31, జనవరి 2012, మంగళవారం

అర్థంకాని ఆర్థిక నీతి!

అర్థంకాని ఆర్థిక నీతి!
30/01/2012
TAGS:దీపం పెట్టుకొని ‘దిగనేసే’ పనికి రిజర్వ్‌బ్యాంకు వారు పూనుకొనడం విచిత్రమైన పరిణామం. ఆర్థిక అయోమయత్వం స్పష్టించిన మరో గందరగోళం! వాణిజ్య బ్యాంకులు తమవద్ద విధిగా ఉంచవలసిన ‘నగదునిలువ’-క్యాష్ రిజర్వ్- శాతాన్ని తగ్గించడం ద్వారా రిజర్వ్‌బ్యాంకు నిర్వాహకులు ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి మార్గాన్ని సుగమం చేశారు. ద్రవ్యోల్బణం పెరగడానికి పూర్వరంగంగా నిత్యావసరాల ధరలు విశేషించి ఆహారం ధరలు పెరిగిపోవడం అనివార్యం! ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం గత ఏడాది మొత్తం జరిగిన ప్రహసనం. ఈ ఏడాది ఆరంభం నాటికి విచిత్రంగా ఆహార ద్రవ్యోల్బణం సున్నశాతానికి పడిపోయినట్టు అధికారికంగా నమోదయిపోయింది. ఆ తరువాత అధోముఖంగా-నెగెటివ్- సాగుతున్న ‘ద్రవ్యోల్బణం’ నిజానికి ‘ద్రవ్యమాంద్యం’గా పరిణమించినట్టు ప్రచారం జరుగుతోంది! అందువల్ల ద్రవ్యోల్బణాన్ని మళ్ళీ పెంచడానికి వీలుగా సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీన ‘క్యాష్ రిజర్వ్’ను ఆరుశాతం నుంచి ఐదున్నరశాతానికి తగ్గించివేసింది. వడ్డీరేట్లను మాత్రం తగ్గించలేదు. ఇలా నగదు నిల్వను తగ్గించడంవల్ల అదనంగా ముప్పయిరెండు వేలకోట్ల రూపాయలు నగదు రూపం లో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తడం ఖాయమట! ఈ ‘ముంపు’ కారణంగా వినియోగదారుల కొనుగోలుశక్తి పెరిగిపోతుంది. పెట్టుబడులు పెరిగిపోతాయి. ఫలితంగా ‘జాతీయ స్థూల ఉత్పత్తి’-జిడిపి- పెరుగుతుందట. కానీ సమాంతరంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందన్న కఠోర వాస్తవాన్ని మాత్రం రిజర్వ్‌బ్యాంకువారు మూసిపెడుతున్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరింత ముందుకెళ్ళి ఈ ‘తగ్గింపు’ వల్ల ద్రవ్యోల్బణం పెరుగని రీతిలో పెట్టుబడులు, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ ప్రగతి సాధిస్తాయని ‘్ఢంకా’ బజాయించారు. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్‌బ్యాంకు వద్ద నిలువ ఉంచే నగదుశాతం పెరగడం వల్ల, వడ్డీశాతం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నది గత ఏడాది మొత్తం జరిగిన ప్రచారం. అందువల్ల గత ఏడాది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంకోసం అనేకసార్లు ‘రిజర్వ్‌బ్యాంక్’ క్యాష్‌రిజర్వ్ రేషియోను పెంచింది. వడ్డీరేట్లను పెంచింది. ‘క్యాష్ రిజర్వ్’ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థనుంచి ఆమేరకు నగదును బ్యాంకులు ఉపసంహరించుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గించడం వల్ల వస్తువులకు గిరాకీ తగ్గి ధరలు తగ్గుతాయట. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. వడ్డీరేట్లు పెరగడం వల్ల వినియోగదారులు బ్యాంకుల్లో ఎక్కువ ‘డిపాజిట్లు’ చేస్తారట! దీనివల్ల కూడా ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గిపోయి ద్రవ్యోల్బణం తగ్గిపోతుందట! అందువల్ల గత ఏడాది మొత్తం ద్రవ్యోల్బణాన్ని, ధరలను తగ్గించడానికి ‘రిజర్వ్ బ్యాంకు’ వారు చేసిన ఏకైక ప్రయోగం వడ్డీరేట్లను, ‘క్యాష్ రిజర్వ్ రేషియో’ను పెంచుకుంటూ పోవడం!! ‘‘మరి ఇప్పుడు ‘క్యాష్ రిజర్వ్’ను తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మళ్ళీ పెరుగుతుంది కదా..’’అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానం లేదు.
ద్రవ్యోల్బణం అగ్నికి ఆజ్యం వలె లేదా బొగ్గువలె పనిచేయని రీతిలో పెట్టుబడులు పరిమాణాన్ని, ‘జిడిపి’ అభివృద్ధిశాతాన్ని పెంచడానికి ‘క్యాష్ రిజర్వ్’ను తగ్గిస్తున్న చర్య దోహదం చేస్తుందన్న ఆర్థికమంత్రి అభిభాషణ ఆకర్షణీయంగా ఉంది. కానీ ఆర్థికవేత్తలకు సైతం అర్థంకాని విషయమిది. సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. వచ్చే మార్చినాటికి సాధారణ ద్రవ్యోల్బణం ఆరు, ఏడుశాతాలకు మధ్యలో ఊగులాడుతూ ఉంటుందని ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్‌లో బెంగళూరులో జరిగిన దక్షిణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో నుడివి ఉన్నారు. డిసెంబర్ చివరి నాటికి ద్రవ్యోల్బణం తొమ్మిదిశాతానికంటే తగ్గలేదు! అలాంటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి వీలైన చర్యలను చేపట్టడం ద్వారా మార్చినాటికి ఆరుశాతానికి దాన్ని ఎలా తగ్గించనున్నారు? ఆహార ద్రవ్యోల్బణం సున్నశాతానికి చేరిందన్న అధికారిక గణాంకాలు వాస్తవ సామాజిక జన జీవనంలో ప్రతిబింబించకపోవడం మరో వైపరీత్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు తగ్గినందువల్ల ఆహార ద్రవ్యోల్బణం తగ్గిపోయిందట! టమోటో, ఉల్లిపాయల ఉత్పత్తి పెరిగిపోయి గిట్టుబాటు ధరలు లేక వీధులలోను, దిబ్బలలోను పారపోయడం గురించి వార్తలు ప్రసారమయ్యాయి. మరికొన్ని చోట్ల టమోటాలను తెంపకుండా పొలాలలో వదలివేశారట! ఈ కారణంగా రెండు మూడు కూరగాయల ధరలు తగ్గాయి. కానీ మిగిలిన కూరగాయల ధరలన్నీ ఆకాశమంత ఎత్తులోనే అలరారుతుండడం జనానికి తెలిసిన వాస్తవం! అంటే ఆహార ద్రవ్యోల్బణాన్ని విడిగా లెక్కించడం మొదలైన రెండేళ్ళలోనే ఈ పద్ధతి కూడ పనికిరాకుండా పోతున్నదన్నమాట! గతంలో అనేక ఏళ్ళపాటు ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించే పద్ధతి తప్పులతడకగా మారినట్టు 2009లో వెల్లడయింది. ద్రవ్యోల్బణం ‘సున్న శాతం’ నమోదయిన రోజులలోనే కందిపప్పు్ధర కిలో వందరూపాయలు దాటింది! ఆతరువాత నాలుకలను కరచుకున్న అధికార ఆర్థిక నిపుణులు ఆహార ద్రవ్యోల్బణాన్ని, సాధారణ ద్రవ్యోల్బణాన్ని విడివిడిగా లెక్కగట్టడం మొదలుపెట్టారు. ఇలా విడి లెక్కలు మొదలైన వెంటనే ఆహా ర ద్రవ్యోల్బణం, 2009 అక్టోబర్‌లో, పదునాలుగు శాతానికి చేరినట్టు వెల్లడయింది. ఇప్పుడు సున్నశాతం, అంతకంటె ఎక్కువశాతం స్థాయికి ఆహారద్రవ్యోల్బణం తగ్గిందన్న ‘నిర్ధారణ’ నిజం కాదేమోనన్న అనుమానం కలుగడానికి ఈ చరిత్ర నేపథ్యం!
ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలు ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ అభివృద్ధిశాతాన్ని తగ్గించడానికి దోహదం చేశాయట! గత ఏడాది మొత్తం ఇదే ప్రచారం జరిగింది! అప్పుడేమో బ్యాంకులు వడ్డీ రేట్లను, ‘సిఆర్‌ఆర్’ను పెంచుకుంటూ పోయారు. మరి అలా జరుగుతుందని ముందే తెలుసుకదా! తెలిసి తెలిసి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే నెపంతో ‘జిడిపి’ పెరుగుదల తగ్గించడానికి, ఎగుమతులు తగ్గడానికి, పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గడానికి వీలైన చర్యలను చేపట్టారు! ‘సున్నకుసున్న’ ‘హళ్ళికి హళ్ళి’ అన్నట్టు అటు ద్రవ్యోల్బణం తగ్గలేదు, ఇటు అభివృద్ధి మాత్రం కుంటుపడిందట! అందువల్ల పూర్తి వ్యతిరేక దిశలో ఆర్థిక చర్యలు మొదలైనాయి! బహుశా ఈ వ్యతిరేకదిశా ప్రస్థానం ఈ సంవత్సరమంతా కొనసాగవచ్చు. గత ఏడాది నాలుగుసార్లు వడ్డీని, ‘రిజర్వ్’ను పెంచుకున్నారు. ఈ ఏడాది నాలుగుసార్లు ‘రిజర్వ్’ను తగ్గిస్తారు కాబోలు! అప్పటికీ ‘జిడిపి’ పెరుగుతుందన్న నమ్మకం కుదరకపోతే ‘వడ్డీరేట్ల’ను కూడా తగ్గిస్తారు! ఇలా తగ్గించడం, పెంచడం మినహా మన ఆర్థిక సౌష్టవాన్ని పరిరక్షించే మరో ప్రత్యామ్నాయం లేదా? ఇది మొదటి సమస్య! ద్రవ్యోల్బణం తగ్గితే ఆర్థిక ప్రగతి కూడా తగ్గిపోతుంది! ఇది రెండవ వైపరీత్యం! అమెరికా ఆర్థిక వ్యవస్థ 2008లో దివాలా తీసిననాటినుంచి ఏర్పడివున్న అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ప్రభావం మనదేశంపై లేదని ప్రభుత్వ నిర్వహణతో సంబంధం ఉన్న ప్రతి ఆర్థికవేత్త చెబుతున్న నేపథ్యంలో ఈ రెండు వైపరీత్యాలను నిరోధించడానికి, ఆర్థిక రుగ్మతలను నయం చేయడానికి ప్రత్యామ్నాయం ఏమిటి? రిజర్వ్ బ్యాంకు నిర్వాహకులు చెప్పగలగాలి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి