31, జనవరి 2012, మంగళవారం

‘ఇంధనం’ దోపిడీ!

‘ఇంధనం’ దోపిడీ!
28/01/2012
TAGS:ప్రభుత్వ విధానాలను బృహత్ వాణిజ్య-కార్పొరేట్- సంస్థలు ప్రభావితం చేస్తున్న తీరుకు ఇది మరో ఉదాహరణ. తాము ఉత్పత్తి చేస్తున్న ఇంధనం వాయువు-నాచురల్ గ్యాస్- ధరలను పెంచాలని ముఖేశ్ అంబానీ నాయకత్వలోని ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’-రిల్- వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు! ధరలను పెంచుకోవాలని కోరడంలో తప్పులేదు. కానీ మరో రెండేళ్ళ వరకు ‘గ్యాస్’ ధరలను పెంచరాదన్న అంగీకారానికి విరుద్ధంగా రిలయన్స్ వారు ఇప్పుడీ కోర్కెను వెళ్ళబెడుతున్నారట. ఒకవైపు ధరలను పెంచడానికి అనుమతి ఇవ్వాలని పెట్రోలియం, ఇంధనవాయు మంత్రిత్వశాఖను ‘అభ్యర్థిస్తున్న’రిలయన్స్ గ్యాస్ సంస్థ మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగంలోని థర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ‘గ్యాస్’ సరఫరాలను ఆపి ఉంచింది. ఇప్పుడీ వివాదం బొంబాయి హైకోర్టులో అపరిష్కృతంగా ఉంది! ధరలను పెంచడానికి వీలుగా ‘రిల్’ కృష్ణ గోదావరి ఉత్పాదక క్షేత్రం-డి బ్లాక్-లో ఉత్పత్తులను తగ్గించినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒత్తడి’ చర్యల ఆరోపణ ఎలా ఉన్నప్పటికీ ‘కృష్ణగోదావరి’ క్షేత్రంలో ఉత్పత్తి తగ్గినమాట మాత్రం ధ్రువపడిపోయింది. ‘గ్యాస్’ ఉత్పత్తి తగ్గిన కారణంగానే గత ఏడాది ‘రిల్’ వాటాల విభజనతోపాటు సంస్థ లాభాలు సైతం గణనీయంగా తగ్గిపోయినట్టు ప్రచారమవుతోంది. అలాంటప్పుడు ఉత్పత్తిని పెంచడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఒత్తడి తెచ్చి ‘గ్యాస్’ ధరలను పెంచి లాభాలను మూటకట్టడానికి ఈ సంస్థ పూనుకొంటోంది! ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘గ్యాస్’ ధరలను నిర్ణయించడంలో తన అంగీకారం కూడా తీసుకోవాలన్న వాదాన్ని వినిపిస్తున్నారట! ప్రభుత్వం నిర్ధారించిన ధరలను ‘రిల్’ వారు అంగీకరించకపోవడం ఇది మొదటిసారి కాదు. 2009లో కూడ ఇలాంటి పేచీ పెట్టింది. అంతకు పూర్వం ఒక ‘్థర్మల్ యూనిట్’ గ్యాస్‌ను 2.34 డాలర్ల-దాదాపు వంద ముప్పయి రూపాయల- చొప్పున విక్రయించడానికి అంగీకరించిన ‘రిల్’ ఆ తరువాత మాట తప్పింది. మొదట తక్కువ ధరకు సరఫరా చేయనున్నట్టు నమ్మించి ఒప్పందం కుదుర్చుకోవడం, ఆతరువాత నిర్ణీత కాలం కంటే ముందుగానే ధరలు పెంచడం ‘రిల్’ వాణిజ్య వ్యూహంలో భాగమైపోయింది! ఒప్పందాన్ని ఉల్లంఘించిన ‘కార్పొరేట్’ సంస్థలపై చర్యలు తీసుకోవలసిన కేంద్ర ప్రభుత్వం లొంగిపోతుండటం నడుస్తున్న చరిత్ర. ఈ లొంగుబాటు కారణంగానే 2007లో ప్రభుత్వం ‘రిల్’ గ్యాస్ ధరను దాదాపు రెట్టింపు చేసింది. ‘్థర్మల్ యూనిట్’ ధరను 4.20 డాలర్ల-దాదాపు రెండువందల పదిహేను రూపాయలు-కు పెంచింది. ఈ పెరిగిన ధరకు సైతం ‘ఎన్‌టిపిసి’కి ‘గ్యాస్’ సరఫరాలను చేడానికి ‘రిల్’ నిరాకరిస్తుండటం వర్తమాన వైపరీత్యం!
ప్రభుత్వరంగ యాజమాన్యాలు, పెట్రోలియం మంత్రిత్వశాఖవారు పరోక్షంగా ‘కార్పొరేట్’ సంస్థలు ‘గ్యాస్’ ధరలు పెంచడానికి సహకరిస్తుండటం కూడ ‘రాజకీయ వాణిజ్య’ భాగస్వామ్యంలోని మరో వైపరీత్యం. నిర్థారణ జరుగుతున్న ధరలకు ‘కృష్ణగోదావరి’ గ్యాస్‌ను విక్రయించడం సాధ్యంకాదని, ప్రభుత్వరంగ ‘ఒఎన్‌జిసి’ వారు 2010లోనే ప్రకటించారు. 2009 ‘గ్యాస్’ ధరను దాదాపు రెట్టింపు చేసిన తరువాత కూడ ‘చమురు’ ఇంధన వాయు సంస్థ’- ఒఎన్‌జిసి- వారు ఇలా ప్రకటించడం విడ్డూరం. అంటే ‘గ్యాస్’ ధరలను మరింత పెంచాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వమే ప్రచారం చేసినట్టయింది. 2010 ఏప్రిల్‌లో ‘ఒఎన్‌జిసి’ ఈ ప్రకటన చేసిన తరువాత, జూన్‌లో ప్రభుత్వం ధరలను పెంచుకోవడానికి అనుమతి ప్రదానం చేసింది. కృష్ణగోదావరి క్షేత్రంలో ‘గ్యాస్’ను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ సంస్థలు ధరలను పెంచడానికి వీలున్నప్పుడు ప్రభుత్వేతర సంస్థలు మాత్రం ఎందుకు పెంచరాదన్న వాదం ‘రిల్’కు ఉపకరిస్తోంది. ఇలా ధరలను పెంచాలన్న ప్రతిపాదన చేసిన ‘ఒఎన్‌జిసి’ క్రమంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. ఇటీవల మన రాష్ట్రంలో భాగస్వామ్య సదస్సు జరిగిన సందర్భంగా, రాష్ట్రానికి చెందిన ఓ చమురు శుద్ధి కర్మాగారానికి చెందిన ముప్పయివేల కోట్ల రూపాయల వాటాలను ‘ఒఎన్‌జిసి’, ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించినట్టు వెల్లడైంది. స్వదేశీయ చమురు క్షేత్రాలను, చమురు, ఇంధనవాయు ఉత్పాదక కేంద్రాలను క్రమంగా ప్రభుత్వేతర సంస్థలకు విక్రయిస్తున్న ‘ఒఎన్‌జిసి’ విదేశాలకు ఈ పెట్టుబడులను తరలించి ఆయాదేశాలలో ‘చమురు, ఇంధన వాయువుల’ తవ్వకాలను జరిపిస్తోంది! అంటే ప్రభుత్వ నియంత్రణ నుంచి ‘గ్యాస్’ ఉత్పత్తిని, పంపిణీని పూర్తిగా తప్పించడానికి, తద్వారా ప్రభుత్వేతర సంస్థలు స్వయంగా ధరలను నిర్థారించడానికి ఇలా రంగం సిద్ధమైపోతోంది!
‘రిల్’ గ్యాస్ సరఫరాలను ఆరంభించని కారణంగా ‘ఎన్‌టిపిసి’వారు గుజరాత్‌లో నిర్మించిన రెండు విద్యుత్ ఉత్పాదక కర్మాగారాల్లో ఉత్పత్తి ఇంకా మొదలు కాలేదట! అందువల్లనే ‘రిల్’ను ఒప్పించి సరఫరాలను ప్రారంభింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ విభాగం వారు పెట్రోలియం మంత్రిత్వశాఖను కోరుతున్నారట! అయితే వివాదం బొంబాయి హైకోర్టులో పరిష్కారం అయ్యేంతవరకు సరఫరాలను ప్రారంభించరాదనేది ‘రిల్’ విధానం. ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలో ఉత్పత్తి అవుతునద్న ‘గ్యాస్’ ధరలను ‘్థర్మల్ యూనిట్’కు ఏడు డాలర్లు- మూడు వందల యాబయి రూపాయలు- చొప్పున నిర్ధారించాలని ‘ఒఎన్‌జిసి’ వారే 2010లో ప్రతిపాదించారు. అందువల్ల కనీసం ఆమేరకు కానీ, మరింత ఎక్కువ స్థాయికి కానీ ధరలను పెంచుకోవాలన్నది ‘రిల్’ లక్ష్యం కావచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం -పిపిపి- ఇలా ధరలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ‘ఒఎన్‌జిసి’విధానం నిర్ధారించింది! ఇదంతా దేనికి సంకేతం? వర్థమాన దేశాలలో ప్రజలకు ప్రభుత్వాలు ఇస్తున్న అన్ని రకాల రాయితీలను సబ్సిడీలను రద్దుచేసేయాలన్న ‘ప్రపంచబ్యాంకు’ ఆదేశాలకు, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంకాంక్షలకు అనుగుణమైన రీతిలోనే మన పెట్రోలియం, ఇంధనవాయు’ విధానం నడిచిపోతోందని స్పష్టం కావడంలేదా? ‘రిల్’ వారు, తదితర ప్రభుత్వేతర సంస్థలు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు సరఫరా చేసే ‘గ్యాస్’ ధరలు పెరగడం వల్ల దేశమంతటా విద్యుత్ ధరలు పెరిగిపోతాయి. కీర్తి ఎన్ ఫారిఖ్ అధ్యక్షతన ప్రధానమంత్రి నియమించిన సంఘం 2010లో నివేదిక సమర్పించిన నాటినుంచి, ‘ప్రభుత్వేతర’ సంస్థల ఇంధన సామర్థ్యం విస్తరించిపోతున్నాయి. పెట్రోలు, గ్యాస్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి అంతర్జాతీయ విపణితో అనుసంధానం చేయాలన్నది ఫారిఖ్ సంఘం ప్రతిపాదన. ఇప్పటికే పెట్రోలు పంపిణీని ప్రభుత్వం ఇలా ‘అంతర్జాతీయ అనుసంధానం’ చేసింది! ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పారిశ్రామిక ప్రయోజనాల కోసం పనికివచ్చే ‘గ్యాస్’ను ‘రిల్’ నియంత్రిస్తోంది! ‘వంట’గ్యాస్‌ను సైతం అంతర్జాతీయ విపణితో అనుసంధానించేయడమే మిగిలివున్న కార్యక్రమం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి