31, జనవరి 2012, మంగళవారం

వైవిధ్య విరోధం!

వైవిధ్య విరోధం!.January 25th, 2012
రాజస్థాన్ రాజధాని జయపూర్‌లో జరుగుతున్న సాహిత్య సమ్మేళనం- లిటరరీ ఫెస్టివల్- ఇంతగా రచ్చకెక్కుతుందని నిర్వాహకులు ఊహించి ఉండరు. సల్మాన్ రష్దీని సమావేశాలకు రాకుండా నిరోధించడం ద్వారా మన ప్రభుత్వాలు ‘జయపూర్ రచనల పండుగ’కు మరింత ప్రసిద్ధిని కలిగించాయి! ‘పండుగ’ గురించి అనేక రోజులు ముందుగా నిర్వాహకులు ప్రచారం చేసినప్పటికీ కేవలం సాహిత్యవేత్తలకు మాత్రమే ‘్ధ్యస’ పరిమితమైపోయింది. కానీ సల్మాన్ రష్దీ వంటి ప్రముఖ రచయిత మన దేశానికి రాకుండా నిరోధించడానికి పథకం రచించిన రాజస్థాన్ ప్రభుత్వం సామాన్యులకు సైతం ఈ అంతర్జాతీయ ఉత్సవం గురించి తెలియజెప్పింది. అంతకుమించి, మతోన్మాదం ముందు మోకరిల్లే మనఃప్రవృత్తిని, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమైన స్వభావాన్ని రాజస్థాన్ ప్రభుత్వ నిర్వాహకులు బట్టబయలు చేసుకున్నారు! సల్మాన్ రష్దీ జయపూర్ సమావేశాలకు హాజరయి ఉంటే ఆయన సాహిత్య విశేషాలను ప్రతినిధులు విని ఉండేవారు. ఆయన రాకుండా చేయడం ద్వారా ప్రపంచమంతా మరోసారి రష్దీ రచనల గురించి వినే అవకాశాన్ని రాజస్థాన్ ప్రభుత్వం కల్పించింది! ఒకరు కాదు, నలుగురు ప్రసిద్ధ సాహితీవేత్తలు రష్దీ రచించిన ‘సాతానిక్ వర్సెస్’నుంచి అనేక పంక్తులను జయపూర్ సభా వేదిక నుంచి ప్రపంచానికి వినిపించారు! సాహిత్య సమావేశాన్ని రాజకీయాలకు దూరంగా వుంచి వైవిధ్యాలను, రక్షించాల్సిన ప్రజాస్వామ్య ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంది! ఇంత జరిగిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నోరు విప్పకపోవడం అంతర్జాతీయ సమాజంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత అవమానం కల్గించిన విపరిణామం! అతిగా ప్రతిస్పందించడం - ఎర్రర్ ఆఫ్ కమిషన్- ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం, అసలు స్పందించకపోవడం- ఎర్రర్ ఆఫ్ ఒమిషన్- ద్వారా కేంద్ర ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం పరువు తీశాయి. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని భారతీయ సామాజిక స్వభావం పట్ల వివిధ దేశాల రచయితలకున్న విశాసాన్ని వమ్ముచేశాయి! జయపూర్ సాహిత్య మహోత్సవ ఇతివృత్తం ‘వైవిధ్యం’!బ్రిటన్‌లోని ‘ఎడిన్‌బరో’ వంటి చోట్ల జరిగే సాహితీ సమ్మేళనాలలో ఒకే సంకుచిత ఇతివృత్తం ప్రాతిపదికగా చర్చలు, గోష్ఠులు, ప్రసంగాలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, జయపూర్ వేదికపై అనేకానేక సాహితీ వైవిధ్యాలు సభలో తీరనున్నాయని నిర్వాహకులు ప్రకటించారు! ఇలా ‘వైవిధ్యం’ ఇతివృత్తం కావడం మన జాతీయ స్వభావానికి అనురూపమైన అంశం! అందరి భావాలకు సమానమైన ప్రతిపత్తిని, అందరి ఆకాంక్షలకు సమానమైన అవకాశాన్ని ప్రసాదిస్తున్న సువ్యవస్థిత ప్రజాస్వామ్య రాజ్యాంగ సమాజం మనది! సల్మాన్ రష్దీ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఆయన జయపూర్‌కు రాకూడదన్న వాదాన్ని వినిపించిన రాజస్థాన్ ప్రభుత్వం మన భద్రతా పటిమను పరువును అంతర్జాతీయంగా అపహాస్యంపాలు చేసింది! ఒక రచయితను మతోన్మాదులు హత్య చేయకుండా నిరోధించలేని స్థితిలో చతికిలపడి వున్నదా మన భద్రతా దళాల పాటవం?
రష్దీ ఇరాన్‌లోని ఇస్లాం వ్ఢ్యల ఆగ్రహానికి గురికావడానికీ అతడు మన దేశాన్ని సందర్శించడానికి మధ్య లంకె పెట్టడం బోడిగుండుకు రుబ్బురోలుకు ముడిపెట్టడం వంటిది. కానీ రష్దీని మన దేశంలోని ముస్లింలు సైతం వ్యతిరేకిస్తున్నారన్న భ్రమకు గురైన రాజకీయవేత్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుండడం ఈ వైపరీత్యానికి కారణం! రష్దీని రానిచ్చినట్టయితే తమ రాజకీయ పార్టీలకు ముస్లింలు దూరమైపోతారన్న భయ విభ్రాంతికి లోనైనవారు మన దేశంలో ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. అందువల్ల ‘పాము చావని కర్ర విరగని’ నీతిని రాజస్థాన్ ప్రభుత్వం కూడ అవలంబించింది. అందువల్ల ముంబయికి చెందిన ముగ్గురు కిరాయి హంతకులు రష్దీని చంపడానికి కుట్ర పన్నినట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రచారం చేసింది. మరి హంతకుల పేర్లు చిరునామాలు స్పష్టంగా తెలిసినప్పుడు వారిని పట్టుకొనడానికి రాజస్థాన్ ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వ నేర నిరోధక బృందాలు కాని ఎందుకని రంగంలోకి దిగలేదు? కథాకథిత హంతకులలో ఇద్దరు ఎవరో ముంబయి పోలీసులకు తెలియదట! ‘అత్లాఫ్ బాట్లీ’, ‘అస్లాం కాంగో’అనీ విచిత్రమైన పేర్లున్న ఇద్దరు కిరాయి హంతకులు కల్పిత పాత్రలు అన్న అనుమానాలను సైతం ముంబాయి పోలీసులు వ్యక్తం చేశారట! మూడవ ‘హంతకుడు’ సాకిబ్ హమీద్ నాచన్ అనే తీవ్రవాది అని పోలీసులు నిర్ధారించారు. 2003నాటి ముంబయి బాంబు పేలుళ్ల ఘటనలో ఈ తీవ్రవాది నిందితుడు. ‘బెయిల్’పొంది బయటపడిన ఈ తీవ్రవాది ముంబయికి సమీపంలోని పద్‌గాంవ్ అన్నచోట నివసిస్తున్నాడట! ఆచూకీ తెలియని వారి సంగతి సరే! పోలీసుల నిఘా వీక్షణాల పరిధిలోనే ఉన్నా ఈ మూడవ బీభత్సకారుడిని పోలీసులు కాని ఇతర భద్రతా దళాలవారు కాని ఎందుకని నిర్బంధించి ప్రశ్నించలేదు? ఈకట్టుకథ గుట్టు రట్టయన తర్వాత కూడా రాజస్థాన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోక పోవడం దురదృష్టకరం. రష్దీ పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ ప్రసారం కాకుండా ఆటం కాలు కల్పించడం ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం మరో సారి అప్రజాస్వామిక చర్యకు ఒడిగట్టింది.
రష్దీ 1980వ దశకంలో రచించిన సాతానిక్ వర్సస్- దెయ్యాల పాటలు- అన్న ఆంగ్ల గ్రంథం ఇరాన్‌లోని మతాధికారి అయెతుల్లా ఖొమైనీ ఆగ్రహానికి గురి అయింది. ఈ పుస్తకం ఇస్లాం మతానికి విరుద్ధంగా ఉండటమే అందుకు కారణం. రష్దీని హత్య చేయాలని అప్పుడు ఖొమైనీ ‘్ఫత్వా’ జారీచేశారట. ఈ ‘్ఫత్వా’ జారీకావడానికి ముందుగానే మన దేశంలో కేంద్ర ప్రభుత్వంవారు ఆ గ్రంథాన్ని నిషేధించారు! ఇప్పుడు దాదాపు పాతికేళ్ల తరువాత, ఆ నిషేధం సంగతి కూడా ఎవరికీ గుర్తులేదు. ఇలా గుర్తులేకపోవడం వల్లనే నిషిద్ధ గ్రంథంలోని విపంక్తులను తాము ఉటంకించినట్టు నలుగురు రచయితలూ చెబుతున్నారు! రాజస్థాన్ ప్రభుత్వం వారిపై కేసులు పెడుతుందట! మన దేశం ఒకే మతం తప్ప, మిగిలిన మతాలు పరిఢవిల్లడానికి వీలులేని మత రాజ్యం కాదు. ఇస్లాం మత ప్రభుత్వాలున్న దేశాలన్నింటిలోను ఈ గ్రంథాన్ని నిషేధించవచ్చుగాక! కానీ కొన్ని టర్కీ, ఇండోనేసియా వంటి ముస్లిం జన బాహుళ్యం కల దేశాలలో ఈ పుస్తకాన్ని నిషేధించలేదు! కానీ వివిధ మతాల గురించి వ్యతిరేకంగా రచయితలు కవులు వ్యక్తంచేసే అభిప్రాయాలను నిరోధించడం నిషేధించడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగకరం. ఈ రాజ్యాంగపు హక్కు లేని దేశాలలోవలె మన దేశంలోను గ్రంథాలను నిషేధించడం సిగ్గుచేటు! జమ్మూకాశ్మీర్ మన దేశంలో భాగంకాదని బహిరంగ నివేదికల్ని ఆర్భాటిస్తున్న విద్రోహకులను అరెస్ట్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని సాహసించడం లేదు. ఛత్రపతి శివాజీని నీచంగా కించపరుస్తూ రూపొందిన పుస్తకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పుడు పెద్ద దుమారం చెలరేగింది! తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్దీ వంటి వారిని మన ప్రభుత్వాలు వెళ్ళగొడుతున్నాయి. కానీ భరతమాతను సైతం నగ్నంగా చిత్రీకరించిన ఎమ్‌ఎఫ్ హుస్సేన్ వంటి బౌద్ధిక బీభత్సకారులను మాత్రం అధికార రాజకీయ వేత్తలు ప్రశంసించారు!! వైవిధ్య సమాజానికి రక్షణ ఏదీ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి