31, జనవరి 2012, మంగళవారం

‘వస్త్ర’ వైపరీత్యం!

‘వస్త్ర’ వైపరీత్యం!
25/01/2012
TAGS:బట్టల వర్తకులు,‘పన్నులను కలిపి విలువ’,రాష్ట్రప్రభుత్వం ఆరంభించిన ‘పన్నుల దాడి’పై వస్త్ర వ్యాపారులు నిరసన అస్త్రాలను సంధించడం శుభపరిణామం. దేశంలో మరే రాష్ట్రంలోను లేని విధంగా వస్త్ర విక్రయాలపై అదనంగా ఐదుశాతం పన్ను విధించడం పట్ల ఆగ్రహంతో దుకాణాలను మూసిన బట్టల వర్తకులు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకోసం కూడా ఉద్యమించినట్టయింది. ఎందుకంటే ‘తాగే వాడే కడతాడు తాడిపన్ను’ అన్న చందంగా చివరికి అన్ని పన్నులూ కలిసిన ధర వినియోగదారుడి నెత్తికెక్కి తొక్కడం సహజ పరిణామం! ఈ పరిణామాన్ని నిరోధించడానికి నడుం బిగించి దుకాణాల తలుపులను బిగించిన వ్యాపారులు అభినందనీయులు. ‘పన్నులను కలిపి విలువ’-వాల్యు యాడెడ్ టాక్స్-ను నిర్ధారించి, బట్టల ధరలను పెంచే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అనేక రీతులుగా వ్యాపారులు వ్యతిరేకిస్తున్నప్పటికీ నిరసన నినాదాలు ప్రభుత్వానికి వినబడకపోవడం నిత్యావసరాల ధరల నియంత్రణ పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. వస్త్రాలపై ఐదుశాతం ‘వాట్’ను విధిస్తూ గత జూలైలో జారీ చేసిన ఉత్వర్వులను ఉపసంహరించకపోవడం వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది చిల్లర వ్యాపారులపట్ల, కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపు కొనసాగుతున్న దనేందుకు సాక్ష్యం!
రాష్ట్రంలో మాత్రమే కాదు దేశం మొత్తం మీద వస్త్ర పరిశ్రమ సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. వేలాదిమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండ డం ‘సామాజిక న్యాయసాధన లక్ష్యాన్ని’ కళంకితం చేస్తున్న పాపం. ఈ పాపానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వాల విధానాలు. మన రాష్ట్రంలోనే 2010లో దాదాపు రెండువేల మంది నేతన్నలు ప్రాణాలను తీసుకున్నారుట! ఖాదీ పరిశ్రమ, చేనేత పరిశ్రమ, మరమగ్గాల రంగం, భారీ వస్త్ర పరిశ్రమల రంగం- ఇవన్నీ వివిధ సమస్యలకు లోనై ఉన్నాయి. పత్తి విత్తనాలను కొనుగోలు చేయడంతో మొదలై వస్త్రంగా వినియోగదారుడిని చేరడంతో ముగుస్తున్న మొత్తం ప్రక్రియ క్రమంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల నియంత్రణలోకి వెళ్ళిపోతోంది. ‘బిటి’ పత్తి విత్తనాలను విపరీతమైన ధరలకు అమ్మి దోచి పారేస్తున్న అమెరికా తదితర విదేశీయ సంస్థలకు రాయితీలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపై ‘వాట్’ వేటు వేయడం ప్రజావ్యతిరేక చర్య! చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఎలాంటి రాయితీలు లేకపోవడమే! ప్రభుత్వాలు ప్రకటిస్తున్నట్టు ప్రచారవౌతున్న రాయితీలు ‘బహుళ జాతీయ వాణిజ్యం’ దోపిడీని ఎదుర్కొని రైతన్నలను, నేతన్నలను బతికించడానికి తగినంత స్థాయిలో లేవన్నది ధ్రువపడిన సత్యం. రాయితీలు, సబ్సిడీలు ఆదుకున్నట్లయితే చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? దేశం మొత్తం మీద మన రాష్టల్రోనే ఈ పన్నుల బెడద ఎక్కువగా ఉన్నదని పదమూడవ ‘ఆర్థిక సంఘం’ వారు నిర్ధారించారట! ఇలా నిర్ధారణ జరిగిన తరువాత పన్నులను తగ్గించాలి! రాష్ట్రప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను పెట్టేవారికి కారుచౌకగా -దేశంలోనే అతి తక్కువ ధరకు-విద్యుచ్ఛక్తిని సరఫరా చేస్తుందట! ఇలా చేయకపోతే కార్పొరేటు సంస్థలు ఇక్కడ కేంద్రాలను నెలకొల్పవన్న భయం పీడిస్తున్నది మరి! కానీ తిండిగింజలు, బట్టలు వంటి నిత్యావసరాలపై ఎంతగా పన్నులు పెంచినప్పటికీ చచ్చినట్టు కొంటారన్న ధీమా ప్రభుత్వానికుంది!
ఈ ‘్ధమా’తోనే గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఐదుశాతం పన్ను విధించింది. వ్యాపారులు ఇంత తీవ్రంగా ప్రతిస్పందిచరని బహుశా ప్రభుత్వం భావించి ఉంటుంది. ఈ పన్ను మొత్తం చివరికి చెల్లించవలసింది వినియోగదారులు కాబట్టి, వారు సంఘటితంగా ఉద్యమించడం అసంభవం కాబట్టి! ‘వాట్’ను మోదడం వల్ల మూలిగేది వినియోగదారులే కాని వ్యాపారులు కారని ప్రభుత్వం ఇన్నాళ్ళూ భావించింది. వ్యాపారులు నిరసనలే కాదు ‘నిరశనలు’ కూడా సంధించడం, రాష్టవ్య్రాప్తంగా దాదాపు లక్ష దుకాణాలు మూతపడడం ప్రభుత్వం ఊహించని పరిణామం! ‘వాట్’ను తక్షణం రద్దు చేయడం తప్పని సరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది! గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా వస్త్రోత్పాదక పరిశ్రమలవారు సమ్మె చేసారు. దేశంలోని దాదాపు 3500 వస్తప్రరిశ్రమలు మూతపడినాయి. పత్తి ఎగుమతులపై విధించిన ‘పరిమితిని’ ఎత్తివేయాలని కోరుతూ అప్పుట్లో సమ్మె జరిగింది. ఏటా యాభై ఐదు లక్షల గట్టా- బేల్-ల పత్తికి మించి ఎగుమతి చేయరాదని 2010 సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం విధించిన ‘పరిమితి’ కారణంగా పత్తి నిల్వలు, నూలు నిల్వలు పేరుకొని పోయాయట! ఇలా పేరుకొనిపోయిన నిల్వలను ప్రభుత్వం కొని ఖాదీ, చేనేత పరిశ్రమలకు చౌకధరలకు సరఫరా చేయవచ్చు. కానీ ‘ఖాదీ’కి కేంద్రం కాని, ‘చేనేత’కు రాష్ట్రాలు కాని కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువ! గత మేనెలలో జరిగిన సమ్మె తరువాత మరో ఇరవై ఐదు లక్షల బేళ్ళ పత్తిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది! ఈ ఎగుమతి కారణంగా దేశీయ విపణిలో గిరాకీ పెరిగింది! పెరిగిన ‘గిరాకీ’ని సొమ్ము చేసుకోవాలన్న అత్యాశ రాష్ట్రప్రభుత్వ చర్యకు కారణం! ‘సంక్షేమం’ కాదు ‘వ్యాపార లాభం’ ప్రభుత్వ విధానం!
వ్యాపారులకు మద్దతుగా దర్జీ వృత్తివారు కూడా ఆందోళనలో భాగస్వాములు కావడం ప్రపంచీకరణ ప్రభావం సృష్టించిన వైపరీత్యతకు నిదర్శనం. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలకు, ఋణభారానికి ప్రపంచీకరణ కారణమని బ్రిటన్ యువరాజు దేశాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాడు. కానీ వస్త్ర పరిశ్రమలో ప్రపంచీకరణ తెచ్చిన మార్పుల కారణంగా దర్జీ వృత్తి నిశ్శబ్దంగా నిర్మూలనకు గురి అయిపోతోంది. ధారణయోగ్యమైన-రెడీమెడ్- వస్త్రాల ఉత్పత్తుల కారణంగా బట్టలను కుట్టించుకునేవారు తగ్గిపోతున్నారు. అందువల్ల పనిలేని దర్జీలు ‘యజమాని’ హోదాను స్వతంత్ర జీవనాన్ని వదలిపెట్టి పెద్దపెద్ద ‘గార్మెంట్స్’ ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరిపోతున్నారు. దీనికితోడు చైనా అమెరికాలలోని ‘రెడీమేడ్’ సరకు దిగుమతి అవుతోంది! ‘్ఫ్యషన్’ల ప్రచారం కారణంగా ‘చేనేత’, ‘ఖాదీ’ వంటి స్వదేశీయ ఉత్పత్తులు ఉన్నాయన్న ధ్యాసను కూడా వినియోగదార్లు కోల్పోతున్నారు. ఐరోపా దేశాలకు, అమెరికాకు మధ్య, చైనాకు ఐరోపా దేశాలకూ మధ్య ‘వస్తయ్రుద్ధం’ దశాబ్దులుగా కొనసాగుతోంది. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిబంధనలు లెక్కపెట్టని ఈ దేశాలు సంకుచిత ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నాయి. తయారైన బట్టల దిగుమతులను నిషేధిస్తున్నాయి! కానీ మనదేశంలో మాత్రం విదేశాల బట్టల మోజు పెరుగుతోంది! మన కేంద్రప్రభుత్వం మాత్రం దిగుమతులపై ఆంక్షలను విధించదు! ఇది మొదటి సమస్య! ‘ఎయిడ్స్’ వంటి తక్షణ సమస్యల పరిష్కారానికి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, ‘చేనేత’, ‘ఖాదీ’ వస్త్రాలను విరివిగా ధరించాలని అవగాహన పెంచడానికి దీర్ఘకాల పథకాలను రూపొందించడంలేదు! ఇది రెండవ సమస్య! ఈ రెండు సమస్యలు పరిష్కారం అయ్యేవరకు చేనేత చిక్కుముడి వీడదు! ‘వాట్’ రద్దుకాక తప్పదు! కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాగలదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి