26, డిసెంబర్ 2011, సోమవారం

నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’

నల్లడబ్బుపై ‘తెల్లకాగితం’.December 15th, 2011
దేశ విదేశాల్లోని నల్లడబ్బును వెలికి తీసే కార్యక్రమం నత్తనడక నడుస్తోందన్న వాస్తవానికి గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలు మరో నిదర్శనం. స్విట్జర్లాండ్ తదితర దేశాలలో భారతీయ సంపన్నులు, పన్నులు ఎగవేసి దాచిన అక్రమ సంపదను బయటికి తీయడంలో జరుగుతున్న ‘ప్రగతి’ గురించి ఈ ఏడాది జనవరిలో చెప్పిన మాటలనే ప్రభుత్వం గురువారం లోక్‌సభలో చెప్పింది. ‘నల్లడబ్బు గురించి విదేశీయ ప్రభుత్వాలు సమకూర్చిన సమాచారాన్ని వెల్లడించడానికి వీలుకాదు..’ అన్న మాటను ప్రభుత్వం గత జనవరిలో చెప్పింది. సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇప్పుడు లోక్‌సభకు నివేదించింది. వెల్లడించడానికి వీలుగా విదేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనడానికై ఈ పదకొండు నెలలుగా ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతిపక్షాలు సైతం పార్లమెంటులో గర్జించి, గాండ్రించి, ఘీంకరించడం మినహా విదేశాలలోని నల్లడబ్బును వెలికి తీయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికై ప్రజలను చైతన్య పరచిన జాడలేదు. జర్మనీ బ్యాంకులో నల్లడబ్బు దాచిన వివరాలు ప్రభుత్వానికి లభించి సంవత్సరం దాటినా వాటిని ప్రజలకు చెప్పలేదు. ‘దేశాన్ని దోపిడీ చేసిన వారి వివరాలు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు?’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వం వారిని ప్రశ్నించి పదకొండు నెలలయింది. సమాధానం లేదు. అప్పుడు చెప్పిన మాటలనే గురువారం ప్రభుత్వం మళ్ళీ చెప్పింది. ‘‘నల్లడబ్బునకు సంబంధించి ముప్పయి ఆరువేల ‘వివరణ పత్రాలు’ విదేశాలనుంచి ప్రభుత్వానికి అందాయి. కానీ ఈ సమాచారాన్ని ప్రచురించినట్టయితే మనదేశం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఏదో ఒక దేశం ఆరోపిస్తుంది. భవిష్యత్తులో ఆయా దేశాలు మనకు సమాచారం ఇవ్వవు. మన ‘వనరులు’ ఎండిపోతాయి!’’ అని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అంటున్నారు. ప్రజలకు వెల్లడి చేయడానికి అడ్డువస్తున్న ఒప్పందాలను సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు గత జనవరిలో చెప్పిన ప్రభుత్వం పదకొండు నెలలో ఈ దిశగా సాధించింది కూడా మరో ‘గుండు సున్న’! విదేశాలలోని బ్యాంకులలో ఇరవై అయిదు లక్షలకోట్ల రూపాయల మేరకు భారతీయుల ‘మురికి డబ్బు’ మూలుగుతోందన్నది భారతీయ జనతాపార్టీ అధినేత లాల్‌కృష్ణ అద్వానీ సేకరించిన సరికొత్త సమాచారం. ప్రణబ్ ముఖర్జీ ఇందుకు ‘దీటుగా’ మరికొంత సమాచారం బయటపెట్టారు. స్విస్ బ్యాంకులలోనే తొంభయి ఐదు లక్షలకోట్ల రూపాయల నల్లడబ్బు నక్కి ఉందన్నది ఆయనకు తెలిసిన సమాచారం. అంటే అద్వానీకి తెలిసింది చాలా తక్కువన్నమాట! అయితే ఈ స్విస్ బ్యాకుల నల్లడబ్బులో మన వాటా ఎంత అనేది ముఖర్జీకి తెలియదు! నల్లడబ్బుపై ఒక ‘తెల్లపత్రాన్ని’ మాత్రం ప్రభుత్వం రూపొందించి విడుదల చేస్తుందట! నల్లడబ్బు దాచిన వారి పేర్లు బయట పెట్టలేనప్పుడు దీని వల్ల ఒరిగేదేమిటి?
మన ప్రభుత్వం ఎనభయి రెండు దేశాలతో సమాచార వినిమయానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ముఖర్జీ గురువారం వెల్లడించారు. దాదాపు ఇదే సంగతిని ఆయన గత జనవరిలో కూడా చెప్పివున్నారు. అరవై అయిదు దేశాలతో ఈ ఒప్పందాలు కుదిరిపోయినట్టు మరో పదిహేడు దేశాలతో కుదుర్చుకోనున్నట్టు ఆయన జనవరిలో వెల్లడించారు. ఈ ఒప్పందాలు రెండు ప్రధాన అంశాలకు సంబంధించినవి. ఆదాయంపై రెండుసార్లు పన్ను విధించడాన్ని నిరోధించే ఒప్పందం మొదటిది. ఆదాయం పన్నుల వివరాల వినిమయానికి సంబంధించిన ఒప్పందం రెండవది. ఈ ఒప్పందాల ప్రకారం మన ప్రభుత్వానికి ఆయా ప్రభుత్వాలు తమ దేశాల బ్యాంకులలో ఉన్న మనవారి ఖాతాల వివరాలను అందజేస్తున్నాయట! కానీ ఈ వివరాలను మన ప్రభుత్వం వెల్లడి చేయరాదట. ఇంక ఎందుకీ ఒప్పందాలు? జర్మనీలోని ‘లీటిన్ స్టీన్’ బ్యాంకులో నల్లడబ్బు దాచిన ఇరవై ఆరుమంది వివరాలు గత డిసెంబరులోనే ప్రభుత్వానికి అందాయి. ఈ పేర్లను మూసి ఉంచిన ‘కవర్’లో పెట్టి ప్రభుత్వం జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదించింది. కానీ ఈ రెండు ఒప్పందాల కారణంగా ఈ నల్ల ఘరానాల పేర్లను వెల్లడించడానికి వీలుకాదని, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణ మొదలై ఈ నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేసిన తరువాత వారెవరో వెల్లడి అయిపోతుందని ప్రభుత్వం అప్పుడు చెప్పింది. మరి ఆ నిందితులను విచారించారా? ‘సిబిఐ’ వారు కానీ ఆదాయం పన్ను విభాగం వారి ‘కార్యాచరణ బృందం’వారుకానీ వారిని అదుపులోకి తీసుకున్నారా? అలా జరిగి ఉంటే వారిని న్యాయస్థానాల ఎదుట హాజరుపరచి ఉండాలి! ఏ న్యాయస్థానం ఎదుట హాజరు పరచారు? వారిని ‘జైలు’లోనే నిర్బంధించి ఉంచారా? లేక ‘బెయిలు’పై విడుదల చేశారా? ఈ ప్రశ్నలు, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలను ప్రతిపక్షాలవారు పార్లమెంటులో అడగలేదు. మంత్రి సమాధానం చెప్పలేదు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, నిందించుకొనడంతోనే సరిపోయింది. వాయిదా తీర్మానం వీగిపోయింది!
జర్మనీ బ్యాంకులో డబ్బు దాచినవారపై కోర్టుల్లో విచారణ ఎప్పుడు మొదలవుతుంతో ప్రజలకు తెలియవలసి వుంది. నల్లడబ్బును విదేశాలనుండి రప్పించడానికి, దాచినవారిని బహిరంగంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి వీలుగా, సంబంధిత ఒప్పందాలను సవరించడానికి మన ప్రభుత్వం చేయనున్న ప్రయత్నాల గురించి, అవలంబించే విధానం గురించి వివరాలు వెల్లడి కావలసి ఉంది. అమెరికా ప్రభుత్వం, ఐరోపా దేశాల ప్రభుత్వాలు స్విట్జర్లాండ్‌లోని కొన్ని బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకొనడం ద్వారా తమ దేశాలకు సంబంధించిన నల్లధనం కామందులను పట్టుకోగలిగాయి. ఈ దేశాలకు ఆయా బ్యాంకులతో కుదిరిన ఒప్పందాల గురించి మన ప్రభుత్వమే ధ్రువీకరించింది. మరి మన ప్రభుత్వం ఆయా బ్యాంకులతో నేరుగా ఎందుకని ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదు? వ్యక్తుల వివరాలు వెల్లడి చేయడానికి స్విట్జర్లాండ్‌లోని మరికొన్ని బ్యాంకులు సిద్ధంగా లేవు. అలాంటి బ్యాంకులతో ఐరోపా దేశాలు, ఇతర దేశాలు మరోరకం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నిజానికి ఇది స్విట్జర్లాండ్ బ్యాంకులకు, ఆ దేశ ప్రభుత్వానికి, ఇతర దేశాలకు మధ్య కుదిరిన త్రైపాక్షిక అంగీకారం! 2005 నుండీ ఐరోపా దేశాలకు ఇలాంటి ఒప్పందం వల్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచిన విదేశీయుల పేర్లు మాత్రమే వెల్లడికావు. కానీ రహస్య ఖాతాలలోని నల్లధనంపై వచ్చే వడ్డీలో డెబ్బయి ఐదుశాతాన్ని బ్యాంకులవారు ఆయా దేశాల ప్రభుత్వాలకు చెల్లిస్తారు. వడ్డీలో ఇరవై ఐదుశాతం మాత్రం నల్లధనం దాచిన ఘరానా ఖాతాదార్లకు లభిస్తోంది. తేలుకుట్టిన దొంగవలె నల్లధనం ఖాతాదారలు నోరుమూసుకొని ఉన్నారు. వారు ఈ ఖాతాలలోని ‘అసలు’ను ఉపసంహరించుకోలేరు. అలా ఉపసంహరించుకున్న వారి పేర్లను స్విడ్జర్లాండ్ బ్యాంకులు వెల్లడిస్తాయి. అందువల్ల ఈ నల్లధనంలో డెబ్బయి ఐదుశాతం ఆయా దేశాల ప్రభుత్వాలకు మూలధనంగా మారింది. శాశ్వతంగా వడ్డీలోని మూడు వంతులు ఆయా దేశాల ప్రజలకు దక్కుతోంది. ఇలాంటి ఒప్పందాన్ని సైతం మన ప్రభుత్వం ఇంతవరకు కుదుర్చుకోలేదు! కుదుర్చుకున్నట్టయితే వడ్డీ విలువ ఎన్నివేలకోట్లన్నది తెలుస్తుంది. తద్వారా నల్లడబ్బు మొత్తం విలువ నిర్ధారించవచ్చు! కానీ ప్రభుత్వం కదలదు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి