1, డిసెంబర్ 2011, గురువారం

ఆర్భాటపు ‘విముక్తి’!

రెండవతరం టెలికాం తరంగాల-2జి స్పెక్ట్రమ్- కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో నిందితురాలు కనిమోళికి బెయిల్ లభించడం ఆశ్చర్యం కాదు. విచారణలో ఉన్న నిందితుల ‘నిర్బంధం’ గురించి ఈనెల 23వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీఎస్ సింఘ్వీ, హెచ్‌ఎల్ దత్తు చేసిన సుదీర్ఘ వ్యాఖ్యానం గురించి విన్న వారందరికీ కనిమోళికి అతి త్వరలో ‘బెయిల్’ లభించడం ఖాయమనే భావన కలిగింది. విచారణకు గురవుతున్న నిందితులను ‘బెయిల్’పై జైలునుంచి విడుదల చేయడమే వ్యవస్థీకృతమై ఉన్న న్యాయ నిబంధన అనీ, నిర్బంధం లోనే నిందితులను కొనసాగించడం ఈ నిబంధనకు అపవాదం మాత్రమేనని సర్వోన్నత న్యాయమూర్తులు స్పష్టం చేయడం ఈ కేసుకు సంబంధించిన కొత్త మార్గదర్శక సూత్రంగా మారింది. అందువల్ల ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు, కనిమోళిని మరో నలుగురిని ‘బెయిల్’పై విడుదల చేయాలని ఆదేశించడం ఊహించని పరిణామం కానేకాదు. సుప్రీంకోర్టువారి మార్గదర్శక సూత్రం వల్ల ప్రయోజనం పొందగలిగిన మొదటి నిందితురాలు బహుశా కనిమోళి! ఆమెతోపాటు ఆమె వాణిజ్య సహచరుడు కలైంగర్ టెలివిజన్ నిర్వాహకుడు- మేనేజింగ్ డైరెక్టర్-శరద్ కుమార్‌కు మరో ముగ్గురికి కూడా తాత్కాలిక బంధ విముక్తి కలగడానికి కారణం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిందితుల అనవసర నిర్బంధం గురించి చేసిన వ్యాఖ్యలే కారణం కావచ్చు. కేసుకు సంబంధించిన నేరం గురించి పోలీసులు లేదా ‘సిబిఐ’ వంటి ప్రత్యేక పరిశోధన బృందాల వారు దర్యాప్తును జరుపుతున్న సమయంలో నిందితులను న్యాయ నిర్బంధంలో ఉంచడం పరిపాటి. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఘరానా నిందితులు బయట స్వేచ్ఛగా ఉన్నట్టయితే వారు దర్యాప్తు ప్రక్రియను నిరోధించవచ్చునని లేదా సాక్షులను ప్రభావితం చేయవచ్చునని, ప్రలోభ పెట్టవచ్చునని, భయపెట్టవచ్చునని ‘ప్రాసిక్యూషన్’ వారు వాదించడం కూడా న్యాయ సంప్రదాయమైపోయింది. కానీ దర్యాప్తు పూర్తయిన తర్వాత, ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా న్యాయస్థానంలో నిందితులకు వ్యతిరేకంగా ‘అభియోగ పత్రం’ దాఖలయిన తరువాత వారిని నిర్బంధం నుంచి విడుదల చేయడమే న్యాయమని సుప్రీంకోర్టు నిగ్గు తేల్చింది. ఈనెల 23వ తేదీన విడుదలయిన ఐదుమంది ఘరానా కార్పొరేట్ నిందితులకు వ్యతిరేకంగా కూడా చార్జిషీటు దాఖలైపోయింది. కానీ ఆతరువాత కూడా కింది న్యాయస్థానాలు వారిని బెయిల్‌పై విడుదల చేయలేదు. నిందితులందరూ దేశాన్ని కుదిపేసిన లక్షాడెబ్బయి ఆరువేల కోట్ల రూపాయల కుంభకోణం కేసునకు సంబంధించిన వారైనందున, ప్రత్యేక పరిస్థితుల ప్రాతిపదికగా వారిని విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధంలో వుంచడమే సమంజసమని ప్రత్యేక న్యాయస్థానం భావించివుండవచ్చు.
‘డైనమిక్స్ రియాల్టీ’ అనే వాణిజ్య సంస్థ ‘కలైంగర్’ టెలివిజన్ సంస్థకు బదిలీ చేసిన రెండువందలకోట్ల రూపాయల గుట్టు రట్టు కావడం గత మేనెలలో కనిమోళి అరెస్టు కావడానికి దారితీసిన పరిణామం. కనిమోళి ‘ద్రవిడ మునే్నట్ర కజగం’ పార్టీలో ప్రముఖ నాయకురాలు మాత్రమే కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కూడా కావడం వల్ల ఆమె అరెస్టు గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఈ సంచలన ప్రభంజనం ఇప్పటికీ ప్రసార మాధ్యమాలను ముంచెత్తుతుండడం సమస్యకు కాక వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే దుష్ట సంప్రదాయానికి మరో ప్రత్యక్ష సాక్ష్యం. కలైంగర్ టెలివిజన్ సంస్థలో ప్రధాన భాగస్వామి కనిమోళి. కానీ తనకు తెలియకుండానే తమ సంస్థకు అక్రమంగా రెండువందలకోట్ల రూపాయలు లభించినట్టు కనిమోళి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ‘డైనమిక్స్ రియాల్టీ’ వారు ‘కలైంగార్’కు పంచిన సొమ్ములో తనకు ఎటువంటి వాటా లేదన్నది కనిమోళి వాదనలోని సారాంశం. ఎ.రాజా మంత్రిగా వుండి నిర్వహించినట్టు ఆరోపితమవుతున్న ‘టెలికాం’ కుంభకోణంలో ‘డైనమిక్స్ రియాల్టీ’ సంస్థకు కూడ భాగస్వామ్యం వుంది. టెలికాం తరంగాల కేటాయింపులలో రాజా ఈ సంస్థకు భారీగా అక్రమ ప్రయోజనం కలిగించాడని, అలా మూటకట్టుకున్న వేలాది కోట్ల రూపాయల పాపపు సొమ్ములో ‘డైనమిక్స్ రియాల్టీ’వారు డిఎంకె వారికి వాటాలు పంచారని ప్రముఖంగా ప్రచారమైంది. విచారణ పూర్తయతే కాని ఈ ఆరోపణల నిగ్గు తేలదు. కానీ ఈ కేసులో ఆరోపణలు మొదలయినప్పటి నుంచీ ఇప్పటి వరకు కూడా కనిమోళి తాను నిర్దోషినన్న భావం కలిగించేందుకు విచిత్ర అభినయ విన్యాసాలను చేస్తూనే వుంది. తాను మహిళ కాబట్టి తనను సిబిఐ వారు అరెస్టు చేసిన వెంటనే వదలి పెట్టే విధంగా ముందస్తు ‘బెయిలు’ మంజూరు చేయాలని ఆమె గత మే నెలలోనే వాదించింది. ముందస్తు ‘బెయిల్’ మంజూరు కాకపోవడం వేరే సంగతి. కానీ జైల్లో ఉంటూ ‘బెయిల్’ కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ కూడ కనిమోళి మహిళా వాదానే్న వినిపించి మహిళలకు తలవంపులు తెచ్చింది. తాను నిర్దోషిని కాబట్టి విచారణ పూర్తయ్యే వరకు నిర్బంధ విముక్తి కలిగించాలని కోరడం వేరు. కానీ తాను గృహిణి కాబట్టి, బడికి వెళ్ళే పిల్లలున్నారు కాబట్టి, తాను లేకపోతే ఇంటిలో ఎవరూ వంట చేయరు కాబట్టి..అంటూ అనర్హమైన సానుభూతిని సంపాదించడానికి ఒక రాజ్యసభ సభ్యురాలు యత్నించడం న్యాయప్రక్రియను తప్పుదారి పట్టించడంలో భాగం.
కనిమోళికి లభించింది తాత్కాలిక నిర్బంధ విముక్తి మాత్రమే. కానీ ఆమె నిర్దోషిగా బయట పడిందన్న అభిప్రాయం కలిగేలా ‘అభిమానులు’ ఆర్భాటం చేస్తున్నారు. దృశ్యమాధ్యమాలవారు చేస్తున్న హడావుడి ఈ ఆర్భాటానికి మరింత ప్రచారాన్ని సమకూర్చి పెడుతోంది. డిఎంకెవారు ఆనందోత్సాహాలతో విజయోత్సవాలనే జరిపేస్తున్నారు. 1996లో జరిగిన మరో టెలికాం కుంభకోణంలో దోషిగా ధ్రువపడిన మాజీ కేంద్ర మంత్రి, సుఖ్‌రామ్‌కు కూడా ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. కానీ కనిమోళి ‘విడుదల’కు జరిగిన ఆర్భాటంలో సహస్రాంశం కూడా సుఖ్‌రామ్ విషయంలో జరగడంలేదు. ఇప్పుడు మాత్రమే కాదు, ఆమెపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా కనిమోళిని ప్రజాదరణ కలిగిన కథానాయికగా చిత్రీకరించడానికి తెరముందు తెరవెనుక జరుగుతున్న తతంగం న్యాయప్రక్రియను, ప్రజాస్వామ్యవ్యవస్థను వెక్కిరిస్తూనే వుంది. చార్జ్‌షీటు దాఖలు కాకముందే ఏ. రాజాను అరెస్ట్ చేసిన సిబిఐ వారు, ఏప్రిల్‌లో కనిమోళికి వ్యతిరేకంగా చార్జ్‌షీటు దాఖలయిన తరువాత దాదాపు మూడు వారాల వరకు అరెస్టు చేయలేదు. చార్జిషీటు దాఖలు కావడానికి ముందే ‘ప్రథమ ఫిర్యాదు పత్రం’- ఎఫ్‌ఐఆర్-ఆధారంగా నిందితులను అరెస్టు చేయడం సర్వసాధారణం. కానీ ఈ స్ఫూర్తికి విరుద్ధంగా సిబిఐ వ్యవహరించింది. అంతేకాదు, గత రెండు నెలలుగా‘సిబిఐ’ వారు కనిమోళికి ‘బెయిల్’ మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని న్యాయస్థానాలకు నివేదించడం మరో విచిత్రం. ఈ కేసులోని ఇతర నిందితులకు ఒక సూత్రాన్ని, కనిమోళి విషయంలో మరో సూత్రాన్ని పాటించడం సిబిఐని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్వాహకుల ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసింది. కనిమోళికి బెయిల్ లభించడం టెలికాం కుంభకోణంలో ప్రధాన అంశం కాదు. నేరస్థులు ఎవరో న్యాయప్రక్రియ ద్వారాగానీ నిగ్గుతేలడం దేశప్రజల అభీష్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి