26, డిసెంబర్ 2011, సోమవారం

కోర్టుకెక్కిన కృష్ణ

కోర్టుకెక్కిన కృష్ణ.December 10th, 2011
పదవికి రాజీనామా చేయకపోవడం ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ మరో అసమంజసమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ దుష్ట సంప్రదాయం వ్యవస్థీకృతమయినట్టయితే న్యాయస్థానాల్లో తమకు వ్యతిరేకంగా ‘్ఫర్యాదుపత్రం’-ఎఫ్‌ఐఆర్- దాఖలయినప్పటికీ కేంద్రమంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు కానీ తమ పదవులకు రాజీనామా చేయనక్కరలేదు. ఎస్‌ఎం కృష్ణ తమ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు యథావిధిగా గందరగోళం సృష్టించారు. సభలు వాయిదా పడడం మినహా వారు సాధించింది లేదు. కృష్ణ పదవిని వదిలిపెట్టలేదు. కర్నాటకలోని లోకాయుక్త న్యాయాలయంలో పోలీసులు దాఖలు చేసిన ‘ఎఫ్‌ఐఆర్’ ప్రాతిపదికగా తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో కృష్ణ అవలంబించిన విధానం కారణంగా ‘ప్రైవేట్ కంపెనీ’ల కామందులు భారీగా ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి వీలు కలిగిందన్నది ప్రధాన ఆరోపణ. 1999, 2004 సంవత్సరాల మధ్య కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండిన కృష్ణ ‘రక్షిత అటవీ భూముల’ను సాధారణ అటవీ భూములుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారట. దీనివల్ల వేలాది ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో ఇనుపఖనిజాన్ని ఇతర ఖనిజాన్ని తోడేయడానికి కార్పొరేట్ వాణిజ్య సంస్థలకు అనుమతి లభించిందని ‘సమాచార’ ఉద్యమకారుడు టిజె అబ్రహం గత నెల 29న లోకాయుక్తకు ఫిర్యాదు దాఖలు చేసాడు. తమకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదులు అందిన వెంటనే పదవులకు మంత్రులు రాజీనామా చేయడం ఒకప్పటి సత్సంప్రదాయం. కృష్ణకంటే ముందు ఇలా మొండికెత్తిన రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు ఉన్నారు. కానీ ఏ రాజా వంటి భారీ కుంభకోణగ్రస్తులు సైతం కోర్టులో ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలయిన వెంటనే రాజీనామా చేసారు. కానీ కృష్ణకు వ్యతిరేకంగా న్యాయ ప్రక్రియ మూడు దశలను దాటింది. ‘ఆర్‌టిఐ’ ఉద్యమకారుడు ఫిర్యాదు చేయడం మొదటి దశ. ఈ ఫిర్యాదు ప్రాతిపదికగా దర్యాప్తు జరుపవలసిందిగా లోకాయుక్త న్యాయస్థానం వారు ఈనెల 3న పోలీసులను ఆదేశించారు. పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. కృష్ణపై వచ్చిన ఆరోపణలు నిజమని విశ్వసించడానికి తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండటం వల్ల మాత్రమే పోలీసులు ఇంతటి సాహస కార్యానికి పూనుకున్నారు. అలాంటి ఆధారాలు లేనట్టయితే లోకాయుక్త, పోలీసులు కాని, ఇతర దర్యాప్తు విభాగాల అధికారులు కానీ ఒక ప్రముఖ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు చేసే దుస్సాహసానికి ఒడిగట్టరు.
గనుల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన విధానాన్ని ఆరంభించింది ఎస్‌ఎం కృష్ణ కాగా ఆతరువాత ముఖ్యమంత్రి పదవులను చేపట్టిన ధరమ్ సింగ్, హెచ్‌డి కుమారస్వామి భారీగా అటవీ భూములను గనుల కామందులకు అప్పగించారన్నది ఫిర్యాదుదారుని ప్రధాన ఆరోపణ. ఎడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో అక్రమంగా గనులను తవ్వడం ప్రభుత్వ నిఘా కన్నుగప్పి ఇనుప ఖనిజాన్ని తరలించడం వంటి కలాపాలు పరాకాష్టకు చేరడం వేరే కథ. అవినీతి మూటల బరువుకు ఎడియూరప్ప మంత్రివర్గం కూలిపోయింది. వేలాది కోట్ల రూపాయలు దోచిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి కటకటాలను లెక్కపెడుతున్నాడు. గాలి జనార్థన రెడ్డిని పట్టుకున్నది సిబిఐ కాగా, ఎడియూరప్ప మాత్రం లోకాయుక్తకే దొరికిపోయాడు. తవ్వినకొద్దీ అవినీతి కుంభకోణాలు బయటపడుతుండటానికి కృష్ణపై కేసు దాఖలు కావడం మరో ఉదాహరణ. ధరమ్‌సింగ్‌కు, కుమారస్వామికి వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘మచ్చ లేని రాజకీయ వేత్త’గా కర్నాటక కాంగ్రెస్ వారు ప్రచారం చేసిన ఎస్‌ఎం కృష్ణ ‘బండారం’ ఇలా బయటపడడమే విస్మయకరం. ఇనుప ఖనిజాన్ని, అభ్రకపు ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట నుంచి మరొక చోటికి తరలించడానికి, రాష్ట్రం సరిహద్దులను దాటించడానికి వీలుగా ప్రైవేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతి పత్రాలను మంజూరు చేసారనేది ధరమ్‌సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదు పత్రంలోని సారాంశం. ఇలా ఇనుప ఖనిజాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా కర్నాటక బయటకి దాటించే ‘కళ’లో ‘బళ్ళారి’ గాలి సోదరులు పేరు మోయడానికి ఈ అక్రమ అనుమతి పత్రాలు కారణం. ‘శ్రీ వేంకటేశ్వర మినరల్స్’, ‘జనతాకల్ మైనింగ్ కార్పొరేషన్’ అన్న వాణిజ్య సంస్థలకు కుమారస్వామి ఐదువందల ఎకరాల సురక్షిత అటవీ ప్రాంతాన్ని అప్పగించాడట. ఈ రెండు ఫిర్యాదు పత్రాలలోని ఆరోపణలతో పోల్చినప్పుడు కృష్ణ చేసిన ‘నేరం’ అంతపెద్దది కాకపోవచ్చు. కానీ ఆయన ప్రారంభించిన ‘విధానమే’ తదుపరి జరిగిన అవినీతి గనుల తవ్వకాలకు ‘ప్రాతిపదిక’ అన్నది ఫిర్యాదిదారుని వాదం. ఈ ముగ్గురి బంధువులు అనేక గనుల తవ్వకాల సంస్థలలోను, ఖనిజ వ్యాపారాలలోను భారీగా పెట్టుబడులు పెట్టారట. కుమారస్వామిపై గతంలో దాఖలయిన మరో ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదు దారుడు ఆషామాషీగా ఆరోపణలను చేశాడని, అందువల్ల అతగాడు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని కూడా హైకోర్టు నిర్ధారించింది.
అందువల్లనే బహుశా కృష్ణ ఇప్పుడు హడావుడిగా హైకోర్టుకెక్కాడు. కుమారస్వామికి లభించినట్టుగా తనకు కూడా హైకోర్టులో ‘న్యాయం’ జరుగుతుందని ఆయన ధీమా కాబోలు. కానీ లోకాయుక్త న్యాయస్థానంవారు ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయకముందే హైకోర్టుకెక్కడం గుర్రానికి ముందు బండిని కట్టేసినట్టయింది. న్యాయస్థానంలో హాజరు కావాలంటూ లోకాయుక్త కృష్ణకు ‘సమన్లు’ జారీ చేయలేదు. ఆయనను అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులను ఆదేశిస్తూ ‘వారెంటు’ పంపలేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగిన తర్వాత మాత్రమే హైకోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేసి ఉండవలసింది. తక్షణం చేసి ఉండవలసిన పని పదవిని పరిత్యజించడం. అలా చేసివుండినట్లయితే ‘మచ్చలేని నాయకుడన్న’ ప్రచారానికి సార్ధకత ఏర్పడివుండేది.‘రక్షిత అటవీ భూములలో గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వరాదని’ ముఖ్యమంత్రిగా వుండిన సమయంలో కృష్ణకు సంబంధిత మంత్రిత్వ విభాగం కార్యదర్శి లిఖిత పూర్వకంగా సలహా ఇచ్చాడట! కానీ ఈ సముచిత సూచనను కృష్ణ నిర్ద్వద్వంగా తిరస్కరించాడట. ఈ ‘నిర్ణయం’ అనేక ఏళ్ళుగా ఖనిజాలను దోచిపారేస్తున్న ‘కామందులకు’ తలుపులు తెరచిందన్నది ఫిర్యాదు పత్రంలోని ప్రధానాంశం. విదేశాంగ మంత్రిగా కృష్ణ మందగొడితనానికి మారుపేరుగా ప్రసిద్ధి కెక్కాడు. ఆయన నైతిక నిష్టను గురించి ఎవరూ వేలెత్తలేదు! కృష్ణ నిజాయతీపరుడన్న కారణంగానే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసింది. ఇందుకోసం ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది! మరి ఇప్పుడెందుకు రాజీనామా చేయరు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి