31, జనవరి 2012, మంగళవారం

‘అంతరిక్ష’ అవినీతి

‘అంతరిక్ష’ అవినీతి
27/01/2012
TAGS:గత ఏడాది ఫిబ్రవరిలో గుప్పుమన్న ‘అంతరిక్ష’ అవినీతి దుర్గంధాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలు కావడం శుభపరిణామం! అయితే ప్రభుత్వం ప్రకటించిన దిద్దుబాటు చర్యలు అవినీతి తీవ్రతకు తగిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న వైపరీత్యం! భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస థ-ఇస్రో- ప్రతిష్ఠకు విఘాతకరంగా పరిణమించిన ఈ కుంభకోణం గత ఫిబ్రవరిలో బయటపడినప్పుడు దాదాపు రెండు లక్షలకోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు ప్రచారమైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ‘దేవాస్’కు 2005లో కారు చౌకగా అంతరిక్ష ధార్మిక తరంగ వలయాన్ని -వైర్‌లెస్ రేడియో ఫ్రీక్వెన్సీ స్పేస్ సెగ్మెంట్- కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ. అపురూపమైన ఈ ‘ఎస్ బ్యాండ్’ ధార్మిక తరంగాల -స్పెక్ట్రమ్-ను ‘దేవాస్’కు అక్రమంగా కేటాయించిన సమయంలో ‘ఇస్రో’ అధ్యక్షుడిగా ఉండిన ‘పద్మభూషణ్’ జి. మాధవన్ నాయర్‌ను మరో ముగ్గురు శాస్తవ్రేత్తలను ప్రభుత్వం ఇప్పుడు శిక్షించింది! కానీ ఈ ‘శిక్షల’ తీరును పరిశీలించినట్లయితే మొత్తం విచారణ ప్రక్రియను నీరుకార్చడంలో ఇది భాగమేమోనన్న అనుమా నం కలుగుతోంది! మాధవన్ నాయర్ తదితర ‘ఇస్రో’ శాస్తవ్రేత్తలు దోషులా లేక నిర్దోషులా అన్న విషయమై ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి దర్యాప్తు బృందంవారు ఏమి నిర్థారించారన్నది స్పష్టంగా వెల్లడికాకపోవడం ఆ అనుమానానికి ప్రాతిపదిక! ఈ నలుగురు శాస్తవ్రేత్తలను భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిరోధించాలని ఈనెల 13వ తేదీన ప్రభుత్వం నిర్ధారించిందట! ఈ శాస్తవ్రేత్తలు దోషులు అయినట్టయితే ఇది శిక్ష కాజాలదు! ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా వారిపై ‘్ఫర్యాదు పత్రాలను’ దాఖలు చేసి న్యాయస్థానాలలో విచారించాలి. వారు నిర్దోషులైనట్టయితే ఇలా వారిని పదవులనుంచి దూరం చేయడం అన్యాయం అవుతుంది! అందువల్ల ప్రభుత్వం తీసుకున్న చర్య ‘కుంభకోణం’ వాస్తవాలకు అనుగుణంగా లేదన్నది సుస్పష్టం. ఈ శాస్తవ్రేత్తలు నేరస్థులని ధృవపరచడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయా లేదా అన్న విషయం ప్రభుత్వం వెల్లడించి ఉండాలి. అధికారులు మాత్రమే అవినీతి కుంభకోణాలను అమలు జరపడం అసంభవమైన విషయం. దేశంలోని అన్ని రకాల అవినీతి పనులకు అసలు సూత్రధారులు రాజకీయవేత్తలు. వారిని నడిపిస్తున్న ఘరానా వాణిజ్య పారిశ్రామిక వేత్తలు! మరి ఈ ‘అంతరిక్ష’ కుంభకోణంలో రాజకీయ భామికను నిర్వహించిన ప్రముఖులెవరు? మంత్రులెవరు? పదకొండు నెలల దర్యాప్తు తర్వాత కూడా ఈ సంగతి ఎందుకని నిర్ధారణ కాలేదు? ‘ఇస్రో’ ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలోని ‘అంతరిక్ష పరిశోధనా మంత్రిత్వ విభాగా’నికి చెందినది.
‘ఇస్రో’వారి వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తున్న సంస్థ పేరు ‘అంట్రిక్స్’ కార్పొరేషన్ లిమిటెడ్. ‘అంట్రిక్స్’ నిర్వాహకులకు, ‘దేవాస్’కు మధ్యనే ప్రధానంగా చర్చలు, అవగాహనలు, అంగీకారాలు, ముడుపులు చేతులు మారడాలు వంటివి జరిగిపోయి ఉండవచ్చు. ‘ఆంట్రిక్స్’ ఇస్రో శాస్తవ్రేత్తలను తప్పుదారి పట్టించిన ప్రహసనంలో ప్రధానమంత్రి కార్యాలయం నిర్వాహకుల పాత్ర ఎంతన్నది ఇప్పటికీ బహిర్గతం కాని రహస్యం. ఫిబ్రవరిలో ‘కుంభకోణం’ పుటపుటలుగా బయటపడిన సమయంలోను, ఆతరువాత చిటపటలుగా రగిలిన సమయంలోను కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన స్పష్టీకరణ ఒక్కటే! ‘‘ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు..’’ అన్నది ఆ అధికారిక వివరణ!! మరి నష్టం వాటిల్లినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వారు ఇప్పుడైనా నిగ్గు తేల్చారా? తేల్చివుంటే ఎందుకని వెల్లడించడం లేదు? నష్టం వాటిల్లలేదని ప్రధాని కార్యాలయం వారు ఇప్పటికీ భావిస్తున్న పక్షంలో గత పదకొండు నెలలుగా జరిపిన అనేక చర్చలు అర్థంలేనివైపోతాయి. మాథవన్ నాయర్ ప్రభుత్వంపై మండిపడటానికి ఈ ‘తీరని సందేహం’ ప్రధాన ప్రాతిపదిక కావచ్చు. నష్టం జరుగలేదని ప్రధాని కార్యాలయం ప్రకటిస్తుండిన తరుణంలోనే, గత ఫిబ్రవరిలోనే ‘అంట్రిక్స్’ను ప్రక్షాళనం చేస్తున్నట్టు, పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు ప్రభుత్వం వారు ప్రకటించారు. ‘ఆంట్రిక్స్’వారు ‘దేవాస్’ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి అధ్యక్షతనగల ‘్భద్రతావ్యవహారాల ఉపసంఘం’-సిసిఎస్- నిర్ధారణ ప్రాతిపదికగా ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే ‘ఒప్పందాన్ని’ రద్దు చేసింది. ఈ రెండు చర్యలవల్ల, అక్రమాలు భారీ ఎత్తున జరిగిపోయినట్టు,ధ్రువపడినట్టేకదా! మరి అక్రమాల వల్ల ప్రజా సొమ్మును ఎవరెవరు ఎంత బొక్కారో ఎందుకని తేల్చలేదు? ‘దేవాస్’ నిర్వాహకులను ప్రభుత్వం ఏవిధంగా శిక్షించింది? 2005నుంచి ఐదున్నర ఏళ్ళపాటు ఆ సంస్థ కాజేసిన ప్రజా ధనాన్ని రాబట్టడానికి మార్గం ఏమిటి? ఇవన్నీ తేల్చకుండా నలుగురు శాస్తవ్రేత్తలకు శాశ్వత పదవీ వియోగం కల్పించడం వల్ల ‘దిద్దుబాటు’ జరిగిపోయినట్టేనా??
‘రాజకీయ వాణిజ్య అక్రమ బంధం’ గురించి ప్రజలకు స్పష్టమైన సమాచారం వెల్లడి కాకుండా ఆటంకాలు ఏర్పడడం సమాచార సాంకేతిక రంగంలో ‘విప్లవాత్మక’మైన మార్పులు వచ్చినందువల్ల సంభవించిన విపరిణామం! ‘స్పేస్ స్పెక్ట్రమ్ సెగ్‌మెంట్’పై ‘దేవాస్’ సంస్థకు ఇరవై ఏళ్ళపాటు గుత్త్ధాపత్యం లభించడం 2005లో కుదిరిన ఒప్పందానికి చెందిన ప్రధానమైన అక్రమం. సంస్థల మధ్య పోటీని నిర్వహించకుండా, కనీసం టెండర్లను కూడా పిలవకుండా ‘దేవాస్’ను ఎంపిక చేయడం ప్రక్రియకు చెందిన వైపరీత్యం. ఫలితంగా ‘ఇస్రో’వారి రెండు ఉపగ్రహాలను ‘దేవాస్’ కంపెనీవారు ‘గంపగుత్తగా’ 2011 వరకు వాడుకోగలిగారు. ఇలా అక్రమంగా వాణిజ్య కలాపాలకోసం ‘దేవాస్’ వారు రెండు ఉపగ్రహాలను ఆరేళ్ళు ఉపయోగించినందువల్ల ఎంత లాభం పొందారు? ‘దేవాస్’ వారు గత ఫిబ్రవరిలో చెప్పిన కథ ప్రకారం ప్రభుత్వం కాని, ‘ఇస్రో’ కాని ఆ సంస్థకు ఎలాంటి ‘స్పెక్ట్రమ్’ను కేటాయించలేదట! మరి ‘దేవాస్’ సంస్థ సమాచార వ్యవస్థ ఎలా నడిచింది? ‘ఆంట్రిక్స్’ నుండి అద్దెకు తీసుకున్న ఉపగ్రహాలద్వారా తాము సేవలు అందించినట్టు దేవాస్ వారు గత ఫిబ్రవరిలో చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి ‘అద్దె’ అంగీకారం కుదిరినట్టు ప్రధాని కార్యాలయం వారికి గత ఫిబ్రవరి వరకు తెలియదట! తెలియ జెప్పని వారు ఎవరు? తెలియనట్టు అభినయించిన వారెవ్వరు? ‘ఇస్రో’ వారు దేవాస్ అప్పచెప్పిన రెండు ఉపగ్రహాలు ఏవన్న సంగతి కూడా ఇప్పటికీ స్పష్టంగా వెల్లడించలేదు! ‘జిసాట్-6’ ఉపగ్రహాన్ని తాము ఉపయోగించుకునే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కూడా ‘దేవాస్’ ప్రచారం చేసింది. ‘ఆంట్రిక్స్’ నుండి అద్దెకు తీసుకున్న రెండు ఉపగ్రహాలలో ‘జిసాట్-6’ ఒకటా? కాదా? అన్న విషయమై ప్రభుత్వం కాని, ‘ఇస్రో’ కాని నోరు మెదపలేదు! మొత్తం కుంభకోణానికి నలుగురు శాస్తవ్రేత్తలు మాత్రమే బాధ్యులన్న బ్రాంతిని కల్పించడం ద్వారా అసలు ‘సూత్రధారుల’ను రక్షించడానికి ఇలా అనేక ప్రాతిపదికలు ఏర్పడి ఉన్నాయి! ‘అంతరిక్షం’ వలె అవినీతి స్థాయి కూడా అంతుపట్టడంలేదు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి