31, జనవరి 2012, మంగళవారం

‘ప్రవాస’ ముద్ర

‘ప్రవాస’ ముద్ర!.January 10th, 2012
భారతీయుల ప్రపంచవ్యాప్త అస్తిత్వానికి ప్రతీక ‘ప్రవాస భారతీయ దినోత్సం’. మన జాతీయ సాంస్కృతిక తత్వానికి అంతర్జాతీయంగా లభిస్తున్న ‘పరిగణన’కు పతాక ప్రవాసభారతీయుడు. ఈ పతాకం మరోసారి ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాజధాని జయపూర్‌లో శనివారం నుంచి మూడు రోజులపాటు జరిగిన ‘్భరతీయుల’ అంతర్జాతీయ సమ్మేళనం వందకు పైగా దేశాలనుండి వచ్చిన ప్రతినిధులతో ప్రభావ పరిమళాలను వెదజల్లింది. అంతర్జాతీయ భారతీయుడు ఎదుగుతున్నాడు...పెరుగుతున్నాడు-అనడానికి ఈ పదవ ‘ప్రవాస’ ఉత్సవం ప్రబల తార్కాణం! విదేశాలలోని భారతీయుల ప్రభావం పెరుగుతుండడంతోపాటు వారిపై వివిధ రకాల దాడులు సైతం జరుగుతుండడం జయపూర్ సమ్మేళనానికి నేపథ్యం. ఈ దాడులు కేవలం భౌతికపరమైనవి మాత్రమే కాదు. ఆర్థికపరమైనవి, వాణిజ్యపరమైనవి, సాంస్కృతికపరమైనవి! ‘ప్రవాస భారతీయుల’ భద్రతను కాపాడడంకోసం మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గరించి ప్రధాని మన్మోహన్ సింగ్ సమ్మేళనంలో ప్రత్యేకంగా వివరించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. మతరాజ్య నియంతృత్వ వ్యవస్థలున్న పర్షియా సింధుశాఖ-గల్ఫ్-ప్రాంత దేశాలలో మాత్రమే కాక అమెరికా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి ‘సర్వమత సమభావ’ ప్రజాస్వామ్య దేశాలలో సైతం ‘్భరతీయులపై’, ‘్భరతీయ సంతతి’పై వివిధ రకాల ‘వివక్ష’లు దాడిచేస్తూనే ఉన్నాయి. అమెరికా వంటి దేశాల సంకుచిత-ప్రొటక్షనిస్ట్- ఆర్థిక విధానాలు వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరిమివేసాయి. ఆస్ట్రేలియాలోనూ, బ్రిటన్‌లోనూ భారతీయులపై భౌతికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ‘గల్ఫ్’దేశాలలో నివసిస్తున్న ఆరవైలక్షల మంది భారతీయుల భద్రత కరవైపోయిన సంగతి స్వయంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు! ఈ దేశాలలోని భారతీయుల సామాజిక అస్తిత్వం అడుగంటి పోవడం ‘ప్రవాస’ ప్రస్థానంలోని ప్రధాన వైపరీత్యం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటిన్నర మంది ప్రవాస భారతీయులకు ‘ఓటింగ్’ హక్కును కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం హర్షణీయ పరిణామం కావచ్చు! కానీ తాము నివసిస్తున్న దేశాలలో వివిధ రకాల ‘వివక్ష’లకు గురికాకుండా ఈ ప్రవాస ప్రజలను రక్షించడానికి తీసుకోదలచిన నిర్దిష్ట చర్యలేమిటో మాత్రం మన్మోహన్ సింగ్ తెలియజేయలేదు. నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయులు మరింత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తమ మూలాలకు ఆలవాలమైన దేశంలో మరింత గట్టి బంధాన్ని పెంచుకోవాలన్నది భారతీయ సంతతికి చెందిన విదేశీయులకు ఆయనిచ్చిన సలహా! అయితే ఆయా దేశాలలోని భారతీయ సంతతి పౌరుల రాజ్యాంగ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అధికారాలకు భంగం వాటిల్లజేస్తున్న ప్రభుత్వాలతో ఈ సంగతిని చర్చించడానికి మన ప్రభుత్వం సర్వదా సంసిద్ధంగా ఉందా? లేదన్నది దశాబ్దుల చరిత్ర చాటుతున్న వాస్తవం!
ట్రినిడాడ్, టొబాగో, గయానా, మారిషస్, పిజీ వంటి చిన్న దేశాలలో భారతీయ సంతతివారు ఒకప్పుడు మెజారిటీగా ఉన్నారు. వీరంతా అప్పుడు హిందువులు. కానీ నిరంతరం జరిగిన మతం మార్పిడుల కారణంగా తాము ఒకప్పుడు భారత దేశానికి చెందినవారమన్న ధ్యాస ‘్భరతీయ సంతతి’లో తగ్గిపోయింది. అందువల్ల ఆయా దేశాల్లో ‘్భరతీయసంతతి’ ‘మైనారిటీ’గా మారిపోయింది. ఈ దేశాలకు భారతీయులు స్వయంగా వెళ్ళలేదు. బ్రిటిష్‌వారు మనదేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో ఈ భారతీయులను ఆయా దేశాలకు తరలించుకొని పోయారు! ఇప్పటికీ ఈ దేశాల్లో ‘్భరతీయ సంతతి’వారు ప్రధాన రాజకీయ పదవుల్లో ఉన్నారు. జయపూర్ ఉత్సవానికి ప్రధాన అతిథిగా హాజరైన కమలా ప్రసాద్ విశే్వశ్వర్ వంటివారు ఇందుకు నిదర్శనం. కానీ ఇలాంటి చిన్న దేశాలలో భారతీయతా ప్రభావాన్ని తగ్గించడానికి దశాబ్దులుగా తీవ్రస్థాయిలో ‘కృషి’ జరుగుతోంది. ఈ ‘కృషి’ నిజానికి కుట్ర. భారతీయ సంతతి వారు ప్రధానమంత్రి పదవిని అధిష్టించకుండా నిరోధించడానికై ఫిజీలో పాతికేళ్ళుగా సైనికపరమైన తిరుగుబాట్లు, రాజకీయ నియంతృత్వాలు కొనసాగుతున్నాయి. గయానాలో భారతీయులపై 1980 దశకంలో మొదలైన దాడుల తీవ్రత తగ్గినప్పటికీ వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. ఫ్రాన్స్‌లోను, కెనడాలోను భారతీయమైన వేషధారణపై ముఖ్యంగా సిక్కుల ఆహార్యంపై ఆంక్షలు విధించే ప్రయత్నాలను ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. బర్మా ఒకప్పుడు మనదేశంలో భాగం. అక్కడే పుట్టిపెరిగిన ముప్పయి లక్షలమంది ఇప్పుడు భారతీయ సంతతిగా చెలామణి అవుతున్నారు! వీరంతా ఉద్యోగాలను ఆస్తులను ఉపాధిని క్రమంగా కోల్పోతున్నారు. దాదాపు నాలుగున్నర లక్షలమంది ఇలాంటి భారతీయ సంతతి ప్రజలు ‘పౌరసత్వంలేని’-స్టేట్‌లెస్- శాశ్వత శరణార్ధులుగా అలమటిస్తున్నారట! మలేసియాలోని భారతీయ సంతతి బతుకులు మరింత దుర్భరంగా ఉండ టం మన ప్రభుత్వాలకు ధ్యాసలేని మరో వైపరీత్యం. అక్కడ ప్రభుత్వమే హిందూ ఆలయాలను నిర్మూలించిన తీరు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. మలేసియా హిందువులు తమ దుస్థితిని గురించి 2007లో ఐక్యరాజ్య సమితికి సైతం ఫిర్యాదు చేసారు!
ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన సంపన్న ప్రతినిధులను మనదేశంలో ఇతోధికంగా పెట్టుబడులను పెట్టమని కోరడంలో తప్పులేదు. కానీ సమ్మేళనానికి రాలేని లక్షలాదిమంది భారతీయ సంతతి వారు తమ దేశాల్లో వౌనంగా రోదిస్తున్నారు. వారి ‘వాణి’ ప్రవాస ఉత్సవాల సందర్భంగా వినబడడం లేదు. అలాంటి లక్షలాది భారతీయుల సమస్యలు పరిష్కారానికి ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖవారు ఇకముందైనా శ్రద్ధ వహించినట్టయితే ఈ ఉత్సవాలకు నిజమైన సార్థకత సమకూడుతుంది. విదేశాలలో ఉన్న భారతీయులు తాత్కాలిక ‘ప్రవాసం’లో ఉన్న పౌరులు. వీరి దేశభక్తి భారత్‌పట్ల మాత్రమే ఉండాలి. విదేశాల పౌరసత్వం స్వీకరించి ఆయా దేశాల జాతీయ జీవన స్రవంతిలో భాగమైన వారు శాశ్వత ప్రవాసులైన భారతీయ సంతతివారు. ఇలాంటివారు తమతమ దేశాలపట్ల భక్తిని కలిగిఉండాలి. కానీ భారతీయ సంతతిపై దాడులు జరిగిన సమయంలో మన ప్రభుత్వాలు అ సమస్యలను ఆయాదేశాల ‘ఆంతరంగిక అంశాలు’గా భావిస్తున్న సందర్భాలే ఎక్కువ! దేశ విభజన తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోను మిగిలిపోయిన హిందువులు సైతం ఇలాంటి భారతీయ సంతతివారే! అఫ్గానిస్థాన్‌లో ధ్వంసమైన బుద్ధుని విగ్రహాలు, మలేసియాలో కూలిన ఆలయాలు ప్రవాస భారతీయ సమస్యలేనన్న ధ్యాసకూడా మన ప్రభుత్వాలకు కలగాలి! వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన ప్రవాస భారతీయులకు అవార్డులను ఇవ్వడం హర్షణీయం. విదేశాలలో స్థిరపడి శాస్త్ర సాంకేతిక వాణిజ్య రంగాలలో తమ ప్రభావం చూపగలుగుతున్న వారు చాలామందే ఉన్నారు. కానీ ఆయాదేశాలలో భారతీయ సాంస్కృతిక ప్రభావ ముద్రలను వేయగలుగుతున్న వారు ఎంతమంది? ప్రతి దేశానికి జాతీయ సంస్కృతి ప్రత్యేకం! విదేశాలలో ఉంటున్న భారతీయులు ఈ ప్రత్యేకతను నిలుపుకున్నప్పుడే ‘ఉత్సవానికి’ నిజమైన సార్థకత!

3 కామెంట్‌లు: