26, డిసెంబర్ 2011, సోమవారం

చైనా భయం!.

చైనా భయం!.December 1st, 2011
చైనా ప్రభుత్వ వ్యూహాత్మక దురాక్రమణ స్వభావానికి ఇది మరో నిదర్శనం మాత్రమే! గత మూడేళ్లలో ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్లీ మళ్లీ గిల్లడం ద్వారా మన ప్రతిక్రియ స్థాయిని, తీవ్రతను అంచనా వేయడానికి చైనా ప్రభుత్వం ఈ వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తోంది. పదిహేనవసారి జరుగవలసి ఉండిన ‘సరిహద్దు వివాదం’ చర్చలను ఏకపక్షంగా వాయిదావేయడం ద్వారా చైనా ప్రభుత్వం మన ప్రతిస్పందనకు మరో పరీక్షను పెట్టింది. చర్చలు జరిగే సమయంలోనే ఢిల్లీలో జరిగే ‘బౌద్ధమహాసభ’లో టిబెట్ ప్రజానాయకుడు ధార్మిక నేత దలైలామా ప్రసంగించడం సాకుగా చైనా ప్రభుత్వం చర్చలను వాయిదా వేసింది. ఇలా బౌద్ధ మత మహాసభను సరిహద్దు సమస్యతో ముడిపెట్టడం రుబ్బురోలును బోడిగుండుతో జత చేర్చడం వంటిది. దలైలామాను ఢిల్లీ సభలో పాల్గొనడానికి అనుమతించరాదని, అలా అనుమతించినట్టయితే సభ జరుగుతున్న సమయంలో జరిగే సరిహద్దు సంభాషణలను వాయిదా వేయవలసి వస్తుందని చైనా ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు, బెదిరించలేదు. ఈ హెచ్చరికను, బెదిరింపును మన ప్రభుత్వం ఖాతరు చేయడానికి కాని చేయకపోవడానికి కాని అవకాశం ఇవ్వలేదు. హఠాత్తుగా అర్ధాంతరంగా చర్చలను వాయిదావేసిన తరువాత చైనా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ అధీనంలోని ప్రచార మాధ్యమాలవారు, మన దేశంలోని చైనా ‘మిత్రులు’ కారణాన్ని కనిపెట్టారు. దలైలామా ఢిల్లీకి వస్తున్నాడు కాబట్టి చర్చలు జరగరాదట. ఉభయ ప్రభుత్వాల ప్రత్యేక ప్రతినిధులు చర్చలు జరిపే ప్రాంగణంలోకి టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులు దూసుకొని వచ్చి ‘రక్తపాతాన్ని’ లేదా ‘బీభత్సకాండ’ను సృష్టించగలరన్నట్టు చైనా ప్రభుత్వ ప్రతినిధులు భయాందోళనలను అభినయించడం మన దేశాన్ని ఒకవైపు, టిబెట్ ఉద్యమకారులను మరో వైపు అంతర్జాతీయంగా అప్రతిష్ఠపాలు చేయడంలో భాగం. టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులు మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని వంద దేశాలలో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా దశాబ్దుల తరబడి నిరసన ప్రదర్శనలను జరుపుతూనే ఉన్నారు. 1959 నుండి తమ దేశాన్ని దురాక్రమించుకొని ఉన్న చైనా నుండి తమ దేశానికి విముక్తిని కల్పించడమే ఈ ప్రవాస టిబెట్ ప్రజల లక్ష్యం. కానీ ఈ ఉద్యమం నిరంతరం సంపూర్ణ అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్య రీతిలో కొనసాగుతోంది. అందువల్ల ఢిల్లీ చర్చల సందర్భంగా తమ ప్రతినిధిని కాని తమ దేశానికి చెందిన ఇతరులను కాని టిబెట్ ఉద్యమవాదులు కొట్టి గాయపరుస్తారని చైనా ప్రభుత్వం భయపడవలసిన పని లేదు. అంతేకాక బౌద్ధమత సదస్సు కేవలం టిబెట్ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు. అనేక దేశాలలో బౌద్ధులు జీవిస్తున్నారు, బౌద్ధమతం ఉంది. ఇలా బౌద్ధ సదస్సుకు, టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమంతోను, ఈ రెండింటినీ, సరిహద్దు చర్చలతోను ముడిపెట్టడం మన ప్రతిస్పందనకు మాటిమాటికీ పరీక్ష పెట్టే చైనా వ్యూహంలో భాగం మాత్రమే!
తమ మనోభావాలను గ్రహించి దలైలామాను ఢిల్లీ సదస్సుకు దూరంగా ఉంచుతుందని చైనా పాలకులు భావించడం దురహంకార దురాక్రమణ ప్రవృత్తికి నిదర్శనం. వివిధ వర్ధమాన దేశాలను పరోక్షంగా, ప్రత్యక్షంగా బెదిరించడం ద్వారా దలైలామా ఆయా దేశాలలో అడుగుపెట్టకుండా చైనా కమ్యూనిస్టు నియంతలు నిరోధించగలగడం నడుస్తున్న చరిత్ర. చివరికి ప్రజాస్వామ్య రష్యా ప్రభుత్వం సైతం చైనా అనుకూల దౌత్య రాగాలాపనకు దిగజారడం ఇటీవలి పరిణామం. ఐరోపాలోని కొన్ని దేశాలు, అమెరికా తప్ప మిగిలిన అనేక దేశాలు చైనాకు భయపడి దలైలామాను తమ దేశాలకు ఆహ్వానించడం లేదు. ‘మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి సామరస్య పురస్కారాన్ని’ స్వీకరించడంకోసం గత అక్టోబర్‌లో దలైలామా దక్షిణ ఆఫ్రికాకు వెళ్లవలసి ఉండినది. కానీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆయనకు ఆయన బృందంలోని సభ్యులకు ప్రవేశ అనుమతి పత్రం- వీసా జారీచేయడానికి నిరాకరించింది. అందువల్ల దలైలామా తను పర్యటనను రద్దుచేసుకోవలసి వచ్చింది. దలైలామాను ప్రభుత్వ అధినేతలు కలుసుకొన్నప్పుడల్లా చైనా ప్రభుత్వం తీవ్ర స్వరంతో నిరసిస్తూనే ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలాయ్ సర్కోజీ 2008లో దలైలామాను పోలెండులో కలుసుకున్నాడు. ఆ తరువాత 2009లో తమ దేశానికి పిలిపించి, చర్చలు జరిపాడు. ఈ రెండు సందర్భాలలోను చైనా ప్రభుత్వం ఫ్రాన్స్ అధ్యక్షుడిని తీవ్రమైన పదజాలంతో నిందించింది, ఫ్రాన్స్‌తో దాదాపు తెగతెంపులు చేసుకొంది. అందువల్ల ఆసియా ఆఫ్రికా దేశాలు క్రమంగా దలైలామాను దూరంగా ఉంచుతున్నాయి. బౌద్ధ సదస్సు ఉభయ దేశాల సరిహద్దు సమస్యతో ఎలాంటి సంబంధం లేని విషయం కనుక మన ప్రభుత్వానికి చైనా బెదిరింపు ధ్యాస కూడా కలగలేదు. సరిహద్దు చర్చలు, ఢిల్లీలో బౌద్ధుల సమావేశం ఒకే సమయంలో ఏర్పాటుకావడం కాకతాళీయమైన పరిణామమన్న మన ప్రభుత్వ వాదాన్ని చైనా తోసిపుచ్చుతోంది. పనిగట్టుకొని మన ప్రభుత్వం ఈ రెండింటినీ ఒకేసారి ఏర్పాటుచేయించినట్టు చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఉభయ దేశాల మధ్య వివాదాస్పదమై ఉన్న సరిహద్దు ప్రాంతాలు మన దలైలామా నోట చెప్పించడమే ఈ ‘ఏర్పాటు’లోని మన ప్రభు త్వ లక్ష్యమని చైనా ఆరోపించింది.
దలైలామాను ఢిల్లీ సదస్సులో ప్రసంగించడానికి అనుమతి ఇచ్చినట్టయితే ‘‘ఏదో జరిగిపోతుందని’’ బెదిరించింది. ఈ బెదిరింపును మన ప్రభుత్వం ఖాతరుచేయదని చైనా పాలకులకు తెలుసు. ఇలా ‘ఖాతరు’ చేయడం ఆరంభించినట్టయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల నుండి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని తొలగించమని కోరే స్థాయికి చైనా తెగబడగలదు. సరిహద్దు వివాదం పరిష్కారం కావడం చైనా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే, ఈ వివాదం పరిష్కారం అయితే లడక్‌లో ఆక్రమించిన మన భూమిని చైనా ప్రభుత్వం మన దేశానికి అప్పగించవలసి వస్తుంది, అరుణాచల్‌ప్రదేశ్‌లోని అధిక భాగం తమదన్న మొండి వాదాన్ని విడనాడవలసి వస్తుంది. అందువల్ల 1990వ దశకం నుండీ కూడ మనతో చర్చలు జరుపుతున్నప్పటికీ చైనా ప్రభుత్వం సరిహద్దు వివాదాన్ని నిరవధికంగా సాగతీస్తూనే ఉంది. ఇలా సాగదీయడానికి ఏ కుంటిసాకు దొరికినా చాలు మరి! ఇప్పుడు దొరికిన అవకాశం ఢిల్లీ బౌద్ధ సమావేశం. ఢిల్లీ సమావేశంలో దలైలామా ధార్మిక ప్రసంగం చేసిన వెంటనే టిబెట్ తమ దేశంనుండి విముక్తమైపోతుందన్న స్థాయిలో చైనా ప్రభుత్వం ఎందుకని ఆర్భాటం చేస్తోంది? డెబ్బయి ఆరేళ్ల దలైలామా నిజానికి ఇప్పుడు టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నారు. తమ దేశానికి స్వాతంత్య్రం అక్కరలేదని, చైనాలో ‘సాంస్కృతిక ప్రతిపత్తి’ కలిగిన ఒక రాష్ట్రంగా టిబెట్ కొనసాగడమే తమ అభిమతమని దలైలామా గత ఆరేళ్లుగా పదే పదే ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటన ద్వారా దలైలామా చైనా భక్తిని ప్రదర్శించినట్టయింది. ఫలితంగా ఆయన ప్రధాన ఉద్యమ స్రవంతి నుండి విడిపోయాడు. దలైలామాతో నిమిత్తం లేకుండా టిబెట్ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమం దేశ విదేశాలలో రాజుకుంటుండడం వర్తమాన వాస్తవం. బీజింగ్ ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా వివిధ దేశాలలో వేలాది ఉద్యమకారులు స్వాతంత్య్ర నినాదాలు చేయడం చైనా ప్రభుత్వానికి విస్మయం కలిగించిన పరిణామం. ఈ పరిణామక్రమాన్ని గుర్తించడానికి మాత్రం చైనా ప్రభుత్వం సిద్ధంగాలేదు. అందువల్లనే, సమస్య కాని దలైలామాను అతి ప్రధాన సమస్యగా చిత్రీకరించడం ద్వారా చైనా ప్రభుత్వం అసలు సమస్య కప్పిపుచ్చడానికి యత్నిస్తోంది, ప్రపంచ సమాజం దృష్టిని మళ్లించడానికి కృషిచేస్తోంది. అసలు సమస్య దలైలామా కాదు... దలైలామాతో సంబంధం లేకుండా రాజుకుంటున్న టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమం చిరుమంటలు మహాజ్వాలలుగా మారవచ్చునన్న భయం చైనా నియంతల ‘చిందుల’కు అసలు కారణం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి