చౌక ఆహారం సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రణాళికా సంఘం వారి ‘విచిత్ర నిర్థారణ’ ప్రాతిపదికగానే ప్రభుత్వం ‘ప్రాధాన్య కుటుంబాల’ను గుర్తించినట్టు ఇపుడు తెలిసిపోయింది. అంటే ‘బిపిఎల్’- కుటుంబాలకు మాత్రమే చౌక ధరలు వర్తిస్తాయన్నమాట! ఎటొచ్చీ ఈ కుటుంబాలను ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు’ అని పిలవడం మాని ‘ప్రాధాన్యం కల కుటుంబాలు’ అని నిర్వచిస్తున్నారు. పేరు ఏదయితేనేమి? వైపరీత్యం మాత్రం అదే.
గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ప్రాధాన్యం కల కుటుంబాల వారికి మాత్రమే అతి చౌక ధరలకు బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు విక్రయిస్తారట! అవసరమైన కుటుంబాలవారందరికీ కాదన్నమాట! అంటే ‘ప్రాధాన్యం’ కల కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ కనీసం ఏడు కిలోల బియ్యం గోధుమలు ముతక ధాన్యం ఇస్తారట! మూడు రూపాయలకు బియ్యం, రెండు రూపాయలకు గోధుమలు, రూపాయికి ముతక ధాన్యం- సజ్జలు, జొన్నలు వంటివి- కిలో చొప్పున విక్రయిస్తారట! బాగుంది. కానీ ఏఏవి ఎనె్నన్ని కిలోలు ఇస్తారు? అన్న స్పష్టత లేదు. సాధారణ తరగతివారికి ఒక్కొక్కరికి నెలకు మూడు కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయట. ‘సాధారణ తరగతి’ అంటే ‘ప్రాధాన్యం’లేని ‘అవసరం ఉన్న’ కుటుంబాలు కావచ్చు! అంటే గ్రామీణ ప్రాంతాలలోని లాభోక్తులలో ఇరవై తొమ్మిది శాతం మందికి, పట్టణాలలోని లబ్దిదారులలో ఇరవై రెండు శాతం మందికి సగటున దక్కేవి నెలకు మూడు కిలోలన్నమాట! ఈమూడు కిలోలు కూడా రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ‘కనీసపు మద్దతు ధర’ ప్రాతిపదికగా ఈ ‘అవసరమైన’ కుటుంబాలకు విక్రయించే ధరలను నిర్ణయిస్తారట! ఈ ధరలు ‘కనీసపు మద్దతు ధర’లో సగానికి- యాభై శాతానికి- మించి ఉండరాదన్నది మాత్రమే బిల్లులో పొందుపరచిన అంశం! అంటే ఈ వర్గాలకు లభించే మూడు కిలోల బియ్యం ధర కిలో పది రూపాయలు దాటిపోవచ్చు! ‘ఆహార భద్రత అవసరమైన’ కుటుంబాల సంఖ్యను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ‘సర్వే’ జరిపిస్తోందట! ఈ ‘సర్వే’ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తికానున్నదట! కానీ ‘సర్వే’ పూర్తికాకుండానే కుటుంబాల శాతాన్ని ఎలా నిర్థారించారు? ‘సర్వే’లో ఏ ప్రాతిపదికగా ఈ కుటుంబాలను నిర్థారిస్తున్నారనే అంశాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం ‘ఆహార భద్ర’పై సందేహాలు కలగడానికి అవకాశం ఇచ్చింది. పట్టణ ప్రాంతాలలో ఇలాంటి ‘సర్వే’ అసలు జరగడమే లేదు... మరి ఎలా ‘అవసరమైన’ కుటుంబాలను పసికట్టారు?
ఈ కొత్త పథకం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ముప్ఫయి వేల కోట్ల రూపాయలు అదనంగా వార్షిక వ్యయం ఏర్పడనున్నదట! ఈ ‘సబ్సిడీ’ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని బిల్లులో నిర్దేశించారు. అయితే కేంద్రం వాటా ఎంత? అన్నది మాత్రం ఇంకా నిర్థారణ కాలేదు. ఈ ‘వాటా’ల సంగతి బిల్లులోనే ఎందుకని నిర్థారించలేదు? అలాంటి నిర్థారణ’కు కొన్ని రాష్ట్రాల అభ్యంతరాలు చెప్పడంవల్లనే కేంద్రం ‘ఆ ‘సంగతి’ని దాచిపెడుతోందన్న విమర్శకూడా వినబడుతోంది. అంతేకాక ఈ కేంద్ర పథకంతో సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలలో ఇప్పటికే ‘సబ్సిడీ’పై ఆహార ధాన్యాలను విక్రయించే పథకాలను అమలు జరుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోంది నిరుపేదలకు... అలాగే మన రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయికి కిలో చొప్పున ప్రభుత్వం విక్రయిస్తోంది! ఇలాంటి రాష్ట్రాలలో ఈ కొత్త పథకంవల్ల లభించే ప్రయోజనం ఏమిటన్న చర్చ మొదలైపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు జరుపరాదని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం మొదలైపోయింది కూడా! దేశమంతటా ఒకే ధర ఉండాలనుకున్నట్టయితే రూపాయికే అన్ని రాష్ట్రాలలోను కిలో చొప్పున బియ్యం, గోధుమలు విక్రయించాలి! దానివల్ల పెరిగే భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధంగా లేదు! నిరుపేద బాలల భోజన పథకం, ‘అంత్యోదయ అన్న యోజన పథకం’ వంటి వాటిని కూడా ఈ కొత్త భద్రతా పథకంలో చేర్చనున్నారట! పదునాలుగేళ్ల లోపు బాలబాలికలకు మధ్యాహ్న భోజనం2 పెట్టాలన్నది లక్ష్యం! అలాంటపుడు అనేక రాష్ట్రాలలోని బడులలో ఇదివరకే అమలు జరుగుతున్న భోజన పథకాలను ఈ కొత్త పథకంలో విలీనం చేయనున్నారా? ‘ఆహారం’పై సబ్సిడీలను పెంచడానికి వీలుగా ఇంధనం చమురు వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసి, ఈ వ్యవస్థను అంతర్జాతీయ విఫణితో అనుసంధానం చేసే కార్యక్రమం ఇదివరకే మొదలైంది మరి! ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటారా...?

నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’

నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’.December 15th, 2011
దేశ విదేశాల్లోని నల్లడబ్బును వెలికి తీసే కార్యక్రమం నత్తనడక నడుస్తోందన్న వాస్తవానికి గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలు మరో నిదర్శనం. స్విట్జర్లాండ్ తదితర దేశాలలో భారతీయ సంపన్నులు, పన్నులు ఎగవేసి దాచిన అక్రమ సంపదను బయటికి తీయడంలో జరుగుతున్న ‘ప్రగతి’ గురించి ఈ ఏడాది జనవరిలో చెప్పిన మాటలనే ప్రభుత్వం గురువారం లోక్‌సభలో చెప్పింది. ‘నల్లడబ్బు గురించి విదేశీయ ప్రభుత్వాలు సమకూర్చిన సమాచారాన్ని వెల్లడించడానికి వీలుకాదు..’ అన్న మాటను ప్రభుత్వం గత జనవరిలో చెప్పింది. సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇప్పుడు లోక్‌సభకు నివేదించింది. వెల్లడించడానికి వీలుగా విదేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనడానికై ఈ పదకొండు నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతిపక్షాలు సైతం పార్లమెంటులో గర్జించి, గాండ్రించి, ఘీంకరించడం మినహా విదేశాలలోని నల్లడబ్బును వెలికి తీయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికై ప్రజలను చైతన్య పరచిన జాడలేదు. జర్మనీ బ్యాంకులో నల్లడబ్బు దాచిన వివరాలు ప్రభుత్వానికి లభించి సంవత్సరం దాటినా వాటిని ప్రజలకు చెప్పలేదు. ‘దేశాన్ని దోపిడీ చేసిన వారి వివరాలు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు?’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వం వారిని ప్రశ్నించి పదకొండు నెలలయింది. సమాధానం లేదు. అప్పుడు చెప్పిన మాటలనే గురువారం ప్రభుత్వం మళ్ళీ చెప్పింది. ‘‘నల్లడబ్బునకు సంబంధించి ముప్పయి ఆరువేల ‘వివరణ పత్రాలు’ విదేశాలనుంచి ప్రభుత్వానికి అందాయి. కానీ ఈ సమాచారాన్ని ప్రచురించినట్టయితే మనదేశం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఏదో ఒక దేశం ఆరోపిస్తుంది. భవిష్యత్తులో ఆయా దేశాలు మనకు సమాచారం ఇవ్వవు. మన ‘వనరులు’ ఎండిపోతాయి!’’ అని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అంటున్నారు. ప్రజలకు వెల్లడి చేయడానికి అడ్డువస్తున్న ఒప్పందాలను సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత జనవరిలో చెప్పిన ప్రభుత్వం పదకొండు నెలలో ఈ దిశగా సాధించింది కూడా మరో ‘గుండు సున్న’! విదేశాలలోని బ్యాంకులలో ఇరవై అయిదు లక్షలకోట్ల రూపాయల మేరకు భారతీయుల ‘మురికి డబ్బు’ మూలుగుతోందన్నది భారతీయ జనతాపార్టీ అధినేత లాల్‌కృష్ణ అద్వానీ సేకరించిన సరికొత్త సమాచారం. ప్రణబ్ ముఖర్జీ ఇందుకు ‘దీటుగా’ మరికొంత సమాచారం బయటపెట్టారు. స్విస్ బ్యాంకులలోనే తొంభయి ఐదు లక్షలకోట్ల రూపాయల నల్లడబ్బు నక్కి ఉందన్నది ఆయనకు తెలిసిన సమాచారం. అంటే అద్వానీకి తెలిసింది చాలా తక్కువన్నమాట! అయితే ఈ స్విస్ బ్యాకుల నల్లడబ్బులో మన వాటా ఎంత అనేది ముఖర్జీకి తెలియదు! నల్లడబ్బుపై ఒక ‘తెల్లపత్రాన్ని’ మాత్రం ప్రభుత్వం రూపొందించి విడుదల చేస్తుందట! నల్లడబ్బు దాచిన వారి పేర్లు బయట పెట్టలేనప్పుడు దీని వల్ల ఒరిగేదేమిటి?
మన ప్రభుత్వం ఎనభయి రెండు దేశాలతో సమాచార వినిమయానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖర్జీ గురువారం వెల్లడించారు. దాదాపు ఇదే సంగతిని ఆయన గత జనవరిలో కూడా చెప్పివున్నారు. అరవై అయిదు దేశాలతో ఈ ఒప్పందాలు కుదిరిపోయినట్టు మరో పదిహేడు దేశాలతో కుదుర్చుకోనున్నట్టు ఆయన జనవరిలో వెల్లడించారు. ఈ ఒప్పందాలు రెండు ప్రధాన అంశాలకు సంబంధించినవి. ఆదాయంపై రెండుసార్లు పన్ను విధించడాన్ని నిరోధించే ఒప్పందం మొదటిది. ఆదాయం పన్నుల వివరాల వినిమయానికి సంబంధించిన ఒప్పందం రెండవది. ఈ ఒప్పందాల ప్రకారం మన ప్రభుత్వానికి ఆయా ప్రభుత్వాలు తమ దేశాల బ్యాంకులలో ఉన్న మనవారి ఖాతాల వివరాలను అందజేస్తున్నాయట! కానీ ఈ వివరాలను మన ప్రభుత్వం వెల్లడి చేయరాదట. ఇంక ఎందుకీ ఒప్పందాలు? జర్మనీలోని ‘లీటిన్ స్టీన్’ బ్యాంకులో నల్లడబ్బు దాచిన ఇరవై ఆరుమంది వివరాలు గత డిసెంబరులోనే ప్రభుత్వానికి అందాయి. ఈ పేర్లను మూసి ఉంచిన ‘కవర్’లో పెట్టి ప్రభుత్వం జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదించింది. కానీ ఈ రెండు ఒప్పందాల కారణంగా ఈ నల్ల ఘరానాల పేర్లను వెల్లడించడానికి వీలుకాదని, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణ మొదలై ఈ నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేసిన తరువాత వారెవరో వెల్లడి అయిపోతుందని ప్రభుత్వం అప్పుడు చెప్పింది. మరి ఆ నిందితులను విచారించారా? ‘సిబిఐ’ వారు కానీ ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ బృందం’వారుకానీ వారిని అదుపులోకి తీసుకున్నారా? అలా జరిగి ఉంటే వారిని న్యాయస్థానాల ఎదుట హాజరుపరచి ఉండాలి! ఏ న్యాయస్థానం ఎదుట హాజరు పరచారు? వారిని ‘జైలు’లోనే నిర్బంధించి ఉంచారా? లేక ‘బెయిలు’పై విడుదల చేశారా? ఈ ప్రశ్నలు, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను ప్రతిపక్షాలవారు పార్లమెంటులో అడగలేదు. మంత్రి సమాధానం చెప్పలేదు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, నిందించుకొనడంతోనే సరిపోయింది. వాయిదా తీర్మానం వీగిపోయింది!
జర్మనీ బ్యాంకులో డబ్బు దాచినవారపై కోర్టుల్లో విచారణ ఎప్పుడు మొదలవుతుంతో ప్రజలకు తెలియవలసి వుంది. నల్లడబ్బును విదేశాలనుండి రప్పించడానికి, దాచినవారిని బహిరంగంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి వీలుగా, సంబంధిత ఒప్పందాలను సవరించడానికి మన ప్రభుత్వం చేయనున్న ప్రయత్నాల గురించి, అవలంబించే విధానం గురించి వివరాలు వెల్లడి కావలసి ఉంది. అమెరికా ప్రభుత్వం, ఐరోపా దేశాల ప్రభుత్వాలు స్విట్జర్లాండ్‌లోని కొన్ని బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకొనడం ద్వారా తమ దేశాలకు సంబంధించిన నల్లధనం కామందులను పట్టుకోగలిగాయి. ఈ దేశాలకు ఆయా బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల గురించి మన ప్రభుత్వమే ధ్రువీకరించింది. మరి మన ప్రభుత్వం ఆయా బ్యాంకులతో నేరుగా ఎందుకని ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదు? వ్యక్తుల వివరాలు వెల్లడి చేయడానికి స్విట్జర్లాండ్‌లోని మరికొన్ని బ్యాంకులు సిద్ధంగా లేవు. అలాంటి బ్యాంకులతో ఐరోపా దేశాలు, ఇతర దేశాలు మరోరకం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నిజానికి ఇది స్విట్జర్లాండ్ బ్యాంకులకు, ఆ దేశ ప్రభుత్వానికి, ఇతర దేశాలకు మధ్య కుదిరిన త్రైపాక్షిక అంగీకారం! 2005 నుండీ ఐరోపా దేశాలకు ఇలాంటి ఒప్పందం వల్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచిన విదేశీయుల పేర్లు మాత్రమే వెల్లడికావు. కానీ రహస్య ఖాతాలలోని నల్లధనంపై వచ్చే వడ్డీలో డెబ్బయి ఐదుశాతాన్ని బ్యాంకులవారు ఆయా దేశాల ప్రభుత్వాలకు చెల్లిస్తారు. వడ్డీలో ఇరవై ఐదుశాతం మాత్రం నల్లధనం దాచిన ఘరానా ఖాతాదార్లకు లభిస్తోంది. తేలుకుట్టిన దొంగవలె నల్లధనం ఖాతాదారలు నోరుమూసుకొని ఉన్నారు. వారు ఈ ఖాతాలలోని ‘అసలు’ను ఉపసంహరించుకోలేరు. అలా ఉపసంహరించుకున్న వారి పేర్లను స్విడ్జర్లాండ్ బ్యాంకులు వెల్లడిస్తాయి. అందువల్ల ఈ నల్లధనంలో డెబ్బయి ఐదుశాతం ఆయా దేశాల ప్రభుత్వాలకు మూలధనంగా మారింది. శాశ్వతంగా వడ్డీలోని మూడు వంతులు ఆయా దేశాల ప్రజలకు దక్కుతోంది. ఇలాంటి ఒప్పందాన్ని సైతం మన ప్రభుత్వం ఇంతవరకు కుదుర్చుకోలేదు! కుదుర్చుకున్నట్టయితే వడ్డీ విలువ ఎన్నివేలకోట్లన్నది తెలుస్తుంది. తద్వారా నల్లడబ్బు మొత్తం విలువ నిర్ధారించవచ్చు! కానీ ప్రభుత్వం కదలదు!!

‘పాలన’ వివాదం!.

‘పాలన’ వివాదం!.December 14th, 2011
లోక్‌పాల్ బిల్లును వ్యతిరేక దిశలలో లాగడానికి కేంద్రం, అన్నాహజారే బృందం, కృతనిశ్చయులై ఉన్నారన్నది స్పష్టమైపోయిన సత్యం. పార్లమెంటు స్థారుూ సంఘం వారు చేసిన సిఫార్సులను కొన్నింటిని, ఆమోదించకపోవడం ద్వారా ప్రభుత్వంవారు హజారే బృందానికి ఆగ్రహం తెప్పించారు. అన్ని రాజకీయ పక్షాల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదిరిన సమయంలో కేవలం ఒక్క అంశం గురించి ‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న’ విధానాన్ని హజారే బృందం వారు పునః ప్రారంభించడం విలంబన పథంలో సంభవించిన మరో వైపరీత్యం. లోక్‌పాల్ పాలనా అధికార పరిధిలోని ‘సిబిఐ’ని చేర్చాలనేది హజారే బృందం పట్టు! ఈ కోరికను అంగీకరించకపోయినట్టయితే హజారే ఈనెల 27వ తేదీ నుంచి మళ్ళీ నిరాహార దీక్షను ఆరంభించనున్నారు. ఆలోగా ‘కోరిక’ను అంగీకరించినట్లయితే 27వ తేదీన ఉత్సవం జరుపుతారట. ‘లోక్‌పాల్’ బిల్లు ఈ సమావేశంలో పార్లమెంటు ఆమోదం పొందదు. 22వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగిసిపోనున్నాయి. అంటే ఈ సమావేశాల సందర్భంగా ‘లోక్‌పాల్ బిల్లు’ను పార్లమెంటు ఆమోదించకపోయినప్పటికీ ఫర్వాలేదని హజారే బృందం వారు భావిస్తున్నట్టే కదా! ఈ సమావేశాల్లోనే ‘బిల్లు’ ‘చట్టం’ కావాలని చెబుతున్న వారు ఇలా 27వ తేదీ వరకు గడువును పొడిగించడం పరస్పర విరుద్ధమైన వైఖరులకు అద్దం పడుతోంది. గత ఎనిమిది నెలలకు పైగా జరిగిన చర్చలు నడచిన ఉద్యమాలు, చెలరేగిన విభేదాలు, కుదిరిన ఏకాభిప్రాయాలు ‘లోక్‌పాల్’ న్యాయాధికార పరిధి గురించి మాత్రమే. ఇప్పుడు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు ‘పాలనాధికారం’ ఉండాలన్న కోర్కె ప్రధానమైపోయింది. ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారిపై వచ్చే అభియోగాలను విచారించే హక్కు ‘లోక్‌పాల్’కు లభించడంవల్ల రాజకీయ విభేదాలు సమసిపోయినట్టే. ‘లోక్‌పాల్’కుండవలసిన న్యాయాధికారం పరిధి ఇందువల్ల విస్తరించింది. అందువల్ల పాలనాధికారం గురించి పేచీలు పెట్టడం ఈ దశలో అనవసరం.
స్థారుూ సంఘంవారు ప్రధానమంత్రిని లోక్‌పాల్ న్యాయాధికార పరిధిలోకి చేర్చలేదు. అలా చేర్చిన ‘ఘనత’ మంత్రివర్గానికి అధికార భాగస్వామ్య పక్షాలకు దక్కింది. ‘సిబిఐ’ గురించి స్థారుూ సంఘం చేసిన సిఫార్సును ప్రభుత్వ పక్షాలు తోసిపుచ్చాయి. ఇలా ‘స్థారుూ సంఘం’ తుది నివేదిక విప్లవాత్మకమైన పరిణామాలకు గురికావడం ప్రభుత్వం ఆడిన నాటకంలో భాగం. ప్రభుత్వం ఆగిన చోటనుండి హజారే బృందం వారు అందుకున్నారు! ఆలస్యం చేయడమే లక్ష్యం!! ప్రభుత్వ నిర్వాహకులైన రాజకీయ వేత్తల కనుసన్నలలో మెలుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ , ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ మండలి’ వంటి సంస్థలు సాధారణంగా దర్యాప్తును ఆరంభించవు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించేవరకు ‘సిబిఐ’లో కదలిక రాకపోవడం సమీప గతంలో జరిగిన పరిణామాల వల్ల ధ్రువ పడిన వాస్తవం. రెండవశ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపునకు, కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణకు సంబంధించిన కుంభకోణాల దర్యాప్తులు ఇందుకు నిదర్శనం. సుఖ్‌రామ్ వంటి మాజీ కేంద్రమంత్రిపై విచారణ ప్రక్రియను 1996 నుంచి ‘అప్పీళ్ళకప్పీల’ను దాటలేకపోతోంది. ‘లోక్‌పాల్’ వ్యవస్థీకృతమైన తరువాత ఇలాంటి న్యాయ విలంబాన్ని నిరోధించవచ్చు. ప్రథమ ఆరోపణ పత్రం దాఖలైన తరువాత ఏడేళ్ళ లోగా దర్యాప్తు, విచారణ పూర్తిఅయి తీర్పులు వెలువడాలని లోక్‌పాల్ బిల్లు నిర్దేశిస్తోంది కనుక ఈ నిబంధన న్యాయ ప్రక్రియ వేగవంతం కావడానికి అంకుశం వలె ఉపకరిస్తుంది. కేంద్రమంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నేర విచారణ విధాన స్మృతి లోని నిబంధనల మేరకు రాష్టప్రతి అనుమతి కావాలి. అలాగే అత్యున్నత స్థాయిలోని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో దర్యాప్తులు జరపడానికిప్రభుత్వం అనుమతి ప్రసాదించాలి. ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఇలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా దర్యాప్తునకు ఆదేశించగలరు. అభియోగపత్రం దాఖలయిన తరువాత సత్వర విచారణ జరిపి తీర్పులు చెప్పగలరు. దశాబ్దుల తరబడి దర్యాపులు నడిచిపోతుండటం, నేరాల తీవ్రత తద్వారా నీరుకారిపోవడం, నిందితులు మరణించడం, నేరస్థులు నిర్దోషులుగా బయటపడడానికి వీలు కలగడం వంటి వైపరీత్యాలను ‘లోక్‌పాల్’ వ్యవస్థ నిరోధించగలదు. ‘లోక్‌పాల్’ వ్యవస్థకు అంకురార్పణ జరగగానే ఉన్నతాధికారులు, అత్యున్నత అధికార రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు నిజాయతీపరులుగా మారిపోవడం కల్ల. అవినీతి ఆరోపణల గురించి కొంత వేగంగాను, మరికొంత సరళంగాను నిగ్గు తేల్చడానికి మాత్రమే ‘లోక్‌పాల్’ వ్యవస్థ ఉపయోగపడగలదు.
దర్యాప్తులపై ‘లోక్‌పాల్’ నియంత్రణ గురించి వివిధ రాజకీయ పక్షాలు స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ, ఈ దర్యాప్తుపై లోక్‌పాల్‌కుండే అధికార పరిధి గురించి స్పష్టమైన నిబంధనలు రూపొందలేదు. దర్యాప్తును ప్రారంభించడానికి ముందు ‘సిబిఐ’ వారు లోక్‌పాల్ అనుమతిని తీసుకోవాలన్నది పార్లమెంటరీ స్థారుూ సంఘం వారు తమ తుది నివేదికలో విధించిన నిబంధన. ఈ నిబంధనను ‘సిబిఐ’ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ‘సిబిఐ’ను లోక్‌పాల్ పరిధినుంచి మినహాయించారు. ప్రధానమంత్రి పదవిలో ఉండే వారిపై వచ్చే ఆరోపణలను ‘లోక్‌పాల్’ న్యాయస్థానం వారు ఆయా ప్రధాన మంత్రులు పదవులను పరిత్యజించిన తరువాత విచారించాలని స్థాయా సంఘం మరో ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాన అమలు జరిగినట్టయితే అవినీతి గ్రస్తులైన ప్రధానులు అనేక ఏళ్ళపాటు విచారణంను వాయిదా వేసి హాయిగా పదవులలో కొనసాగవచ్చు. ‘సి’ తరగతి ప్రభుత్వ ఉద్యోగులను ‘లోక్‌పాల్’ పరిధినుంచి మినహాయించాలన్నది స్థారుూ సంఘం వారి మరో ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను కూడా రాజకీయ పక్షాలు తిరస్కరించాయి. లోక్‌పాల్‌కు అనుబంధంగా ఏర్పాటయ్యే ‘అంబుడ్స్‌మాన్’ పరిధిలోకి ‘సి’ తరగతి ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలను చేర్చుతారట. ‘సిబిఐ’ వారు స్వతంత్రంగా దర్యాప్తు చేసే నేరాలకు సంబంధించిన అభియోగాలను లోక్‌పాల్‌కు నివేదించాలా? లేక ప్రత్యేక న్యాయస్థానాలకు నివేదించాలా? అన్న విషయం గురించి కూడా స్పష్టత ఏర్పడలేదు. ప్రస్తుతం సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థ. కేంద్ర ప్రభుత్వం నిర్వాహకులు ‘సిబిఐ’ని అనధికారికంగా అదుపు చేయడం రాజకీయ సమస్య. కానీ సిబిఐని పూర్తిగా ‘లోక్‌పాల్’కు అనుబంధంగా మార్చడం అభిలషణీయం కాదు. ప్రభుత్వ పాలనా పరిధి నుంచి ‘సిబిఐ’ను తప్పించ దలచుకున్నట్టయితే ఆ విభాగాన్ని సుప్రీంకోర్టు ఆజమాయిషీ కిందికి తేవచ్చు. ‘లోక్‌పాల్’ తీర్పులను సైతం సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. సిబిఐ మాజీ డైరెక్టర్ ఆర్‌కె రాఘవన్ వంటి వారు ‘సిబిఐ’పై ‘లోక్‌పాల్’కు పాలనా సంబంధమైన అధికారం ఉండవచ్చునని సూచిస్తున్నారు. అన్నా హజారే బృందంవారు ‘సిబిఐ’ని ‘లోక్‌పాల్’ పాలనాధికార పరిధిలో చేర్చాలని పట్టుబట్టడానికి ఇలాంటి సూచనలు కారణం కావచ్చు. ఏమయినప్పటికీ ప్రస్తుత సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ‘లోక్‌పాల్’ బిల్లునకు ఆమోదం లభించబోదన్నది స్పష్టమవుతున్న అంశం..

కోర్టుకెక్కిన కృష్ణ

కోర్టుకెక్కిన కృష్ణ.December 10th, 2011
పదవికి రాజీనామా చేయకపోవడం ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ మరో అసమంజసమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ దుష్ట సంప్రదాయం వ్యవస్థీకృతమయినట్టయితే న్యాయస్థానాల్లో తమకు వ్యతిరేకంగా ‘్ఫర్యాదుపత్రం’-ఎఫ్‌ఐఆర్- దాఖలయినప్పటికీ కేంద్రమంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు కానీ తమ పదవులకు రాజీనామా చేయనక్కరలేదు. ఎస్‌ఎం కృష్ణ తమ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు యథావిధిగా గందరగోళం సృష్టించారు. సభలు వాయిదా పడడం మినహా వారు సాధించింది లేదు. కృష్ణ పదవిని వదిలిపెట్టలేదు. కర్నాటకలోని లోకాయుక్త న్యాయాలయంలో పోలీసులు దాఖలు చేసిన ‘ఎఫ్‌ఐఆర్’ ప్రాతిపదికగా తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో కృష్ణ అవలంబించిన విధానం కారణంగా ‘ప్రైవేట్ కంపెనీ’ల కామందులు భారీగా ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి వీలు కలిగిందన్నది ప్రధాన ఆరోపణ. 1999, 2004 సంవత్సరాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన కృష్ణ ‘రక్షిత అటవీ భూముల’ను సాధారణ అటవీ భూములుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారట. దీనివల్ల వేలాది ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో ఇనుపఖనిజాన్ని ఇతర ఖనిజాన్ని తోడేయడానికి కార్పొరేట్ వాణిజ్య సంస్థలకు అనుమతి లభించిందని ‘సమాచార’ ఉద్యమకారుడు టిజె అబ్రహం గత నెల 29న లోకాయుక్తకు ఫిర్యాదు దాఖలు చేసాడు. తమకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదులు అందిన వెంటనే పదవులకు మంత్రులు రాజీనామా చేయడం ఒకప్పటి సత్సంప్రదాయం. కృష్ణకంటే ముందు ఇలా మొండికెత్తిన రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు ఉన్నారు. కానీ ఏ రాజా వంటి భారీ కుంభకోణగ్రస్తులు సైతం కోర్టులో ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలయిన వెంటనే రాజీనామా చేసారు. కానీ కృష్ణకు వ్యతిరేకంగా న్యాయ ప్రక్రియ మూడు దశలను దాటింది. ‘ఆర్‌టిఐ’ ఉద్యమకారుడు ఫిర్యాదు చేయడం మొదటి దశ. ఈ ఫిర్యాదు ప్రాతిపదికగా దర్యాప్తు జరుపవలసిందిగా లోకాయుక్త న్యాయస్థానం వారు ఈనెల 3న పోలీసులను ఆదేశించారు. పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. కృష్ణపై వచ్చిన ఆరోపణలు నిజమని విశ్వసించడానికి తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటం వల్ల మాత్రమే పోలీసులు ఇంతటి సాహస కార్యానికి పూనుకున్నారు. అలాంటి ఆధారాలు లేనట్టయితే లోకాయుక్త, పోలీసులు కాని, ఇతర దర్యాప్తు విభాగాల అధికారులు కానీ ఒక ప్రముఖ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు చేసే దుస్సాహసానికి ఒడిగట్టరు.
గనుల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని ఆరంభించింది ఎస్‌ఎం కృష్ణ కాగా ఆతరువాత ముఖ్యమంత్రి పదవులను చేపట్టిన ధరమ్ సింగ్, హెచ్‌డి కుమారస్వామి భారీగా అటవీ భూములను గనుల కామందులకు అప్పగించారన్నది ఫిర్యాదుదారుని ప్రధాన ఆరోపణ. ఎడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో అక్రమంగా గనులను తవ్వడం ప్రభుత్వ నిఘా కన్నుగప్పి ఇనుప ఖనిజాన్ని తరలించడం వంటి కలాపాలు పరాకాష్టకు చేరడం వేరే కథ. అవినీతి మూటల బరువుకు ఎడియూరప్ప మంత్రివర్గం కూలిపోయింది. వేలాది కోట్ల రూపాయలు దోచిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి కటకటాలను లెక్కపెడుతున్నాడు. గాలి జనార్థన రెడ్డిని పట్టుకున్నది సిబిఐ కాగా, ఎడియూరప్ప మాత్రం లోకాయుక్తకే దొరికిపోయాడు. తవ్వినకొద్దీ అవినీతి కుంభకోణాలు బయటపడుతుండటానికి కృష్ణపై కేసు దాఖలు కావడం మరో ఉదాహరణ. ధరమ్‌సింగ్‌కు, కుమారస్వామికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘మచ్చ లేని రాజకీయ వేత్త’గా కర్నాటక కాంగ్రెస్ వారు ప్రచారం చేసిన ఎస్‌ఎం కృష్ణ ‘బండారం’ ఇలా బయటపడడమే విస్మయకరం. ఇనుప ఖనిజాన్ని, అభ్రకపు ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట నుంచి మరొక చోటికి తరలించడానికి, రాష్ట్రం సరిహద్దులను దాటించడానికి వీలుగా ప్రైవేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతి పత్రాలను మంజూరు చేసారనేది ధరమ్‌సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదు పత్రంలోని సారాంశం. ఇలా ఇనుప ఖనిజాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా కర్నాటక బయటకి దాటించే ‘కళ’లో ‘బళ్ళారి’ గాలి సోదరులు పేరు మోయడానికి ఈ అక్రమ అనుమతి పత్రాలు కారణం. ‘శ్రీ వేంకటేశ్వర మినరల్స్’, ‘జనతాకల్ మైనింగ్ కార్పొరేషన్’ అన్న వాణిజ్య సంస్థలకు కుమారస్వామి ఐదువందల ఎకరాల సురక్షిత అటవీ ప్రాంతాన్ని అప్పగించాడట. ఈ రెండు ఫిర్యాదు పత్రాలలోని ఆరోపణలతో పోల్చినప్పుడు కృష్ణ చేసిన ‘నేరం’ అంతపెద్దది కాకపోవచ్చు. కానీ ఆయన ప్రారంభించిన ‘విధానమే’ తదుపరి జరిగిన అవినీతి గనుల తవ్వకాలకు ‘ప్రాతిపదిక’ అన్నది ఫిర్యాదిదారుని వాదం. ఈ ముగ్గురి బంధువులు అనేక గనుల తవ్వకాల సంస్థలలోను, ఖనిజ వ్యాపారాలలోను భారీగా పెట్టుబడులు పెట్టారట. కుమారస్వామిపై గతంలో దాఖలయిన మరో ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదు దారుడు ఆషామాషీగా ఆరోపణలను చేశాడని, అందువల్ల అతగాడు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని కూడా హైకోర్టు నిర్ధారించింది.
అందువల్లనే బహుశా కృష్ణ ఇప్పుడు హడావుడిగా హైకోర్టుకెక్కాడు. కుమారస్వామికి లభించినట్టుగా తనకు కూడా హైకోర్టులో ‘న్యాయం’ జరుగుతుందని ఆయన ధీమా కాబోలు. కానీ లోకాయుక్త న్యాయస్థానంవారు ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయకముందే హైకోర్టుకెక్కడం గుర్రానికి ముందు బండిని కట్టేసినట్టయింది. న్యాయస్థానంలో హాజరు కావాలంటూ లోకాయుక్త కృష్ణకు ‘సమన్లు’ జారీ చేయలేదు. ఆయనను అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులను ఆదేశిస్తూ ‘వారెంటు’ పంపలేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిన తర్వాత మాత్రమే హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేసి ఉండవలసింది. తక్షణం చేసి ఉండవలసిన పని పదవిని పరిత్యజించడం. అలా చేసివుండినట్లయితే ‘మచ్చలేని నాయకుడన్న’ ప్రచారానికి సార్ధకత ఏర్పడివుండేది.‘రక్షిత అటవీ భూములలో గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వరాదని’ ముఖ్యమంత్రిగా వుండిన సమయంలో కృష్ణకు సంబంధిత మంత్రిత్వ విభాగం కార్యదర్శి లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చాడట! కానీ ఈ సముచిత సూచనను కృష్ణ నిర్ద్వద్వంగా తిరస్కరించాడట. ఈ ‘నిర్ణయం’ అనేక ఏళ్ళుగా ఖనిజాలను దోచిపారేస్తున్న ‘కామందులకు’ తలుపులు తెరచిందన్నది ఫిర్యాదు పత్రంలోని ప్రధానాంశం. విదేశాంగ మంత్రిగా కృష్ణ మందగొడితనానికి మారుపేరుగా ప్రసిద్ధి కెక్కాడు. ఆయన నైతిక నిష్టను గురించి ఎవరూ వేలెత్తలేదు! కృష్ణ నిజాయతీపరుడన్న కారణంగానే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసింది. ఇందుకోసం ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది! మరి ఇప్పుడెందుకు రాజీనామా చేయరు?

మత్తుకు ‘మందు’

మత్తుకు ‘మందు’!.December 8th, 2011
సమాజానికి మద్యం మత్తెక్కిస్తున్న వారిని శిక్షించడానికి జరుపుతున్న ప్రయత్నంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టం విప్లవాత్మక పరిణామం. దేశం మొత్తంమీద మద్యం సేవించడం మూమూలు విషయమై పోయిన నేపథ్యంలో నకిలీ పానీయాలు, కల్తీపానీయాలు, కలుషిత పానీయాలు ప్రాణాలను హరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వారు ‘సక్రమంగా’ సరఫరా చేస్తున్న సారాను అక్రమంగా సేవిస్తున్న వారు సృష్టిస్తున్న బీభత్స సమాజాన్ని నిరంతర భయ విభ్రాంతికి గురి చేస్తుండటం కూడా దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న మాదక దృశ్యం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం ప్రలోభాన్ని ప్రభావాన్ని నిరోధించడానికి వీలుగా గుజరాత్‌లో రూపొందించిన చట్టం సామాజిక విచక్షణ భావ పథంలో మరో ముందడుగు. దేశ వ్యాప్తంగా అమలు జరుపడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని రూపొందించినప్పటికీ, నకిలీ మత్తు పానీయాల విషగ్రస్తులైపోతున్న వారి సంఖ్యను క్రమంగా తగ్గించవచ్చునేమో? గుజరాత్ శాసనసభ 2009లో రూపొందించిన కొత్త బిల్లును గవర్నర్ కమలా వేణీవాల్ ఇటీవల ఆమోదించారట. నకిలీ మద్యం తయారు చేసినవారికి, రవాణా చేసినవారికి, పంపిణీ చేసిన వారికి కొత్త చట్టం ప్రకారం మరణశిక్షను విధించడానికి వీలుంది. ‘కల్తీ’ మృతులు గుజరాత్‌లో మరింత భారీ సంఖ్యలో ఉన్నారు. 1989లో వడోదరా నగరంలో కలుషిత సారా తాగిన కారణంగా రెండు వందల యాబయి ఏడు మంది అకాల మరణం పాలయ్యారు. 2009లో కల్తీ మద్యం వేటుపడి మరో నూట యాబయి ఏడుమంది అహమ్మదాబాద్‌లో దుర్మరణం పాలయ్యారు. అంతేకాక మరో మూడు వందల యాబయి మందికి పైగా వివిధ సమయాలలో గుజరాత్‌లో నకిలీ సారా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం దృష్టికిరాని కల్తీ మరణాలు ఇంకెన్నో? కల్తీ సారా వంటి ‘లాథా’ మద్యం తయారు చేసే వారిని మరణశిక్షకు గురి చేయాలన్న గుజరాత్ ప్రభుత్వం పట్టుదలకు ఇదీ నేపథ్యం. ఇంతవరకు గుజరాత్‌లోను, మహారాష్టల్రోను అమల్లో వున్న 1949వ సంవత్సరం నాటి ‘బొంబాయి మద్య పాన నిషేధ చట్టం’ ప్రకారం నకిలీ మత్తును పంపిణీ చేసేవారికి ఉత్పత్తి చేసేవారికి కేవలం ఏడాది జైలుశిక్ష విధిస్తున్నారు. ప్రాణాలు పోయిన సందర్భాల్లో కూడా ఇంతకంటే ఎక్కువ శిక్షలు వేయడానికి వీలు లేదు. కొత్త చట్టం ఝలిపిస్తున్న కొరడా అందువల్ల చాలా భయంకరంగా కనిపిస్తోంది. నకిలీ మత్తుపానీయాలను సేవించినవారు మరణించిన సందర్భాల్లో సైతం ఉత్పత్తిదారులకు మరణశిక్ష విధించడం ‘నేరానికి విధించిన దండన’ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ గవర్నర్ స్వయంగా ఈ అనుమానాలు వ్యక్తం చేయడం 2009 నాటి శాసనసభ ఆమోదం పొందిన బిల్లు రెండేళ్ళకు పైగా చట్టం కాలేకపోవడానికి కారణం. ‘మరణశిక్ష’ను రద్దు చేసి గరిష్ఠశిక్షను యావజ్జీవ కారాగార శిక్ష స్థాయికి కుదించాలని సూచిస్తూ గవర్నర్ బిల్లును తిప్పి పంపారు కూడా! అయితే గవర్నర్ సూచనను ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతిపక్షాలుకూడా తోసిపుచ్చాయి. ఇలా ఏకాభిప్రాయం వ్యక్తం కావడం నకిలీ మద్యం సృష్టిస్తున్న బీభత్సకాండ తీవ్రతకు నిదర్శనం. గుజరాత్ శాసనసభ యథాతథంగా బిల్లును రెండవసారి ఆమోదించడంతో గవర్నర్‌మోదించడం అనివార్యమైపోయింది. నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాల్లో మద్యాన్ని తయారు చేసినవారు, అమ్మినవారు ఇక బతికి బయటపడటం కల్ల.
కొత్త చట్టం ప్రకారం నకిలీ మద్యం ఉత్పత్తిదార్లు, విక్రేతలు కేసు విచారణ పూర్తయ్యేవరకు కటకటాలను లెక్కపెట్టవలసి వస్తుంది. ఇంతవరకు నకిలీ మద్యం తయారు చేయడం తీవ్ర నేరం కాదు. అందువల్ల నిందితులకు సులభంగా ‘బెయిల్’ మంజూరైపోయేది. కొత్త చట్టం ప్రకారం కల్తీ మద్యం తయారు చేయడం తీవ్రమైన నేరం. అందువల్ల ప్రాణాలు తీసే మద్యాన్ని తయారు చేసిన అభియోగంపై అరెస్టయిన నిందితులు కేసు విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధంలో ఉండవలసిందే. ప్రాణాలకు ప్రమాదం కలుగని సందర్భాల్లో సైతం కలుషిత మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేసిన వారిని పదేళ్ళ వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. నేరస్థులతో కుమ్మక్కయి, దర్యాప్తును నీరు కార్చే పోలీసులకు సంవత్సర కాలంపాటు జైలు శిక్ష విధించడానికి కొత్త చట్టం వీలుకల్పిస్తున్నది. అందువల్ల ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలను నీరుకార్చి అక్రమంగా మద్యం తయారు చేసే వారి సంఖ్య తగ్గవచ్చు. నకిలీ, కల్తీ, కలుషిత మద్యాలు, సృష్టిస్తున్న బీభత్సం కంటే ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న చేయిస్తున్న ‘సక్రమ’ మద్యాలు కలిగిస్తున్న ప్రాణనష్టం మాత్రం ఎక్కువగావుంది. పరోక్షంగాను ప్రత్యక్షంగాను ప్రాణ నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ మద్యపానమత్తుల నేరాలు అనేక సందర్భాల్లో రుజువు కావడంలేదు. నేరాలు ధ్రువ పరచిన సందర్భాల్లో సైతం ఈ పరోక్ష హంతకులకు వర్తమాన న్యాయ నిబంధనల ప్రకారం లభిస్తున్న శిక్షలు రెండేళ్ళ కారాగార వ్యవధిని దాటడం లేదు. మద్యం సేవించి విధులను నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరగడానికి కారణం ప్రధానంగా శిక్షలు తక్కువ స్థాయిలో వుండటమే. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వివిధ రకాల ప్రమాదాలకు ‘ప్రామాణిక’ మద్యపానం కారణం! మన రాష్ట్ర రాజధానిలోనే ఈ ఏడాది జనవరి అక్టోబర్ నెలల మధ్య 2212 రోడ్డు ప్రమాదాలు జరిగాయట. మద్యం సేవించి వాహనాలు నడిపినవారు వీటిలో అత్యధికశాతం ప్రమాదాలకు కారణమట. ఈ ప్రమాదాలకు బలైపోయినవారిలో అత్యధికులు ద్విచక్రవాహనాలను అడ్డదిడ్డంగా నడిపినవారు. వీరంతా మద్యం మత్తువల్ల రోడ్డు కనబడనివారు! అయితే తాగి ఊగిపోయిన జరిపిస్తున్న ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిలో ముప్పయి ఐదుశాతం మంది తాగనివారు! బస్సు ప్రయాణికులు, రోడ్డుపై నడిచిపోయేవారు, రోడ్డుకు దూరంగా దుకాణాల మందు నిద్రించేవారు- ఇలాంటి ‘తాగని’వారు ‘తాగిన’వారి వాహన బీభత్స కాండకు బలైపోయారు. రోడ్ల జంక్షన్ల వద్ద ‘రాకపోకల రక్షకభటులు’ అప్పుడప్పుడు నిలబడి వాహన చోదకులను పరీక్షిస్తున్నారు. కానీ ఈ పరీక్షలవల్ల తాగి వాహనాలను నడిపించేవారి సంఖ్య తగ్గడంలేదు. ఎందుకంటే తాగిన స్థితిలో మట్టుబడిన వాహన చోదకులవద్ద ‘పరీక్షకులు’ లంచాలు పుచ్చుకొని వదలిపెట్టడం పరిపాటి. వదలి పెట్టని సందర్భాల్లో కూడా వాహనాల డ్రైవర్లకు పడే శిక్షలు చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి.
మన రాష్ట్ర రాజధానిలోని ఒక న్యాయస్థానం ఈనెల ఆరవ తేదీన ఇలాటి 211 మంది ‘మాదక చోదకు’లను శిక్షించిందట. శిక్షకు గురయిన వారిలో న్యాయవాదులు, వైద్యులు, పత్రికా రచయితలు, రక్షక భటులు, రాజకీయ కుంటుంబాలవారు మాత్రమే కాక మహిళలు కూడా ఉన్నారట! స్ర్తిపురుష సమానత్వపు మాదక సుగంధాలు ఇలా గుబాళించాయి! సమాజాన్ని మత్తెక్కిస్తున్నాయి. శిక్షించడం హర్షణీయం. కానీ ఏమిటీ శిక్ష! ఒక్కొక్కరికి రెండు వేల ఐదువందల రూపాయలు జరిమానా విధించారట! తాత్కాలికంగా వారి చోదనానుమతి పత్రాలను రద్దు చేశారట! కానీ ‘ఘరానా’లందరూ రెండు లక్షల రూపాయల ‘జరిమానాలు’ సైతం కట్టేయగలరు. కోర్టు వెలుపలకు వచ్చి మళ్ళీ తాగి మత్తెక్కి వాహనాలను నడిపేయగలరు! అలా వారంతా ఇలాంటి నేరస్థులకు కనీసం ఆరు నెలల పాటు జైలుశిక్షను విధించే విధంగా న్యాయ ప్రక్రియను సవరించామనుకోండి! కొంతలో కొంతైనా భయం పెరుగుతుంది. అందువల్ల గుజరాత్ ప్రభుత్వం మద్యం ముఠాలకు మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించడం వౌలిక న్యాయసూత్రాలకు, సహజ న్యాయసాధన ప్రక్రియకు భంగం కలిగించినట్టు కాజాలదు. దురాశ నకిలీ మద్యం వ్యాపారులు ఉత్పత్తిదారులను ఆక్రమంగా సారా బట్టీలను నిర్వహించడానికి పురికొల్పడం మాత్రం వాస్తవం. దురాశకు, నిర్లక్ష్యం తోడై ప్రాణాలను బలిగొంటున్నది. గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన తరహా చట్టాలు ఈ మత్తును కొంతైనా తొలగించగలవు!

దీదీ దయ!.

దీదీ దయ!.December 5th, 2011
దేశ ప్రయోజనాలను లెక్కచేయని ప్రభుత్వ నిర్వాహకులు రాజకీయ అనివార్య పరిణామాల ముందు తలవంచక తప్పడంలేదు. ఈ వాస్తవ వైచిత్రికి మరో నిదర్శనం ‘చిల్లర’ పెట్టుబడులపై కొనసాగుతున్న వివాదం. చిల్లర వ్యాపార రంగంలో విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చునన్న నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్న లేదని వారం రోజులపాటు భీష్మించుకున్న కేంద్ర ప్రభుత్వం బెట్టు సడలించడానికి ఏకైక కారణం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింతగా మొండికెత్తడం! చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్య- ఎఫ్‌డిఐ- ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంటుందా? లేక తాత్కాలికంగా వాయిదా వేసుకుంటుందా? అన్నది బుధవారం కానీ స్పష్టం కాదట. పార్లమెంటు సభలలో ఆరోజున ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నది ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సరికొత్త సమాచారం. అయినప్పకికీ ప్రస్తుతానికి మన చిల్లర వ్యాపారులు, కిరాణం కొట్టువారు, బడ్డీ కొట్టువారు, నెత్తిగంపల సంచార వర్తకులు, బండ్లను తోసుకునే వీధి వ్యాపారులు ‘వాల్ మార్ట్’ వంటి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలతో పోటీ పడనవసరం లేదు. ఈ ‘అవసరం’ తప్పించిన ఘనత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది! ప్రతిపక్షం సాధించలేని పనిని ‘ఐక్య ప్రగతిశీల కూటమి’లోని భాగసామ్య పక్షాలు సాధించగలిగాయి. భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి వారు ఇతర ప్రతి పక్షాల వారు ఐదు రోజుల పాటు పార్లమెంటును స్తంభింప చేసినప్పటికీ ప్రభు త్వం స్పందించలేదు. చిల్లర వ్యాపారుల జాతీయ సంఘాల వారు జరిపిన నిరసన ప్రదర్శనల నినాదాలు ప్రభుత్వం వారికి వినిపించలేదు. కానీ మమతా బెనర్జీ నడుం బిగించి ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా నినదించేసరికి ప్రధాని మన్మోహన్ సింగ్ మెట్టు దిగక తప్పలేదు. వాయిదా తీర్మానంపై లోక్‌సభలో ‘వోటింగ్’ జరిగే పక్షంలో తృణమూల్ సభ్యులు సహకరించకపోతే మన్మోహన్ సర్కార్ కూలిపోవడం ఖాయం! తృణమూల్‌కు తోడుగా డిఎంకె కూడా ‘ఎఫ్‌డిఐ’పై వ్యతిరేకతను ప్రకటించడం మన్‌మోహన్‌సింగ్ ఊహించని పరిణామం. సిద్ధాంతపరంగా కాక కుమార్తె కనిమోళికి కలిగిన ‘కష్టాల’ ప్రాతిపదికగా డిఎంకె అధినేత కరుణానిథి మన్‌మోహన్‌పై కినుక వహించి ఉన్నాడు మరి! సిద్ధాంతం రంగు పూనడానికి ఈ అవకాశం డిఎంకె నాయకుడికి కలిసివచ్చింది. ఈ ‘వ్యూహం’ ఇలా బెడిసికొట్టడానికి కారణం జాతీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవాలన్న మమతా బెనర్జీ పట్టుదల. ప్రత్యేక ఆర్థిక మండలులకు వ్యతిరేకంగా ‘బెంగాల్ దీదీ’ నడిపిన ఉద్యమం వల్ల బలవంతపు భూమి సేకరణ ప్రక్రియ వేగం కూడా తగ్గింది. రైతులకు భూమిపై అధారపడే హక్కుకు ప్రత్యామ్నాయ ఉపాధి పునరావాసాన్ని కల్పించిన తర్వాత మాత్రమే వ్యవసాయ భూమిని ప్రభుత్వాలు సేకరించాలన్న కొత్త నిబంధన రూపొందుతుండానికి కారణం. మమతా బెనర్జీ ‘ఐక్య ప్రగతి’ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి! బంగ్లాదేశ్‌కు తీస్తానది జలాలలో అధిక భాగం ధారదత్తం చేసే ఒప్పందాన్ని గత సెప్టెంబర్‌లో నిరోధించిన మమతమ్మ ఇప్పుడిలా చిల్లర వ్యాపారులను ఆదుకోగలిగింది! స్వదేశీయ ఆర్థిక వ్యవస్థకు, వికేంద్రీకృత వాణిజ్యానికి ఇది మరో విజయం!
అబద్ధాలు రాసి దిద్దుకొనడం అంటే ఇదే కాబోలు. అంతర్జాతీయ అనుసంధానం పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ అధికార పక్షాలతో మాత్రమే కాదు, కాంగ్రెస్ వారితో సైతం ‘ఎఫ్‌డిఐ’ విషయమై చర్చించలేదన్నది ఇప్పుడు స్పష్టం. ‘తప్పుల కుప్ప’ను ఆవిష్కరించానని వాణిజ్య మంత్రి ఆనంద్‌శర్మ, ఆహార మంత్రి కె.వి. థామస్ గత నెల 24, 25 తేదీల్లో చేసిన హడావుడి అంతాఇంతా కాదు.తప్పులను సరిదిద్దుకోవలసి వచ్చేసరికి మన్‌మోహన్‌సింగ్ వారిని తప్పించి ‘యథావిథిగా’ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని పురమాయించవలసి వచ్చింది. మమతా బెనర్జీ అడ్డుపడక పోయి వుండినట్లయితే ‘చిల్లర ఎఫ్‌డిఐ’ వల్ల కోటి ఉద్యోగాలు కొలువు తీరుతాయని ప్రచార ఆర్భాటాన్ని ఆనందశర్మ బహుశా ఆపి వుండే వారు కాదు. చిల్లర వ్యాపారాన్ని, విదేశీయ ‘బహుళ’ సంస్థలకు అప్పగించం వల్ల ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని, ‘రిజర్వ్ బ్యాంకు’ నిర్వాహకులు చేసిన సిద్ధాంతం కూడా ఇప్పుడు కేవలం రాద్ధాంతంగా మిగిలి పోనుంది. నిర్ణయం ప్రకటించిన తరువాత వివిధ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధన గురించి ప్రభుత్వం ప్రసంగిస్తోంది. ఈ ఏకాభిప్రాయ సాధనకోసం ముఖర్జీ కృషి చేస్తున్నారట! నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎందుకని ‘ఏకాభిప్రాయ సాధన’కు ప్రయత్నించలేదు? అంతే కాదు, రాజ్యాంగ పరమైన తప్పులకు కూడా పాల్పడినట్టు అంగీకరించట్టయింది. ‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల విధాన నిర్ణయాలను సభల వేదికల మీది నుంచి మాత్రమే ప్రకటించాలి,’ అన్న రాజ్యాంగ సంప్రదాయాన్ని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉటంకించారు. మరి ఈ మహావిషయం ప్రభుత్వానికి ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చింది? గత నెల 24వ తేదీన ఈ ‘సంప్రదాయ స్ఫురణ’ ఎందుకని కలుగలేదు? ఆ రోజున మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఆహార మంత్రి హడావుడిగా బయటకు వచ్చి ‘‘చిల్లర వ్యాపారంలో ‘ఎఫ్‌డిఐ’ని అనుమతిస్తున్నాం’’ అని ప్రకటించారు. మరుసటి ఉదయం పార్లమెంట్ సమావేశం వరకు ఎందుకు ఆగలేదు??
ఆర్థిక స్వాంతంత్య్రాన్ని హరించి వేసే సమయంలో ‘చిల్లర’ దోపిడీ ఒక ప్రధాన అంశం. దేశం ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రక్రియ 1990వ దశకం మొదలైన వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-తో మొదలయింది. ‘వాణిజ్య’ సుంకాల సాధారణ వ్యవస్థ’-గాట్-లో మన దేశం ప్రవేశించిన నాడే ఆరంభమయింది. ‘గాట్’ ఆతరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’రూపం ధరించే నాటికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వలలో మన వాణిజ్య వ్యవసాయ రంగాలు చిక్కుకు పోయాయి. ‘వల’ బిగుస్తున్న కొద్దీ గిల గిల మంటున్న దృశ్యాలు ఆవిష్కృతవౌతున్నాయి.కానీ వినిపించుకోని ‘బధిరాంధ’ ప్రవృత్తి ప్రభుత్వాలను ఆవహించి వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభించిన ఘనకార్యాన్ని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆతరువాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం నడిచిపోతున్న విధాన వైపరీత్యం. నమూనాల-పేటెంట్ల- చట్టాన్ని ‘ప్రజాస్వామ్య జాతీయ కూటమి’ -ఎన్‌డిఎ- ప్రభుత్వం రూపొందించకపోయివుండినట్టయితే ప్రపంచీకరణ, మనదేశంలో వ్యవస్థీకృతం అయివుండేది కాదు! బీమా రంగంలో విదేశీయ సంస్థలను ‘్భజపా’ దొరతనం తలుపులు బార్లా తెరిస్తే రక్షణ రంగాన్ని ‘బహుళ’ సంస్థలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెత్తనం నడుం బిగించింది. చిల్లర వ్యాపారం రాక సంస్థాగత అనుసంధాన భాగస్వామ్యం -ఎఫ్‌డిఐ- ద్వారా విదేశీయ వ్యాపార వేత్తలు ఇదివరకే చొరబడిన సంగతి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు తెలుసు. ‘ప్రత్యక్ష భాగస్వామ్యం’ గురించి కూడా రెండేళ్ళుగా చర్చ నడుస్తున్నది. అలాంటప్పుడు ప్రతిపక్షాలవారు, దేశవ్యాప్తంగా ఎందుకని ఉద్యమం ఆరంభించలేదు?బెంగాల్ ‘దీదీ’ దడ పుట్టించింది కాబట్టి సరిపోయింది. లేనట్టయితే అమెరికాతో అణు సహకార ఒప్పందం మారినట్టే, చిల్లర వ్యాపారంలో విదేశీయుల పెత్తనం స్థిరపడి వుండేది కాదా??

నీటి రాజకీయం

నీటి రాజకీయం.December 2nd, 2011
కేరళ తమిళనాడు రాష్ట్రాల మధ్య రగులుతున్న ‘నీటిరగడ’ అనేక చిత్రాలను ఆవిష్కరిస్తోంది. నదీజలాల పంపిణీని పర్యవేక్షించడానికి వివిధ నదులపై నిర్మాణం అవుతున్న ఆనకట్టలను ఆజమాయిషీ చేయడానికి కేంద్ర స్థాయిలో శాశ్వత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పరచాలన్న భావానికి ఈకొత్త వివాదం మరింత బలం చేకూర్చుతోంది. రెండు కంటె ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ప్రతి నది వివాదగ్రస్తం అవుతున్న ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనివున్న వైపరీత్యం. మూల పెరియార్ గురించి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పరస్పరం తలపడుతున్నాయి. శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులు నినాదాలు చేయడం ‘మూల పెరియార్’ ప్రహసనంలో సరికొత్త పరిణామం. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ప్రధానమంత్రిని కలుసుకున్నారు. మూల పెరియార్ ఆనకట్టను కూలగొట్టే కార్యక్రమానికి ఆటంకాలు కల్పించకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారట. ప్రధానమంత్రి మాత్రం కేంద్ర జలవనరుల మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌తో చర్చించవలసిందిగా కోరారట. సుప్రీం కోర్టువారు జోక్యం చేసుకుంటే తప్ప అంతర్‌రాష్ట్ర నదుల వివాదాలు పరిష్కారం కాకపోవడం అనేకసార్లు ధ్రువపడిన వాస్తవం. మూల పెరియార్ ఆనకట్ట తెగిపోయినట్టయితే తమ ఇడుక్కి జిల్లాలోని దిగువ ప్రాంతమంతా జలమయమైపోయి ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం భారీగా సంభవిస్తుందని కేరళ ప్రభుత్వం చెబుతున్నది. అందువల్ల జలాశయాన్ని ఖాళీ చేసి, తర్వాత ఆనకట్టను కూల్చివేసి, దాని స్థానంలో కొత్త ఆనకట్టను నిర్మించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే తమ వేఘై, రామరార్ జిల్లాల్లోని ఆయకట్టు ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాలు బీడు పడిపోతాయని తమిళనాడు ప్రభుత్వ భయం. ఇలా ఆనకట్టను కొట్టివేయాలా? కొనసాగించాలా? అన్న విషయంలో రెండు రాష్ట్రాలు తగాదా పడుతున్నాయి. కేరళ ప్రభుత్వ ప్రయత్నాలను నిరోధిస్తూ తగిన ఆదేశాలను జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసి నిరోధిస్తే తప్ప కేరళ ప్రభుత్వం ‘మూల పెరియార్’ జలాశయాన్ని కూలగొట్టకుండా నివారించడం తమిళనాడు ప్రభుత్వానికి అసాధ్యమైన విషయం. మూల పెరియార్ జలాశయం కేరళలో ఉన్నప్పటికీ జలాశయం నిర్మాణం జరిగిన ప్రాంతం మాత్రం తమ ఆధీనంలో ఉందనేది తమిళనాడు వాదం.
1895లో ఇడుక్కి జిల్లాలో రెండు పెద్ద వాగులు-ఉపనదులు- కలిసే చోట దిగువ ప్రాంతాన ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ ప్రాంతంలోని స్థలాన్ని అప్పటి కొచ్చిన్ సంస్థానం నుండి బ్రిటిష్ వారి పాలనలో ఉండిన మదరాసు ప్రాంతం వారు అద్దె-లీజ్-కు తీసుకున్నారట. తొమ్మిది వందల తొంభయి తొమ్మిది ఏళ్ళపాటు స్థలాన్ని ‘లీజ్’కు ఇవ్వడం కూడా విచిత్రమైన అంశం. అయితే 1956లో మలబార్, తిరువాన్కూర్, కొచ్చిన్ ప్రాంతాలు కలిసిపోయి కేరళ రాష్ట్రంగా ఏర్పాటయింది. ఈ ‘పెరియార్’ ఆనకట్టపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహణాధికారం ఏర్పడివుంది. తమిళనాడులోని మదురై జిల్లాలో మరో పెరియార్ జలాశయం వెలసిన తర్వాత ఇడుక్కి జిల్లాలోని ‘పెరియార్’ను మూల- మొదటి-పెరియార్ జలాశయంగా స్థానికులు గుర్తిస్తున్నారు. ఈ ఆనకట్ట పాత పడిన దృష్ట్యా కూలిపోవడానికి సిద్ధంగా వున్నదని స్థానికులు ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 26న ఇడుక్కి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించడం ఈ భయాందోళనలను మరింత ఉధృతం చేసింది. 1970 నుంచి ఆనకట్ట ప్రాంతంలో దాదాపు 1300 సార్లు ఇలాంటి స్వల్ప భూప్రకంపనలు ఏర్పడినట్లు కేరళ రాష్ట్ర విద్యుత్ మండలి వారి పరిశోధన విభాగం వారు కనిపెట్టారట. భూప్రకంపనల గురించి భూగర్భ పరిశోధన శాస్తవ్రేత్తలు నిర్ధారించాలిగాని, విద్యుత్ విభాగం వారు కనిపెట్టడమేంటన్నది తమిళనాడు ప్రభుత్వం సంధించిన ప్రశ్న. ఈ ప్రకంపనలన్నీ‘రిచ్‌స్టార్’ ప్రాతిపదికగా నాలుగు పాయింట్లకు మించడం లేదు కనుక ఎలాంటి భయాందోళనలకు తావులేదన్నది తమిళనాడు వాదం. 1976లో ‘అతి’గా భూమి కంపించినప్పుడు కూడా ‘తీవ్రత’ స్థాయి 3.4 ‘రిచ్‌స్టార్’ పాయిట్లను దాటలేదట. భూకంపం తీవ్రతను తట్టుకొనే విధంగా దృఢంగా ఈ ఆనకట్టను బ్రిటిష్ వారు నిర్మించారని తమిళనాడు వాదిస్తోంది. శనివారం నాటి ప్రకంపనల ప్రభావం ఆనకట్ట వద్ద మాత్రమేకానీ సమీప ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించడం లేదని భూగర్భ శాస్తవ్రేత్తలు నిర్ధారించారని తమిళనాడు చెబుతోంది.
‘పెరియార్’ పేరును ప్రస్తావించకుండా ఒక పాత ఆనకట్ట తెగిపోయినప్పుడు సంభవించే భయంకర పరిణామాలను ‘డామ్ 999’ అన్న పేరుతో నిర్మాణమైన సినిమాలో చిత్రీకరించారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘పెరియార్’ వ్యతిరేక ఆందోళన మరింత ఉధృతమైంది. తమిళనాడు ప్రభు త్వం ఈ సినిమాను తమ రాష్ట్రంలో ప్రదర్శించరాదని ఆదేశించింది. ‘డామ్ 999’ చిత్రం, ఆనకట్ట తెగిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం వేలాది మంది వరదనీటిలో పడి కొట్టుకొనిపోవడం ప్రధాన ఇతివృత్తమట. ఫలితంగా ‘మూల పెరియార్’ను కూల్చివేయాలని కోరుతూ 1800 రోజులుగా జరుగుతున్న అంచెలవారీ-రిలే-నిరాహారదీక్షలకు ప్రజాదరణ పెరిగిపోయింది. కేరళ హైకోర్టులో ‘పిటిషన్లు’ దాఖలు కావడం, ‘పెరియార్’ భద్రత గురించి నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించడం ఈ ఉధృతికి అద్దం పడుతున్న మరో పరిణామం. ‘్భద్రత’ను అంచనా వేయడంకోసం కేరళ ప్రభుత్వం నియమించిన శాస్తవ్రేత్తలు పాత ఆనకట్టను తొలగించి కొత్త ఆనకట్టను నిర్మించాలని సూచించారట. అందువల్ల సొంత ఖర్చులతో కొత్త ఆనకట్టను నిర్మించడానికి కేరళ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ సమస్య తీవ్ర రూపం ధరించడంతోపాటు రాజకీయమైపోయింది కనుక, ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అతిగా స్పందించవలసి వస్తోంది. ‘మూల పెరియార్’పై తమిళనాడుకు ఎలాంటి హక్కు లేదని, జలాల్లో వాటా కూడా లేదని, కానీ మానవతా దృష్టితో దశాబ్దులుగా తమిళ రైతులకు తగినంత సేద్యపు నీటిని విడుదల చేస్తున్నామని కేరళ ప్రభుత్వం చెప్పుకొస్తోంది! ఉభయుల వాదంలోను అతిశయోక్తులు, అసత్యాలు ధ్వనిస్తున్నప్పటికీ జలాశయంలో మరిన్ని జలాలను నిల్వ చేయడానికి వీలుగా ఆనకట్ట ఎత్తును పెంచాలన్న తమిళనాడు ప్రతిపాదన అసలు పేచీకి కారణం. ప్రస్తుతం గరిష్ఠంగా 136 అడుగుల ఎత్తున జలాశయంలో నీళ్ళు నిలుస్తున్నాయట. కానీ ఆనకట్ట ఎత్తును పెంచడం ద్వారా 142 అడుగుల ఎత్తున నీరు నిలిచేవిధంగా వ్యవస్థీకృతం చేయాలని తమిళనాడు కోరుతోంది. ప్రస్తుతం నిలుస్తున్న జలాల ధాటికే ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఎత్తును పెంచమని కోరడం కేరళ ప్రజల దృష్టిలో ‘పుండు మీద కారం చల్లడం వంటిది!’ ప్రమాదం ఉన్నప్పటికీ లేనప్పటికీ పాత ఆనకట్టను తొలగించి కొత్తగా పటిష్టంగా నిర్మించడం వాంఛనీయం. అయితే ఉభయ రాష్ట్రాలవారు ఏకాభిప్రాయంతో ఈ పనికి పూనుకోవడం లేదు. మళ్ళీ కొత్తగా ఆనకట్ట నిర్మాణం జరిగే వరకు మాత్రమే పారుదలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ అంతరాయం శాశ్వతం కానుందని తమిళనాడు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

చైనా భయం!.

చైనా భయం!.December 1st, 2011
చైనా ప్రభుత్వ వ్యూహాత్మక దురాక్రమణ స్వభావానికి ఇది మరో నిదర్శనం మాత్రమే! గత మూడేళ్లలో ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్లీ మళ్లీ గిల్లడం ద్వారా మన ప్రతిక్రియ స్థాయిని, తీవ్రతను అంచనా వేయడానికి చైనా ప్రభుత్వం ఈ వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తోంది. పదిహేనవసారి జరుగవలసి ఉండిన ‘సరిహద్దు వివాదం’ చర్చలను ఏకపక్షంగా వాయిదావేయడం ద్వారా చైనా ప్రభుత్వం మన ప్రతిస్పందనకు మరో పరీక్షను పెట్టింది. చర్చలు జరిగే సమయంలోనే ఢిల్లీలో జరిగే ‘బౌద్ధమహాసభ’లో టిబెట్ ప్రజానాయకుడు ధార్మిక నేత దలైలామా ప్రసంగించడం సాకుగా చైనా ప్రభుత్వం చర్చలను వాయిదా వేసింది. ఇలా బౌద్ధ మత మహాసభను సరిహద్దు సమస్యతో ముడిపెట్టడం రుబ్బురోలును బోడిగుండుతో జత చేర్చడం వంటిది. దలైలామాను ఢిల్లీ సభలో పాల్గొనడానికి అనుమతించరాదని, అలా అనుమతించినట్టయితే సభ జరుగుతున్న సమయంలో జరిగే సరిహద్దు సంభాషణలను వాయిదా వేయవలసి వస్తుందని చైనా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు, బెదిరించలేదు. ఈ హెచ్చరికను, బెదిరింపును మన ప్రభుత్వం ఖాతరు చేయడానికి కాని చేయకపోవడానికి కాని అవకాశం ఇవ్వలేదు. హఠాత్తుగా అర్ధాంతరంగా చర్చలను వాయిదావేసిన తరువాత చైనా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ అధీనంలోని ప్రచార మాధ్యమాలవారు, మన దేశంలోని చైనా ‘మిత్రులు’ కారణాన్ని కనిపెట్టారు. దలైలామా ఢిల్లీకి వస్తున్నాడు కాబట్టి చర్చలు జరగరాదట. ఉభయ ప్రభుత్వాల ప్రత్యేక ప్రతినిధులు చర్చలు జరిపే ప్రాంగణంలోకి టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులు దూసుకొని వచ్చి ‘రక్తపాతాన్ని’ లేదా ‘బీభత్సకాండ’ను సృష్టించగలరన్నట్టు చైనా ప్రభుత్వ ప్రతినిధులు భయాందోళనలను అభినయించడం మన దేశాన్ని ఒకవైపు, టిబెట్ ఉద్యమకారులను మరో వైపు అంతర్జాతీయంగా అప్రతిష్ఠపాలు చేయడంలో భాగం. టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులు మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని వంద దేశాలలో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా దశాబ్దుల తరబడి నిరసన ప్రదర్శనలను జరుపుతూనే ఉన్నారు. 1959 నుండి తమ దేశాన్ని దురాక్రమించుకొని ఉన్న చైనా నుండి తమ దేశానికి విముక్తిని కల్పించడమే ఈ ప్రవాస టిబెట్ ప్రజల లక్ష్యం. కానీ ఈ ఉద్యమం నిరంతరం సంపూర్ణ అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్య రీతిలో కొనసాగుతోంది. అందువల్ల ఢిల్లీ చర్చల సందర్భంగా తమ ప్రతినిధిని కాని తమ దేశానికి చెందిన ఇతరులను కాని టిబెట్ ఉద్యమవాదులు కొట్టి గాయపరుస్తారని చైనా ప్రభుత్వం భయపడవలసిన పని లేదు. అంతేకాక బౌద్ధమత సదస్సు కేవలం టిబెట్ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు. అనేక దేశాలలో బౌద్ధులు జీవిస్తున్నారు, బౌద్ధమతం ఉంది. ఇలా బౌద్ధ సదస్సుకు, టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమంతోను, ఈ రెండింటినీ, సరిహద్దు చర్చలతోను ముడిపెట్టడం మన ప్రతిస్పందనకు మాటిమాటికీ పరీక్ష పెట్టే చైనా వ్యూహంలో భాగం మాత్రమే!
తమ మనోభావాలను గ్రహించి దలైలామాను ఢిల్లీ సదస్సుకు దూరంగా ఉంచుతుందని చైనా పాలకులు భావించడం దురహంకార దురాక్రమణ ప్రవృత్తికి నిదర్శనం. వివిధ వర్ధమాన దేశాలను పరోక్షంగా, ప్రత్యక్షంగా బెదిరించడం ద్వారా దలైలామా ఆయా దేశాలలో అడుగుపెట్టకుండా చైనా కమ్యూనిస్టు నియంతలు నిరోధించగలగడం నడుస్తున్న చరిత్ర. చివరికి ప్రజాస్వామ్య రష్యా ప్రభుత్వం సైతం చైనా అనుకూల దౌత్య రాగాలాపనకు దిగజారడం ఇటీవలి పరిణామం. ఐరోపాలోని కొన్ని దేశాలు, అమెరికా తప్ప మిగిలిన అనేక దేశాలు చైనాకు భయపడి దలైలామాను తమ దేశాలకు ఆహ్వానించడం లేదు. ‘మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి సామరస్య పురస్కారాన్ని’ స్వీకరించడంకోసం గత అక్టోబర్‌లో దలైలామా దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవలసి ఉండినది. కానీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆయనకు ఆయన బృందంలోని సభ్యులకు ప్రవేశ అనుమతి పత్రం- వీసా జారీచేయడానికి నిరాకరించింది. అందువల్ల దలైలామా తను పర్యటనను రద్దుచేసుకోవలసి వచ్చింది. దలైలామాను ప్రభుత్వ అధినేతలు కలుసుకొన్నప్పుడల్లా చైనా ప్రభుత్వం తీవ్ర స్వరంతో నిరసిస్తూనే ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాయ్ సర్కోజీ 2008లో దలైలామాను పోలెండులో కలుసుకున్నాడు. ఆ తరువాత 2009లో తమ దేశానికి పిలిపించి, చర్చలు జరిపాడు. ఈ రెండు సందర్భాలలోను చైనా ప్రభుత్వం ఫ్రాన్స్ అధ్యక్షుడిని తీవ్రమైన పదజాలంతో నిందించింది, ఫ్రాన్స్‌తో దాదాపు తెగతెంపులు చేసుకొంది. అందువల్ల ఆసియా ఆఫ్రికా దేశాలు క్రమంగా దలైలామాను దూరంగా ఉంచుతున్నాయి. బౌద్ధ సదస్సు ఉభయ దేశాల సరిహద్దు సమస్యతో ఎలాంటి సంబంధం లేని విషయం కనుక మన ప్రభుత్వానికి చైనా బెదిరింపు ధ్యాస కూడా కలగలేదు. సరిహద్దు చర్చలు, ఢిల్లీలో బౌద్ధుల సమావేశం ఒకే సమయంలో ఏర్పాటుకావడం కాకతాళీయమైన పరిణామమన్న మన ప్రభుత్వ వాదాన్ని చైనా తోసిపుచ్చుతోంది. పనిగట్టుకొని మన ప్రభుత్వం ఈ రెండింటినీ ఒకేసారి ఏర్పాటుచేయించినట్టు చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఉభయ దేశాల మధ్య వివాదాస్పదమై ఉన్న సరిహద్దు ప్రాంతాలు మన దలైలామా నోట చెప్పించడమే ఈ ‘ఏర్పాటు’లోని మన ప్రభు త్వ లక్ష్యమని చైనా ఆరోపించింది.
దలైలామాను ఢిల్లీ సదస్సులో ప్రసంగించడానికి అనుమతి ఇచ్చినట్టయితే ‘‘ఏదో జరిగిపోతుందని’’ బెదిరించింది. ఈ బెదిరింపును మన ప్రభుత్వం ఖాతరుచేయదని చైనా పాలకులకు తెలుసు. ఇలా ‘ఖాతరు’ చేయడం ఆరంభించినట్టయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల నుండి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని తొలగించమని కోరే స్థాయికి చైనా తెగబడగలదు. సరిహద్దు వివాదం పరిష్కారం కావడం చైనా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే, ఈ వివాదం పరిష్కారం అయితే లడక్‌లో ఆక్రమించిన మన భూమిని చైనా ప్రభుత్వం మన దేశానికి అప్పగించవలసి వస్తుంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని అధిక భాగం తమదన్న మొండి వాదాన్ని విడనాడవలసి వస్తుంది. అందువల్ల 1990వ దశకం నుండీ కూడ మనతో చర్చలు జరుపుతున్నప్పటికీ చైనా ప్రభుత్వం సరిహద్దు వివాదాన్ని నిరవధికంగా సాగతీస్తూనే ఉంది. ఇలా సాగదీయడానికి ఏ కుంటిసాకు దొరికినా చాలు మరి! ఇప్పుడు దొరికిన అవకాశం ఢిల్లీ బౌద్ధ సమావేశం. ఢిల్లీ సమావేశంలో దలైలామా ధార్మిక ప్రసంగం చేసిన వెంటనే టిబెట్ తమ దేశంనుండి విముక్తమైపోతుందన్న స్థాయిలో చైనా ప్రభుత్వం ఎందుకని ఆర్భాటం చేస్తోంది? డెబ్బయి ఆరేళ్ల దలైలామా నిజానికి ఇప్పుడు టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నారు. తమ దేశానికి స్వాతంత్య్రం అక్కరలేదని, చైనాలో ‘సాంస్కృతిక ప్రతిపత్తి’ కలిగిన ఒక రాష్ట్రంగా టిబెట్ కొనసాగడమే తమ అభిమతమని దలైలామా గత ఆరేళ్లుగా పదే పదే ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటన ద్వారా దలైలామా చైనా భక్తిని ప్రదర్శించినట్టయింది. ఫలితంగా ఆయన ప్రధాన ఉద్యమ స్రవంతి నుండి విడిపోయాడు. దలైలామాతో నిమిత్తం లేకుండా టిబెట్ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమం దేశ విదేశాలలో రాజుకుంటుండడం వర్తమాన వాస్తవం. బీజింగ్ ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా వివిధ దేశాలలో వేలాది ఉద్యమకారులు స్వాతంత్య్ర నినాదాలు చేయడం చైనా ప్రభుత్వానికి విస్మయం కలిగించిన పరిణామం. ఈ పరిణామక్రమాన్ని గుర్తించడానికి మాత్రం చైనా ప్రభుత్వం సిద్ధంగాలేదు. అందువల్లనే, సమస్య కాని దలైలామాను అతి ప్రధాన సమస్యగా చిత్రీకరించడం ద్వారా చైనా ప్రభుత్వం అసలు సమస్య కప్పిపుచ్చడానికి యత్నిస్తోంది, ప్రపంచ సమాజం దృష్టిని మళ్లించడానికి కృషిచేస్తోంది. అసలు సమస్య దలైలామా కాదు... దలైలామాతో సంబంధం లేకుండా రాజుకుంటున్న టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమం చిరుమంటలు మహాజ్వాలలుగా మారవచ్చునన్న భయం చైనా నియంతల ‘చిందుల’కు అసలు కారణం!

8, డిసెంబర్ 2011, గురువారం

దీదీ దయ!.

December 5th, 2011
దేశ ప్రయోజనాలను లెక్కచేయని ప్రభుత్వ నిర్వాహకులు రాజకీయ అనివార్య పరిణామాల ముందు తలవంచక తప్పడంలేదు. ఈ వాస్తవ వైచిత్రికి మరో నిదర్శనం ‘చిల్లర’ పెట్టుబడులపై కొనసాగుతున్న వివాదం. చిల్లర వ్యాపార రంగంలో విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చునన్న నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్న లేదని వారం రోజులపాటు భీష్మించుకున్న కేంద్ర ప్రభుత్వం బెట్టు సడలించడానికి ఏకైక కారణం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింతగా మొండికెత్తడం! చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్య- ఎఫ్‌డిఐ- ప్రతిపాదనను ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంటుందా? లేక తాత్కాలికంగా వాయిదా వేసుకుంటుందా? అన్నది బుధవారం కానీ స్పష్టం కాదట. పార్లమెంటు సభలలో ఆరోజున ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నది ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన సరికొత్త సమాచారం. అయినప్పకికీ ప్రస్తుతానికి మన చిల్లర వ్యాపారులు, కిరాణం కొట్టువారు, బడ్డీ కొట్టువారు, నెత్తిగంపల సంచార వర్తకులు, బండ్లను తోసుకునే వీధి వ్యాపారులు ‘వాల్ మార్ట్’ వంటి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలతో పోటీ పడనవసరం లేదు. ఈ ‘అవసరం’ తప్పించిన ఘనత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది! ప్రతిపక్షం సాధించలేని పనిని ‘ఐక్య ప్రగతిశీల కూటమి’లోని భాగసామ్య పక్షాలు సాధించగలిగాయి. భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి వారు ఇతర ప్రతి పక్షాల వారు ఐదు రోజుల పాటు పార్లమెంటును స్తంభింప చేసినప్పటికీ ప్రభు త్వం స్పందించలేదు. చిల్లర వ్యాపారుల జాతీయ సంఘాల వారు జరిపిన నిరసన ప్రదర్శనల నినాదాలు ప్రభుత్వం వారికి వినిపించలేదు. కానీ మమతా బెనర్జీ నడుం బిగించి ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా నినదించేసరికి ప్రధాని మన్మోహన్ సింగ్ మెట్టు దిగక తప్పలేదు. వాయిదా తీర్మానంపై లోక్‌సభలో ‘వోటింగ్’ జరిగే పక్షంలో తృణమూల్ సభ్యులు సహకరించకపోతే మన్మోహన్ సర్కార్ కూలిపోవడం ఖాయం! తృణమూల్‌కు తోడుగా డిఎంకె కూడా ‘ఎఫ్‌డిఐ’పై వ్యతిరేకతను ప్రకటించడం మన్‌మోహన్‌సింగ్ ఊహించని పరిణామం. సిద్ధాంతపరంగా కాక కుమార్తె కనిమోళికి కలిగిన ‘కష్టాల’ ప్రాతిపదికగా డిఎంకె అధినేత కరుణానిథి మన్‌మోహన్‌పై కినుక వహించి ఉన్నాడు మరి! సిద్ధాంతం రంగు పూనడానికి ఈ అవకాశం డిఎంకె నాయకుడికి కలిసివచ్చింది. ఈ ‘వ్యూహం’ ఇలా బెడిసికొట్టడానికి కారణం జాతీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవాలన్న మమతా బెనర్జీ పట్టుదల. ప్రత్యేక ఆర్థిక మండలులకు వ్యతిరేకంగా ‘బెంగాల్ దీదీ’ నడిపిన ఉద్యమం వల్ల బలవంతపు భూమి సేకరణ ప్రక్రియ వేగం కూడా తగ్గింది. రైతులకు భూమిపై అధారపడే హక్కుకు ప్రత్యామ్నాయ ఉపాధి పునరావాసాన్ని కల్పించిన తర్వాత మాత్రమే వ్యవసాయ భూమిని ప్రభుత్వాలు సేకరించాలన్న కొత్త నిబంధన రూపొందుతుండానికి కారణం. మమతా బెనర్జీ ‘ఐక్య ప్రగతి’ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి! బంగ్లాదేశ్‌కు తీస్తానది జలాలలో అధిక భాగం ధారదత్తం చేసే ఒప్పందాన్ని గత సెప్టెంబర్‌లో నిరోధించిన మమతమ్మ ఇప్పుడిలా చిల్లర వ్యాపారులను ఆదుకోగలిగింది! స్వదేశీయ ఆర్థిక వ్యవస్థకు, వికేంద్రీకృత వాణిజ్యానికి ఇది మరో విజయం!
అబద్ధాలు రాసి దిద్దుకొనడం అంటే ఇదే కాబోలు. అంతర్జాతీయ అనుసంధానం పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ అధికార పక్షాలతో మాత్రమే కాదు, కాంగ్రెస్ వారితో సైతం ‘ఎఫ్‌డిఐ’ విషయమై చర్చించలేదన్నది ఇప్పుడు స్పష్టం. ‘తప్పుల కుప్ప’ను ఆవిష్కరించానని వాణిజ్య మంత్రి ఆనంద్‌శర్మ, ఆహార మంత్రి కె.వి. థామస్ గత నెల 24, 25 తేదీల్లో చేసిన హడావుడి అంతాఇంతా కాదు.తప్పులను సరిదిద్దుకోవలసి వచ్చేసరికి మన్‌మోహన్‌సింగ్ వారిని తప్పించి ‘యథావిథిగా’ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని పురమాయించవలసి వచ్చింది. మమతా బెనర్జీ అడ్డుపడక పోయి వుండినట్లయితే ‘చిల్లర ఎఫ్‌డిఐ’ వల్ల కోటి ఉద్యోగాలు కొలువు తీరుతాయని ప్రచార ఆర్భాటాన్ని ఆనందశర్మ బహుశా ఆపి వుండే వారు కాదు. చిల్లర వ్యాపారాన్ని, విదేశీయ ‘బహుళ’ సంస్థలకు అప్పగించం వల్ల ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని, ‘రిజర్వ్ బ్యాంకు’ నిర్వాహకులు చేసిన సిద్ధాంతం కూడా ఇప్పుడు కేవలం రాద్ధాంతంగా మిగిలి పోనుంది. నిర్ణయం ప్రకటించిన తరువాత వివిధ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధన గురించి ప్రభుత్వం ప్రసంగిస్తోంది. ఈ ఏకాభిప్రాయ సాధనకోసం ముఖర్జీ కృషి చేస్తున్నారట! నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎందుకని ‘ఏకాభిప్రాయ సాధన’కు ప్రయత్నించలేదు? అంతే కాదు, రాజ్యాంగ పరమైన తప్పులకు కూడా పాల్పడినట్టు అంగీకరించట్టయింది. ‘పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల విధాన నిర్ణయాలను సభల వేదికల మీది నుంచి మాత్రమే ప్రకటించాలి,’ అన్న రాజ్యాంగ సంప్రదాయాన్ని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉటంకించారు. మరి ఈ మహావిషయం ప్రభుత్వానికి ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చింది? గత నెల 24వ తేదీన ఈ ‘సంప్రదాయ స్ఫురణ’ ఎందుకని కలుగలేదు? ఆ రోజున మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఆహార మంత్రి హడావుడిగా బయటకు వచ్చి ‘‘చిల్లర వ్యాపారంలో ‘ఎఫ్‌డిఐ’ని అనుమతిస్తున్నాం’’ అని ప్రకటించారు. మరుసటి ఉదయం పార్లమెంట్ సమావేశం వరకు ఎందుకు ఆగలేదు??
ఆర్థిక స్వాంతంత్య్రాన్ని హరించి వేసే సమయంలో ‘చిల్లర’ దోపిడీ ఒక ప్రధాన అంశం. దేశం ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రక్రియ 1990వ దశకం మొదలైన వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-తో మొదలయింది. ‘వాణిజ్య’ సుంకాల సాధారణ వ్యవస్థ’-గాట్-లో మన దేశం ప్రవేశించిన నాడే ఆరంభమయింది. ‘గాట్’ ఆతరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’రూపం ధరించే నాటికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వలలో మన వాణిజ్య వ్యవసాయ రంగాలు చిక్కుకు పోయాయి. ‘వల’ బిగుస్తున్న కొద్దీ గిల గిల మంటున్న దృశ్యాలు ఆవిష్కృతవౌతున్నాయి.కానీ వినిపించుకోని ‘బధిరాంధ’ ప్రవృత్తి ప్రభుత్వాలను ఆవహించి వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభించిన ఘనకార్యాన్ని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆతరువాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం నడిచిపోతున్న విధాన వైపరీత్యం. నమూనాల-పేటెంట్ల- చట్టాన్ని ‘ప్రజాస్వామ్య జాతీయ కూటమి’ -ఎన్‌డిఎ- ప్రభుత్వం రూపొందించకపోయివుండినట్టయితే ప్రపంచీకరణ, మనదేశంలో వ్యవస్థీకృతం అయివుండేది కాదు! బీమా రంగంలో విదేశీయ సంస్థలను ‘్భజపా’ దొరతనం తలుపులు బార్లా తెరిస్తే రక్షణ రంగాన్ని ‘బహుళ’ సంస్థలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెత్తనం నడుం బిగించింది. చిల్లర వ్యాపారం రాక సంస్థాగత అనుసంధాన భాగస్వామ్యం -ఎఫ్‌డిఐ- ద్వారా విదేశీయ వ్యాపార వేత్తలు ఇదివరకే చొరబడిన సంగతి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు తెలుసు. ‘ప్రత్యక్ష భాగస్వామ్యం’ గురించి కూడా రెండేళ్ళుగా చర్చ నడుస్తున్నది. అలాంటప్పుడు ప్రతిపక్షాలవారు, దేశవ్యాప్తంగా ఎందుకని ఉద్యమం ఆరంభించలేదు?బెంగాల్ ‘దీదీ’ దడ పుట్టించింది కాబట్టి సరిపోయింది. లేనట్టయితే

1, డిసెంబర్ 2011, గురువారం

ఆర్భాటపు ‘విముక్తి’!

రెండవతరం టెలికాం తరంగాల-2జి స్పెక్ట్రమ్- కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో నిందితురాలు కనిమోళికి బెయిల్ లభించడం ఆశ్చర్యం కాదు. విచారణలో ఉన్న నిందితుల ‘నిర్బంధం’ గురించి ఈనెల 23వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీఎస్ సింఘ్వీ, హెచ్‌ఎల్ దత్తు చేసిన సుదీర్ఘ వ్యాఖ్యానం గురించి విన్న వారందరికీ కనిమోళికి అతి త్వరలో ‘బెయిల్’ లభించడం ఖాయమనే భావన కలిగింది. విచారణకు గురవుతున్న నిందితులను ‘బెయిల్’పై జైలునుంచి విడుదల చేయడమే వ్యవస్థీకృతమై ఉన్న న్యాయ నిబంధన అనీ, నిర్బంధం లోనే నిందితులను కొనసాగించడం ఈ నిబంధనకు అపవాదం మాత్రమేనని సర్వోన్నత న్యాయమూర్తులు స్పష్టం చేయడం ఈ కేసుకు సంబంధించిన కొత్త మార్గదర్శక సూత్రంగా మారింది. అందువల్ల ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు, కనిమోళిని మరో నలుగురిని ‘బెయిల్’పై విడుదల చేయాలని ఆదేశించడం ఊహించని పరిణామం కానేకాదు. సుప్రీంకోర్టువారి మార్గదర్శక సూత్రం వల్ల ప్రయోజనం పొందగలిగిన మొదటి నిందితురాలు బహుశా కనిమోళి! ఆమెతోపాటు ఆమె వాణిజ్య సహచరుడు కలైంగర్ టెలివిజన్ నిర్వాహకుడు- మేనేజింగ్ డైరెక్టర్-శరద్ కుమార్‌కు మరో ముగ్గురికి కూడా తాత్కాలిక బంధ విముక్తి కలగడానికి కారణం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిందితుల అనవసర నిర్బంధం గురించి చేసిన వ్యాఖ్యలే కారణం కావచ్చు. కేసుకు సంబంధించిన నేరం గురించి పోలీసులు లేదా ‘సిబిఐ’ వంటి ప్రత్యేక పరిశోధన బృందాల వారు దర్యాప్తును జరుపుతున్న సమయంలో నిందితులను న్యాయ నిర్బంధంలో ఉంచడం పరిపాటి. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఘరానా నిందితులు బయట స్వేచ్ఛగా ఉన్నట్టయితే వారు దర్యాప్తు ప్రక్రియను నిరోధించవచ్చునని లేదా సాక్షులను ప్రభావితం చేయవచ్చునని, ప్రలోభ పెట్టవచ్చునని, భయపెట్టవచ్చునని ‘ప్రాసిక్యూషన్’ వారు వాదించడం కూడా న్యాయ సంప్రదాయమైపోయింది. కానీ దర్యాప్తు పూర్తయిన తర్వాత, ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా న్యాయస్థానంలో నిందితులకు వ్యతిరేకంగా ‘అభియోగ పత్రం’ దాఖలయిన తరువాత వారిని నిర్బంధం నుంచి విడుదల చేయడమే న్యాయమని సుప్రీంకోర్టు నిగ్గు తేల్చింది. ఈనెల 23వ తేదీన విడుదలయిన ఐదుమంది ఘరానా కార్పొరేట్ నిందితులకు వ్యతిరేకంగా కూడా చార్జిషీటు దాఖలైపోయింది. కానీ ఆతరువాత కూడా కింది న్యాయస్థానాలు వారిని బెయిల్‌పై విడుదల చేయలేదు. నిందితులందరూ దేశాన్ని కుదిపేసిన లక్షాడెబ్బయి ఆరువేల కోట్ల రూపాయల కుంభకోణం కేసునకు సంబంధించిన వారైనందున, ప్రత్యేక పరిస్థితుల ప్రాతిపదికగా వారిని విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధంలో వుంచడమే సమంజసమని ప్రత్యేక న్యాయస్థానం భావించివుండవచ్చు.
‘డైనమిక్స్ రియాల్టీ’ అనే వాణిజ్య సంస్థ ‘కలైంగర్’ టెలివిజన్ సంస్థకు బదిలీ చేసిన రెండువందలకోట్ల రూపాయల గుట్టు రట్టు కావడం గత మేనెలలో కనిమోళి అరెస్టు కావడానికి దారితీసిన పరిణామం. కనిమోళి ‘ద్రవిడ మునే్నట్ర కజగం’ పార్టీలో ప్రముఖ నాయకురాలు మాత్రమే కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కూడా కావడం వల్ల ఆమె అరెస్టు గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఈ సంచలన ప్రభంజనం ఇప్పటికీ ప్రసార మాధ్యమాలను ముంచెత్తుతుండడం సమస్యకు కాక వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే దుష్ట సంప్రదాయానికి మరో ప్రత్యక్ష సాక్ష్యం. కలైంగర్ టెలివిజన్ సంస్థలో ప్రధాన భాగస్వామి కనిమోళి. కానీ తనకు తెలియకుండానే తమ సంస్థకు అక్రమంగా రెండువందలకోట్ల రూపాయలు లభించినట్టు కనిమోళి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ‘డైనమిక్స్ రియాల్టీ’ వారు ‘కలైంగార్’కు పంచిన సొమ్ములో తనకు ఎటువంటి వాటా లేదన్నది కనిమోళి వాదనలోని సారాంశం. ఎ.రాజా మంత్రిగా వుండి నిర్వహించినట్టు ఆరోపితమవుతున్న ‘టెలికాం’ కుంభకోణంలో ‘డైనమిక్స్ రియాల్టీ’ సంస్థకు కూడ భాగస్వామ్యం వుంది. టెలికాం తరంగాల కేటాయింపులలో రాజా ఈ సంస్థకు భారీగా అక్రమ ప్రయోజనం కలిగించాడని, అలా మూటకట్టుకున్న వేలాది కోట్ల రూపాయల పాపపు సొమ్ములో ‘డైనమిక్స్ రియాల్టీ’వారు డిఎంకె వారికి వాటాలు పంచారని ప్రముఖంగా ప్రచారమైంది. విచారణ పూర్తయతే కాని ఈ ఆరోపణల నిగ్గు తేలదు. కానీ ఈ కేసులో ఆరోపణలు మొదలయినప్పటి నుంచీ ఇప్పటి వరకు కూడా కనిమోళి తాను నిర్దోషినన్న భావం కలిగించేందుకు విచిత్ర అభినయ విన్యాసాలను చేస్తూనే వుంది. తాను మహిళ కాబట్టి తనను సిబిఐ వారు అరెస్టు చేసిన వెంటనే వదలి పెట్టే విధంగా ముందస్తు ‘బెయిలు’ మంజూరు చేయాలని ఆమె గత మే నెలలోనే వాదించింది. ముందస్తు ‘బెయిల్’ మంజూరు కాకపోవడం వేరే సంగతి. కానీ జైల్లో ఉంటూ ‘బెయిల్’ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ కూడ కనిమోళి మహిళా వాదానే్న వినిపించి మహిళలకు తలవంపులు తెచ్చింది. తాను నిర్దోషిని కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధ విముక్తి కలిగించాలని కోరడం వేరు. కానీ తాను గృహిణి కాబట్టి, బడికి వెళ్ళే పిల్లలున్నారు కాబట్టి, తాను లేకపోతే ఇంటిలో ఎవరూ వంట చేయరు కాబట్టి..అంటూ అనర్హమైన సానుభూతిని సంపాదించడానికి ఒక రాజ్యసభ సభ్యురాలు యత్నించడం న్యాయప్రక్రియను తప్పుదారి పట్టించడంలో భాగం.
కనిమోళికి లభించింది తాత్కాలిక నిర్బంధ విముక్తి మాత్రమే. కానీ ఆమె నిర్దోషిగా బయట పడిందన్న అభిప్రాయం కలిగేలా ‘అభిమానులు’ ఆర్భాటం చేస్తున్నారు. దృశ్యమాధ్యమాలవారు చేస్తున్న హడావుడి ఈ ఆర్భాటానికి మరింత ప్రచారాన్ని సమకూర్చి పెడుతోంది. డిఎంకెవారు ఆనందోత్సాహాలతో విజయోత్సవాలనే జరిపేస్తున్నారు. 1996లో జరిగిన మరో టెలికాం కుంభకోణంలో దోషిగా ధ్రువపడిన మాజీ కేంద్ర మంత్రి, సుఖ్‌రామ్‌కు కూడా ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. కానీ కనిమోళి ‘విడుదల’కు జరిగిన ఆర్భాటంలో సహస్రాంశం కూడా సుఖ్‌రామ్ విషయంలో జరగడంలేదు. ఇప్పుడు మాత్రమే కాదు, ఆమెపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా కనిమోళిని ప్రజాదరణ కలిగిన కథానాయికగా చిత్రీకరించడానికి తెరముందు తెరవెనుక జరుగుతున్న తతంగం న్యాయప్రక్రియను, ప్రజాస్వామ్యవ్యవస్థను వెక్కిరిస్తూనే వుంది. చార్జ్‌షీటు దాఖలు కాకముందే ఏ. రాజాను అరెస్ట్ చేసిన సిబిఐ వారు, ఏప్రిల్‌లో కనిమోళికి వ్యతిరేకంగా చార్జ్‌షీటు దాఖలయిన తరువాత దాదాపు మూడు వారాల వరకు అరెస్టు చేయలేదు. చార్జిషీటు దాఖలు కావడానికి ముందే ‘ప్రథమ ఫిర్యాదు పత్రం’- ఎఫ్‌ఐఆర్-ఆధారంగా నిందితులను అరెస్టు చేయడం సర్వసాధారణం. కానీ ఈ స్ఫూర్తికి విరుద్ధంగా సిబిఐ వ్యవహరించింది. అంతేకాదు, గత రెండు నెలలుగా‘సిబిఐ’ వారు కనిమోళికి ‘బెయిల్’ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని న్యాయస్థానాలకు నివేదించడం మరో విచిత్రం. ఈ కేసులోని ఇతర నిందితులకు ఒక సూత్రాన్ని, కనిమోళి విషయంలో మరో సూత్రాన్ని పాటించడం సిబిఐని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్వాహకుల ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసింది. కనిమోళికి బెయిల్ లభించడం టెలికాం కుంభకోణంలో ప్రధాన అంశం కాదు. నేరస్థులు ఎవరో న్యాయప్రక్రియ ద్వారాగానీ నిగ్గుతేలడం దేశప్రజల అభీష్టం.

ఆహార స్వప్నం!

ఆహార భద్రత గురించి అవగాహన పెంపొందించడానికి వీలుగా, ముసాయిదా బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం సరికొత్త అయోమయం నెలకొనడానికి దోహదం చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరన్న అంశంపై అనేక నెలలపాటు ప్రణాళికా సంఘంవారు సృష్టించిన గందరగోళం సమసిపోతున్న నేపథ్యంలో సరి కొత్త సందేహాలకు ముసాయిదా బిల్లు దోహదం చేస్తోంది. ఈ సందేహాలకు ప్రభుత్వంవారు చెబుతున్న సమాధానాలు స్పష్టంగా లేవు. ‘నగదు బదిలీ’ విధానం ‘ఆహార భద్రత వ్యవస్థ’లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. కానీ ఈ పథకం ఎలా అమలు జరుపుతారన్న విషయమై ప్రభుత్వంవద్ద స్పష్టమైన సమాచారం లేదు. లబ్దిదారులకు నగదును బ్యాంకుల ద్వారా చెల్లిస్తారని వారు స్వేచ్ఛా విపణిలో ఆహార వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చునని విశే్లషణలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఖాతానుండి నగదు బదిలీ అవుతుందట. అయితే ఆహార భద్రత ‘చట్టం’ కింద అర్హులైన వారందరికీ ఇలా నగదు బదిలీ చేస్తారా? లేక కొందరికి మాత్రమే బదిలీ చేసి మరికొందరికి ప్రభుత్వం వారి పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు బియ్యం, గోధుమలను విక్రయిస్తారా అన్నది స్పష్టం కావలసి ఉంది. లాభోక్తులందరికీ ఖాతాలలోకి నగదును బదిలీ చేసినట్టయితే, వారు తమకు నచ్చినచోట పప్పులు బియ్యం గోధుమలు నూనెలు వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం వారి చౌక దుకాణాలకు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యం మాత్రమేకాదు పని కూడా లేకుండాపోతుంది. ప్రభుత్వం రైతుల నుంచి మిల్లర్లనుంచి సేకరించిన ఆహార ధాన్యాలను, ఆహార ఉత్పత్తులను స్వేచ్ఛా విపణిలో మాత్రమే విక్రయించవలసి వస్తుంది. నగదు బదిలీ పథకం వల్ల స్వేచ్ఛా విపణి వీధులలో ఆహార వస్తువుల ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతుండడానికి ఇదీ ప్రాతిపదిక. నగదు బదిలీ పథకం సమగ్రంగా లోపరహితంగా అమలు జరిగినట్టయితే క్రమంగా ప్రభుత్వం ధాన్యం, ఆహార ఉత్పత్తులను సేకరించవలసిన అవసరమే ఉండదన్న వాదాన్ని సైతం అనేకమంది సామాజిక ఉద్యమకారులు వినిపిస్తున్నారు. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులను కేవలం స్వేచ్ఛా వాణిజ్య నిర్వాహకులకు అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం నిర్ణయంచే గిట్టుబాటు ధరలతో నిమిత్తం లేకుండా, వ్యాపారులు కారుచౌకగా రైతులనుండి వారి ఉత్పత్తులను కాజేయడానికి మార్గం మరింత సులభం అవుతుంది. అందువల్ల ‘నగదు బదిలీ’ ద్వారా కాక ప్రభుత్వ దుకాణాల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయడంవల్ల మాత్రమే అటు నిరుపేదలకు ఇటు వ్యవసాయదారులకు భద్రత ఏర్పడుతుందన్న వాదం బలం పుంజుకొంటోంది. ‘ఆహార భద్రత’ బిల్లులో పొందుపరచిన మరో అంశం ‘్ఫడ్ కూపన్స్’. ఈ ‘ఆహారం చీటీ’లు జారీచేసే పద్ధతి ఏమిటో అంతుపట్టడం లేదు. లాభోక్తులందరికీ ఈ ‘కూపన్లు’ ఇస్తారా? కొందరికి కూపన్లనిచ్చి, కొందరికి నగదు బదిలీ చేస్తారా? మరి కొందరికి చౌక దుకాణాల ద్వారా ఆహారం పంపిణీ చేస్తారా? ప్రస్తుత సమావేశాలలోనే ‘ఆహార భద్రత’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ‘బిల్లు’ తుది రూపం ఇంతవరకూ స్పష్టంకాకపోవడమే విచిత్రం!
2009నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ ప్రభుత్వ పక్షాలు చేసిన వాగ్దానాలలో ‘ఆహార భద్రత’ అతి ప్రధానమైనది. కానీ ‘కూటమి’ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటుచేసి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఇంతవరకూ ఈ ‘్భద్రత’ వాస్తవం రూపం దాల్చకపోవడానికి కారణం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఎవరన్న అంశంపై ప్రణాళిక సంఘంవారు సృష్టించిన గందరగోళం. ఈ విషయమై ప్రణాళిక సంఘంవారు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రమాణ పత్రం గత నెలలో పెద్ద దుమారాన్ని రేపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని నిర్ధారించడంలో ప్రణాళికా సంఘానికీ, ప్రభుత్వ ఆర్థిక సలహా మండలికి, జాతీయ సలహా మండలికి మధ్య రెండేళ్ళుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు ప్రభుత్వ సంస్థల మధ్య విభేదాలు కొనసాగడం, లోక్‌సభ ఎన్నికల సమయం వరకూ ‘ఆహార భద్రత’ బిల్లును వాయిదావేసే ప్రక్రియలో భాగమన్న ఆరోపణలు కూడ వినవస్తున్నాయి. పట్టణ ప్రాంతంలో నెలకు రు.4,824ల కంటె తక్కువ ఖర్చుచేస్తున్న కుటుంబాలవారు, గ్రామీణ ప్రాంతంలో నెలకు రు.3,905ల కంటె తక్కువ ఖర్చుపెడుతున్న కుటుంబాలవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టుగా భావించాలన్నది ప్రణాళికా సంఘంవారు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రమాణ పత్రంలోని ప్రధాన అంశం. కుటుంబంలో సగటున ఐదు మంది ఉంటారన్నది ప్రణాళికా సంఘంవారి నిర్ధారణ. అందువల్ల సగటున ప్రతి దినం గ్రామీణ ప్రాంతాలలో ఇరవై రూపాయల కంటె తక్కువ ఖర్చుచేసేవారు పట్టణాలలో ముప్పయిరెండు రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు ప్రణాళికా సంఘంవారు సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇలా ముప్పయిరెండు రూపాయల కంటె, ఇరవై రూపాయల కంటె తక్కువ ఖర్చుపెట్టేవారు మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు నిర్ధారించడం వివాదగ్రస్తమైపోయింది. పైగా ఆదాయాన్నిబట్టి కాక ఖర్చునుబట్టి నిరుపేదలను గుర్తించడం కూడా విచిత్రమైన ప్రహసనం.
ఇదంతా పథకం ప్రకారం పాలకులు జరుపుతున్న కాలయాపనలో భాగమన్న వాస్తవం సామాన్యులకు సైతం అర్థమయిపోయింది. విమర్శలను తిప్పికొట్టడానికి వీలుగా ప్రణాళికా సంఘంవారు, కేంద్ర ప్రభుత్వంవారు సరికొత్త ప్రతిపాదనను ప్రచారం చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారా లేక పైన ఉన్నారా అన్న దానితో నిమిత్తం లేదట. అవసరమైన వారందరికీ చౌక ధరలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడమే ‘్భద్రత’ పథకం లక్ష్యమన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు అవసరమైన వారిని గుర్తించే కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోందట. ‘సబ్సిడీ’పై ఆహార ధాన్యాలను పొందగల ‘అవసరమైన’ కుటుంబాలవారు గ్రామాలలో డెబ్బయి ఐదు శాతం మంది పట్టణాలలో యాభయి శాతం మంది ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారించింది. ‘దారిద్య్ర రేఖ’ ప్రాతిపదికన కానప్పుడు ‘అవసరమైన’ లబ్దిదారులను ఏ ‘ప్రాతిపదిక’పై గుర్తించారన్నది కూడ సమాధానం లభించని ప్రశ్న. అంతేకాదు, గ్రామాలలోని ఈ డెబ్బయి ఐదు శాతం కుటుంబాలలో మళ్లీ నలబయి ఆరు శాతాన్ని ‘ప్రాధాన్యం’కల కుటుంబాలుగా నిర్ధారిస్తారట. అలాగే పట్టణ ప్రాంతాలలోని యాభయి శాతం ‘‘అవసరమైన’’ కుటుంబాల నుంచి ఇరవై ఎనిమిది శాతాన్ని ‘‘ప్రాధాన్యం’’కల కుటుంబాలుగా ఎంపిక చేయనున్నారట. ఈ ‘‘ప్రాధాన్యం’’ నిర్ణయించడానికి ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం చెప్పవలసి ఉంది. ‘‘అవసరమైన’’ కుటుంబాలకు, ‘‘ప్రాధాన్యం’’ కల కుటుంబాలకు లభించే ‘ఆహార భద్రత’లో కల అంతరం ఏమిటన్నది కూడ స్పష్టం కావలసి ఉంది. స్పష్టమవుతున్నది మాత్రం ఒక్కటే! ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పుడప్పుడే అది శాసన రూపం ధరించబోదని! పాలక, ప్రతివిపక్షాలకు మధ్య తీవ్ర విభేదాలు చెలరేగి, ‘సెలెక్టు కమిటీ’కి బిల్లును నివేదిస్తారేమో? అప్పుడు విలంబన ప్రక్రియ మళ్ళీ మొదలుకావచ్చు!!

25, నవంబర్ 2011, శుక్రవారం

‘నిర్బంధ’ మీమాంస!

రెండవ శ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపు-2జి స్పెక్టరమ్- కుంభకోణం కేసుకు సంబంధించిన ఐదుగురు నిందితులకు ‘బెయిల్’ లభించడం కన్నా, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు ఈ కుంభకోణం కేసునకు మాత్రమేకాక మొత్తం న్యాయ ప్రక్రియకు వర్తిస్తుండడం ఈ ప్రాధాన్యానికి కారణం. సంజయ్ చంద్ర, వినోద్‌గోయెంకా, గౌతమ్ దోషి, హరినాయర్, సురేంద్ర పిపారా వంటి కార్పొరేట్ కామందులకు నిర్బంధం నుండి విముక్తి లభిస్తుండడంతో నెలల తరబడి ఎదురుచూస్తున్న రాజకీయ ఘరానాలకు సైతం ‘బెయిల్’ లభించవచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవన్నీ ‘2జి స్పెక్టరమ్’కు సంబంధించిన తాత్కాలిక పరిణామాలు మాత్రమే. ఈ ఐదుగురికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రాతిపదికలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్న రెండు ప్రధాన కారణాలు మాత్రం రానున్న రోజులలో దేశవ్యాప్తంగా న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడం ఖాయం. ఒక నిందితునికి బెయిల్ మంజూరు చేయా లా వద్దా అన్న నిర్ధారణకు ఆ నిందితుని గురించి ప్రజలు ఏమని భావిస్తున్నారన్నది ప్రాతిపదిక కాజాలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జి.ఎస్.సింఘ్వీ, హెచ్. ఎల్.దత్తు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకున్న మొదటి అంశం. నిందితులకు ‘బెయిల్’ మంజూరు చేయడమే వ్యవస్థీకృతమైన న్యాయ సంప్రదాయమని, విచారణకు గురి అవుతున్న నిందితులను జైలులో ఉంచడం ఈ ‘నిబంధన’కు అపవాదం మాత్రమేనని న్యాయమూర్తులు గుర్తుచేయడం న్యాయ ప్రక్రియను తీవ్రమైన మార్పులకు గురిచేసే అవకాశం ఉంది. నేరస్థుడని ధ్రువపడిన తరువాత మాత్రమే నిందితుడు శిక్షను అనుభవించడం ఆరంభం కావాలన్న న్యాయసూత్రాన్ని గౌరవించడం మాత్రమేకాక అమలు జరపాలని న్యాయస్థానాలకు సర్వోన్నత న్యాయమూర్తులు సలహా ఇవ్వడం రెండవ ప్రధాన అంశం. ఈ రెండు ప్రధాన అంశాలను ‘టెలికామ్ కుంభకోణం’ కేసుకు వర్తింపచేయడంవల్ల ఐదుగురు నిందితులకు బెయిల్ లభించడం న్యాయ ప్రక్రియలోని ఒక అంశం మాత్రమే. దేశవ్యాప్తంగా నిర్బంధంలో ఉన్న వేలాది మంది నిందితులకు ‘బెయిల్’ లభించే అవకాశాలు ఈ వ్యాఖ్యానంవల్ల మెరుగు పడడం ప్రధాన పరిణామం. ప్రజల మనోభావాల ప్రాతిపదికగా కాక సంబంధిత నేరానికి వర్తించే సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకొని నిందితులకు ‘బెయిల్’ ఇవ్వడం లేదా తిరస్కరించడం కొత్త విషయం కాదు, తరాలుగా వ్యవస్థీకృతం అయి ఉన్న న్యాయ సూత్రం. అలాంటప్పుడు ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మళ్లీ న్యాయ ప్రక్రియ నిర్వాహకులకు గుర్తుచేయవలసిన అవసరం ఏమిటి? టెలికామ్ తరంగాల కేటాయింపునకు సంబంధించిన కుంభకోణం గురించి నెలల తరబడి దేశ ప్రజలు చర్చిస్తుండడం వల్ల ఇలాంటి అవసరం ఏర్పడి ఉందని సుప్రీం న్యాయమూర్తులు భావించి ఉండవచ్చు.
ఈ నిందితులందరూ దాదాపు ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. అనేకసార్లు వారు ‘బెయిల్’ కోసం దరఖాస్తులు పెట్టుకొనడం, ప్రత్యేక న్యాయస్థానం, ఉన్నత న్యాయ స్థానం, సర్వోన్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించడం నడచిన చరిత్ర. దర్యాప్తు పూర్తికాలేదన్నది నిందితులకు బెయిల్ మంజూరుకాకపోవడానికి ప్రధాన కారణం. ఛార్జిషీట్ దాఖలు అయిన తరువాత మాత్రమే ‘బెయిల్’కోసం సంబంధిత ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు కనిమోళి, ఏ.రాజా లాంటి నిందిత రాజకీయవేత్తలకు సలహా ఇచ్చింది కూడ! అందువల్ల చట్టాలకు సాక్ష్యాధారాలకు అనుగుణంగా కాక ప్రజాభిప్రాయం ప్రాతిపదికగా కింది న్యాయస్థానాలు నిందితులకు ‘బెయిల్’ నిరాకరించినట్టు చెప్పడానికి అవకాశమే లేదు. మరి సుప్రీంకోర్టు ఈ సలహా ఎందుకిచ్చినట్టు? న్యాయస్థానాలు ఈ ‘కార్పొరేట్’ నిందితులకు గతంలో బెయిల్‌ను మంజూరు చేయకపోవడానికి కారణం సిబిఐవారు న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని - ఛార్జిషీట్- దాఖలు చేయకపోవడమేనన్నది స్పష్టం. ఇప్పుడు ‘్ఛర్జిషీట్’ దాఖలయింది. దర్యాప్తు పూర్తయిందనడానికి ‘్ఛర్జిషీట్’ దాఖలు కావడమే నిదర్శనం. అందువల్ల నిందితులకు ‘బెయిల్’ లభించింది. ‘్ఛర్జిషీట్’ దాఖలయి, దర్యాప్తు పూర్తయి అనేక రోజులు గడిచి పోయిన తరువాత కూడా నిందితులకు ‘బెయిల్’ లభించకపోవడం గురించి సుప్రీం న్యాయమూర్తులు అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. కానీ ఇలా లభించకపోవడానికి నిందితుల పట్ల ప్రజల మనోభావాలు కారణమని నిర్ధారించడం, ఈ నిర్ధారణ ప్రాతిపదికగా ఇలా వ్యాఖ్యానించడానికి ఇది సందర్భమా అని సామాన్యులకు సందేహాలు కలుగుతున్నా యి. టెలికామ్ తరంగాల కేటాయింపునకు సంబంధించిన కుంభకోణ నిందితులు ఏళ్లతరబడి జైళ్లలో మగ్గిపోలేదు. సిబిఐ వారి దర్యాప్తులు కూడా, సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, ఏళ్ల తరబడి కొనసాగలేదు. మిగిలిన కుంభకోణాలతో పోలిస్తే ఈ కేసు దర్యాప్తువేగవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తుల నోట వెలువడిన మాటలు మాత్రం నిందితుల పట్ల ‘‘అయ్యో పాపం...’’ అనే భావం కలగడానికి దోహదం చేస్తున్నాయి.
నిందితులను ‘బెయిల్’పై విడుదల చేయడానికి, ‘బెయిల్’కు వారిని పరిమితం చేయడానికి జన మనోభావాలు ప్రాతిదికలు కారాదన్న సుప్రీంకోర్టు, మరోవైపు ప్రజాభీష్టం ఏమిటో గుర్తించినట్టయింది. కానీ ప్రజల మనోభావాలు న్యాయ ప్రక్రియకు ప్రాతిపదికలు కాకపోయినప్పటికీ, సహజంగా సమావిర్భవించే జనాభిప్రాయాన్ని నిరోధించడం మాత్రం సాధ్యం కాదు. సాక్ష్యాధారాల ప్రాతిపదికగా న్యాయస్థానాలు టెలికామ్ కుంభకోణగ్రస్తులైన ఘరానా నిందితులను నేరస్థులుగా నిర్థారిచవచ్చు లేదా నిర్దోషులని ధ్రువీకరిచవచ్చు. కానీ ప్రజలలో అత్యధికులు మాత్రం ఈ నిందితులు నేరస్థులనే విశ్వసిస్తున్నారు. అందువల్ల సర్వోన్నత న్యాయమూర్తుల సముచిత వ్యాఖ్యలు ఇప్పుడు కాక మరో సందర్భంలో వ్యక్తమయి ఉండినట్టయితే మరింత సముచితంగా ఉండేవి. ఏళ్ళ తరబడి ఈ ‘అప్రధాన’ నేరాలకు సంబంధించిన దర్యాప్తులు పూర్తికావు, న్యాయ ప్రక్రియ ఆరంభం కాదు, విచారణ పూర్తికాదు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ కేసులో నుడివినట్టు ‘‘రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదిస్తున్న మానవుని వ్యక్తిగత స్వేచ్ఛ’’ నిజంగా అలాంటి అసంఖ్యాక నిర్భాగ్యులను, విచారణకు గురి అవుతున్న సామాన్య నిందితులకు అందుబాటులోకి రావడంలేదు. అలాంటి సామాన్యులు భవిష్యత్తులో నేరస్థులుగా ధ్రువపడవచ్చు, నిర్దోషులుగా బయటపడవచ్చు. అలా ఆ నిందితులు నిర్దోషులుగా నిరూపితమయినపుడు ఏళ్ళ తరబడి వారు అనుభవించిన నిర్బంధంమాటేమిటి? ‘‘నేరస్థులని ధ్రువపడినప్పటినుంచి మాత్రమే శిక్షను అనుభవించడం ఆరంభం కావాలి’’ అని న్యాయమూర్తులు గుర్తుచేసిన వౌలిక సూత్రం మాటేమిటి? ఇలాంటి నిర్భాగ్య నిందితులకు ‘బెయిల్’ మంజూరు చేసిన సందర్భాలలో సుప్రీం న్యాయమూర్తులు ఇపుడు ఉటంకించిన సూత్రాలను వ్యక్తం చేసి ఉంటే మరింత బాగుండేది. ‘టెలికామ్ కుంభకోణం’ నిందితులు అలాంటి నిర్భాగ్యులు కాదు...